తెలంగాణ, విదేశీ యూనివర్సిటీ సర్టిఫికేట్ల తయారీ
ఇంజనీరింగ్, డిగ్రీ సర్టిఫికేట్లు
రూ.50,000 నుంచి రూ.75,000 వసూలు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 220 నకిలీ సర్టిఫికేట్లు, కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని యాకత్‌పురా, మదీనా నగర్‌కు చెందిన సయిద్ నవీద్ అలియాస్ ఫైసల్ క్యూబెజ్ ఓవర్ సీస్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిర్వహిస్తున్నాడు. గౌలిపురకు చెందిన సయిద్ ఓవైసి అలీ అలియాస్ ఓవైసి డిటిపి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఆన్‌లైన్ వర్క్, డిటిపి వర్క్, వీసా ప్రాసెసింగ్, సర్టిఫికేట్ వర్క్ తదితర పనులు చేసేవారు. ఈ వ్యాపారంలో నష్టాలు రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి డిగ్రీ, ఇంజనీరింగ్, విదేశీ యూనివర్సిటీల సర్టిఫికేట్లకు డిమాండ్ ఉండడంతో వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు.
మెడికల్ సర్టిఫికేట్లు, సాలరీ స్లిప్స్, జాబ్ ఆఫర్ లెటర్లు తయారు చేసేందుకు రూ.50,000 నుంచి రూ.75,000 తీసుకుంటున్నారు. అవసరం ఉన్న వారికి పాస్ అయిన వారి సర్టిఫికేట్లను స్కాన్ చేసి దానిపై ఉన్న నంబర్, పేరుమార్చి అవసరం ఉన్న వారికి ఇస్తున్నారు. విదేశీయూనివర్సిటీలు యూకెలోని టీసైడ్, యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్‌పూల్, యూనివర్సిటీ ఆఫ్ లా, హరియోట్‌వాట్ యూనివర్సిటీ, స్కాట్‌లాండ్, యూనివర్సిటీ ఆఫ్ షిల్లర్, అమెరికా, యూనివర్సిటీ ఆఫ్ కోన్‌కోరిడియా సర్టిఫికేట్లకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్ కోసం ఇచ్చారు. నిందితులపై గతంలో సైఫాబాద్, అబిడ్స్ రోడ్డు, ముషీరాబాద్, నిజామాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ ఎండి అబ్దుల్ జావీద్, ఎస్సైలు శ్రీధర్, శ్రీనివాసులు, ఎండి షానవాజ్ తదితరులు పట్టుకున్నారు.