Wednesday, January 22, 2025

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం.. ఇదొక ‘బ్లాక్ డే’: కూనంనేని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం అన్యాయమని, ఇదొక ‘బ్లాక్ డే’గా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభివర్ణించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన ఎపి సిఎం జగన్ రెడ్డిని బైట వదిలేసి, రూ.వంద కోట్ల వ్యవహారంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేయడం ద్వారా ప్రధాని మోడీ తన ప్రత్యర్థుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోందన్నారు. బిజెపి అనుకున్నట్లుగా సీట్లు వస్తే ఏ రాష్ట్రంలో ఏ వ్యక్తిని కూడా బతనివ్వబోరని, చివరకు సిఎం రేవంత్‌ రెడ్డికి కూడా ప్రమాదం తీసుకువస్తారన్నారు. ఒక హిట్లర్, ఒక ముస్సోలిని , ఫాసిజం, నాజీయిజం అన్ని కలబోసిన వ్యక్తి మోడీ అని, అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబ్ ఆయనలో దాగి ఉన్నడన్నారు.

భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చి, శాశ్వత అధ్యక్షునిగా మారాలని మోడీ భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునేందుకు ఏ నిమిషం, ఏదైనా చేసేందుకు నరేంద్ర మోడీ సిద్ధంగా ఉంటారని విమర్శించారు. ప్రమాదకరమైన ప్రధాని నరేంద్ర మోడీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలలో చైతన్యం రావాలన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు హైదరాబాద్ రెండు రోజుల పాటు జరిగాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ, కళవేణశంకర్, బాలనర్సింహా, ఇ.టి.నర్సింహాతో కలిసి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్ మగ్ధూంభవన్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశ వివరాలను వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలు, కాంగ్రెస్ ఎన్నికల అవగాహన అంశంపైన సమావేశంలో చర్చించామని, కాంగ్రెస్ సీట్లు సర్దుబాటుపై స్పష్టత వచ్చిన తర్వాత మరోసారి చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. బాండ్స్ ద్వారా సేకరించిన అక్రమ డబ్బుతో ప్రతిపక్షాలను, ‘ఇండియా కూట మి’ని ధ్వంసం చేసి, 400 స్థానాల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, మరోవైపు మేథావులు, సాఫ్ట్‌వేర్ నిపుణులతో ఇవిఎం యంత్రాలను ట్యాపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏ ఒక్క బిజెపి నేతను కూడా అరెస్ట్ చేయలేదన్నారు. సిసోడియాను అరెస్ట్ చేసినప్పుడే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి మధ్య అవగాహన ఉన్నందునే అప్పుడు అరెస్ట్ చేయ లేదని విమర్శించారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇద్దరు సిఎంలను ఇప్పటికే అరెస్ట్ చేశారన్నారు. బిర్లా, సహారా కంపెనీలపై ఐటి దాడులు నిర్వహిస్తే, 2013లో అప్పటి గుజరాత్ సిఎం నరేంద్ర మోడీకి బిర్లా కంపెనీ రూ. 24 కోట్లు, సహారా కంపెనీ రూ.40 కోట్లు చెల్లించినట్టుగా ఆధారాలు లభించాయని, దీనిపైన ఇడి ఎందుకు విచారణ చేపట్టలేదని కూనంనేని ప్రశ్నించారు.

ఈ కేసులో మోడీపై ఇడి కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టిందని విమర్శించారు. ప్రమాద కరమైన బిజెపిని ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ, సిపిఐ(ఎం) కలుపుకుపోవాలని కూనంనేని సాంబశివరావు సూచించారు. కమ్యూనిస్టు పార్టీలను కూడా కాంగ్రెస్ కలుపుకుని పోతే మంచిదన్నారు. దక్షిణాదిలోకి బిజెపి రాకుండా జాగ్రత్త వ్యవహారించాలన్నారు. బిజెపిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సమర్దవంతమైన పాత్రను పోషించడంలేదని విమర్శించారు. తెలంగాణలో సిపిఐ, సిపిఐ(ఎం) పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా సర్దుబాటు జరగలేదని, తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని ఆయన కాంగ్రెస్ కు సూచించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ సిఎఎ తర్వాత ఎంపిఆర్ కూడా అమలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News