106కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర స్మగ్లర్‌ను రాచకొండ పరిధిలోని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు, భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 106కిలోల గంజాయి, రూ.10,200 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.16లక్షలు ఉంటుంది. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఎపిలోని శ్రీకాకులం జిల్లాకు చెందిన మక్కా కృష్ణ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఈస్ట్‌గోదావరి జిల్లా, చింతూరులో ఉంటున్నాడు. ఒడిసా రాష్ట్రానికి చెందిన రాము ఇద్దరు కలిసి గంజాయి సప్లయ్ చేస్తున్నారు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న కృష్ణకు గంజాయి సరఫరా చేసే రాము పరిచయం అయ్యాడు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణ గంజాయి సరఫరా చేసేందుకు రాము ఒప్పించాడు. తాను అందజేసిన గంజాయిని హైదరాబాద్ పరిసరాల్లో తను చెప్పిన వారికి అందజేయాలని చెప్పాడు. సులభంగా డబ్బులు వస్తుండడంతో దానికి అంగీకరించాడు. గంజాయి ఒక్కసారి సరఫరా చేస్తే రూ.20 నుంచి 30,000 కమీషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. గత నెల 30వ తేదీ ఉదయం రాము 106కిలోల గంజాయిని తీసుకుని వచ్చి కృష్ణకు అప్పగించాడు. తాను చెప్పిన వ్యక్తికి హైదరాబాద్ శివారులో అప్పగించాలని చెప్పాడు. గంజాయితో ట్రాలీ ఆటోలో బయలుదేరిన కృష్ణ రాయగిరి ఎక్స్ రోడ్డు వద్ద రాము ఫోన్ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇన్సస్పెక్టర్లు సుధాకర్, వెంకట్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.