మనతెలంగాణ, సిటిబ్యూరోః ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను బహదుర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 గ్రాముల బంగారం, రూ.1.42లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బహదుర్‌పుర ఇన్స్‌స్పెక్టర్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని కిషన్‌బాగ్‌కు చెందిన ఠాకూర్ ఉదయ్ సింగ్, సయిద్ సోహెబ్ అహ్మద్ కలిసి చోరీలు చేస్తున్నారు. ఠాకూర్ ఉదయ్ సింగ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. వ్యసనాలకు బానిసగా మారడంతో డబ్బులు లేవు.
దీంతో మరో వ్యక్తితో కలిసి 2021లో నగరంలోని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేసి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సోహెబ్‌తోకలిసి చోరీలు చేశాడు. బహదుర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ చేసి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకుని వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు.