ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బైక్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
ఒంటరిగా వచ్చే వారే టార్గెట్
దాడి చేసి డబ్బులు, బంగారు ఆభరణాలు చోరీ
అరెస్టు చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్: అర్ధరాత్రి ఒంటరిగా వస్తున్నవారిపై కారంపొడితో దాడి చేసి గాయపర్చి బంగారు ఆభరణాలు, డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు పేపర్ కటింగ్ బ్లేడులు, కారంపొడి, మూడు బైక్‌లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….మేడ్చెల్‌మల్కాజ్‌గిరి జిల్లా, మల్లాపూర్, గోకుల్ నగర్‌కు చెందిన సయిద్ అఫ్రోజ్ అలీ అలియాస్ సయిద్ నిజాం అఫ్రోజ్ అలీ అలియాస్ మిర్జా వాప్యారం చేస్తున్నాడు. నగరంలోని మలక్‌పేట, అజంపురకు చెందిన అబ్దుల్ గౌస్ అలియాస్ అలీ సైన్‌బోర్డు పనిచేస్తున్నాడు. చంచల్‌గూడకు చెందిన సయిద్ జిలానీ అలియాస్ సయిద్ జహంగీర్ పాషా ఖాద్రి అలియాస్ జహంగీర్ బాబా అలియాస్ ఇచ్చో వాల్‌పేయింటింగ్ పనిచేస్తున్నాడు, ఎండి అర్బాజ్ కార్ డేకార్‌లో పనిచేస్తున్నాడు.
రాంనగర్‌కు చెందిన ఎండి ముస్తఖీన్ ఖాన్ అలియాస్ సోయబ్ కెఎఫ్‌సిలో పనిచేస్తున్నాడు. ఐదుగురు నిందితులు గత ఐదేళ్ల నుంచి స్నేహితులు, మద్యం, సిగరేట్లు, గంజాయి తాగేందుకు బానిసలుగా మారారు. దోపిడీలో ప్రధాన నిందితుడిగా ఉన్న సయిద్ అఫ్రోజ్ అలీ సయిద్ నిజాం అఫ్రోజ్ అలీ ఇప్పటి వరకు 46 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దొంగతనం, చైన్‌స్నాచింగ్, దోపిడీ తదితర నేరాలు హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్, కర్నాకటలో చేశాడు. సంతోష్‌నగర్ పోలీసులు 2015లో పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి అక్టోబర్ 29, 2016లో విడుదల కాగా రాజేంద్రనగర్ పోలీసులు మళ్లీ 2018లో పిడి యాక్ట్ పెట్టారు. సయిద్ జిలానీ అలియాస్ సయిద్ జహంగీర్ పాషా ఖాద్రీ గతంలో ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దొంగతనాలు చేశాడు. తరచూ ఐదుగురు కలుసుకుని పలు ప్రాంతాల్లో మద్యం, సిగరేట్లు తాగేవారు.
ఈ నెల 7వ తేదీన నిందితులు అందరూ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలుసుకున్నారు. దోపిడీ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. కటింగ్ బ్లేడ్లు, కారం పొడి కొనుగోలు చేసి బయలుదేరారు. రాత్రి 11.30 గంటల సమయంలో బైక్‌లపై బయలుదేరి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 92కు చేరుకున్నారు. అటువైపు బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీనికి అతడు నిరాకరించడంతో అందరూ కలిసి కొట్టారు, మెడలోని బంగారు చైన్‌ను తీసుకునేందుకు యత్నించారు. అతడి వద్ద నుంచి డబ్బులు, బైక్‌ను తీసుకున్నారు. అదేసమయంలో అటువైపు వచ్చిన ఆటో డ్రైవర్‌పై దాడి చేసి రూ.1,9000 నగదు, మొబైల్ ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 2గంటలకు మలక్‌పేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. టాప్ అండ్ టౌన్ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతున్నారు.
వారిని బెదిరించి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీనికి వారు నిరాకరించడంతో దాడి చేశారు. వారు ఎదురు తిరిగి దాడి చేయడంతో నిందితుడు ఎండి మహ్మద్ అలియాస్ అబ్దుల్ రెహమాన్‌కు గాయలై స్పృహ కోల్పోయాడు. మద్యం తాగుతున్న వ్యక్తికి గాయాలు అయి రక్తస్రావం జరిగింది. దీంతో మిగతా నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఎండి మహ్మద్ అలియాస్ అబ్దుల్ రెహమాన్‌ను చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలించి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు మల్లికార్జున్, ఎండి ముజఫర్‌అలీ, రంజిత్‌కుమార్, షేక్ కవిఉద్దిన్ నిందితులను పట్టుకున్నారు.