Sunday, December 22, 2024

చందా కొచ్చర్ అరెస్టు ‘అధికార దుర్వినియోగం’

- Advertisement -
- Advertisement -

సిబిఐపై బాంబే హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : వీడియోకాన్ రుణం మోసం కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ల అరెస్టు విషయంలో సిబిఐ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో కొచ్చర్ జంటకు కోర్టు బెయిల్ పిటిషన్‌ను ఆమోదించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని విచారణ సందర్భంగా కోర్టు సిబిఐని మందలించింది. ఈ అరెస్టు అవసరమని నిరూపించే సాక్ష్యాలను సమర్పించడంలో సిబిఐ విఫలమైందని హైకోర్టు పేర్కొంది.

ఈ అరెస్టు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. విచారణకు చందా కొచ్చర్, ఆమె భర్త సహకరించడం లేదన్న సిబిఐ వాదనను అంగీకరించేందుకు కూడా కోర్టు నిరాకరించింది. రాజ్యాంగం ప్రకారం విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితుడికి ఉందని, దీన్ని విచారణకు సహకరించకపోవడంగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. రూ.3,250 కోట్ల వీడియోకాన్ రుణం కేసులో 2022 డిసెంబర్ 23న కొచ్చర్ దంపతులను అరెస్టు చేశారు.

చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌ల అరెస్ట్ చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు బెంచ్ గతంలో ప్రకటించింది. 2023 జనవరి 9న అరెస్టు అయిన వెంటనే కొచర్ దంపతులకు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. కొచ్చర్‌తో పాటు వీడియోకాన్ గ్రూప్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌ను కూడా సిబిఐ అరెస్టు చేసింది. ఆయనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో బెయిల్ కూడా మంజూరు చేసింది. బ్యాంకింగ్ నిబంధనలు, ఆర్‌బిఐ మార్గదర్శకాలు, బ్యాంక్ క్రెడిట్ విధానాన్ని ఉల్లంఘించి వీడియోకాన్ గ్రూపు కంపెనీలకు రూ.3,250 కోట్ల రుణాలను ఐసిఐసిఐ బ్యాంక్ తప్పుగా మంజూరు చేసిందని సిబిఐ ఆరోపించింది. బ్యాంకు రుణాల కేసులో మోసం చేసిన కేసులో కొచ్చర్ దంపతులను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News