మన తెలంగాణ/ హైదరాబాద్ : ఇప్లూలో విద్యార్ధినిపై దాడి జరిగిన వారికి భద్రత కల్పించడంలో అడ్మినిస్ట్రేషన్ విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మండిపడ్డారు. క్యాంపస్ లో విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విసి నిర్లక్ష్యం చేస్తున్నారని అతని పదవికాలం పూర్తయిన కేంద్ర ప్రభుత్వం అండతో యూనివర్శీటీలో విద్యార్ధి హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. సోమవారం నిరసన దీక్ష చేస్తున్న విద్యార్ధులను ఉస్మానియా యూనివర్శీటీ పోలీసులు గేట్లకు తాళం వేసి నిర్బంధం చేశారని వారికి మద్దతుగా నిలబడిన హెచ్.సి.యు. విద్యార్ధులను గేట్ ముందు బలవంతంగా అరెస్టు చేయడం సరికాదన్నారు.
అరెస్ట్ చేసిన విద్యార్ధులలో 16మంది అమ్మాయిలను సాయంత్రం 7.00 గంటల వరకు నిబంధనలు అతిక్రమించి పోలీసు స్టేషన్‌లో నిర్బందించి అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 మంది విద్యార్ధులపై క్రిమినల్ కేసులు పెట్టారని వారి వివరాలు చెప్పాలని, ఆధార్ కార్డులు ఇవ్వాలని బలవంతంగా బెదిరింపులు చేశారని పేర్కొన్నారు. తక్షణమే వైస్- ఛాన్సలర్ ను భర్తరఫ్ చేసి, విద్యార్థులపై దాడి చేసి అక్రమంగా పెట్టిన కేసులను రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.