సైబర్‌నేరస్థులకు బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చిన నిందితులు
అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః సైబర్ నేరస్థులకు కమీషన్ తీసుకుని బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన నగరానికి చెందిన ఇద్దరు యువకులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని బేగంపేటకు చెందిన గుడ్డింగారి వెంకటేస్, మల్కాజ్‌గిరికి చెందిన మొలుగూరి విజయ్ ఇ్దద్దరు డబ్బులు తీసుకుని తమ బ్యాంక్ ఖాతాల వివరాలను సైబర్ నేరస్థులకు ఇచ్చారు. బోయిన్‌పల్లికి చెందిన బాధితుడికి సైబర్ నేరస్థులు వాట్సాప్, టెలీగ్రాంలో కాంటాక్ట్‌లోకి వచ్చారు. తాము చెప్పినట్లు రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయని చెపారు.
బాధితుడు సైబర్ నేరస్థులు చెప్పినట్లు ముందుగా గూగుల్ మ్యాప్స్‌లో తక్కువ డబ్బులు పెట్టి రేటింగ్ ఇచ్చాడు. తర్వాత భారీ ఎత్తున డబ్బులు పెడితే ఎక్కువగా డబ్బులు వస్తాయని చెప్పడంతో రూ.7,15,000 పెట్టాడు. అప్పటి నుంచి సైబర్ నేరస్థులు స్పందించడం మానివేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఇలాగే అమాయకుల నుంచి రూ.3కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. నిందితులపై దేశవ్యాప్తంగా 104 కేసులు నమోదు అయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నిందితులపై 13 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు డబ్బులు స్థానికంగా ఉన్న బ్యాంక్ ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ నరేష్, ఎస్సై శైలేంద్ర, పిసిలు రఘు, గజేశ్వర్ తదితరులు దర్యాప్తు చేశారు.