దక్షిణ కొరియాలో స్వల్ప కాలం సాగిన మార్షల్ లా ప్రకటించినందుకు అభిశంసనకు గురైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను నిర్బంధించేందుకు, ఆయన కార్యాలయాన్ని, నివాసాన్ని సోదా చేసేందుకు ఒక న్యాయస్థానం మంగళవారం వారంట్లు జారీ చేసింది. ఆయన మార్షల్ లాను ప్రకటించడం తిరుగుబాటుకు దారి తీసిందా అనేది తాము దర్యాప్తు జరుపుతున్నామని దక్షిణ కొరియా అవినీతి నిరోధక సంస్థ తెలియజేసింది. యూన్‌ను లాంఛనంగానైనా పదవిలో నుంచి తొలగించనిదే ఆయనను నిర్బంధించేందుకు లేదా సోదాలు చేసేందుకు అవకాశాలు స్వల్పమేనని నిపుణులు ఇప్పటికీ చెబుతున్నారు. యూన్‌ను నిర్బంధించేందుకు, మధ్య సియోల్‌లోని అధ్యక్ష కార్యాలయాన్ని, నివాసాన్ని సోదా చేసేందుకు సియోల్ పశ్చిమ జిల్లా కోర్టు వారంట్లు జారీ చేసినట్లు అవినీతి దర్యాప్తు శాఖ ఉన్నత స్థాయి అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
పోలీసులు, సైనికాధికారులతో కలసి ఆ శాఖ సమష్టిగా దర్యాప్తునకు ఆధ్వర్యం వహిస్తోంది. కొరియన్ చట్టం ప్రకారం, తిరుగుబాటు సారథి దోషిగా నిర్ధారితుడైతే మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష ఎదుర్కొనవచ్చు. యాన్‌కు చాలా వరకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి అధ్యక్షునిగా క్షమాభిక్ష ఉంటుంది. కానీ ఆ వెసులుబాటు తిరుగుబాటు లేదా దేశద్రోహం ఆరోపణలకు వర్తించడు. మార్షల్ లా విధించినందుకు యూన్‌ను అభిశంసించేందుకు తీర్మానానికి అనుకూలంగా ప్రతిపక్షం నియంత్రణలోని జాతీయ అసెంబ్లీ డిసెంబర్ 14న వోటు వేసిన దరిమిలా ఆయన అధికారాలను సస్పెండ్ చేశారు. మార్షల్ లా విధింపు వల్ల వందలాది మంది జవానుఏ్ల, పోలీస్ అధికారులు సియోల్ వీధుల్లోకి వచ్చారు. కాగా, యూన్‌ను అధ్యక్షుడుగా బర్తరఫ్ చేయాలా లేక ఆయనను పునర్నియమించాలా అనేది రాజ్యాంగ న్యాయస్థానం తేల్చనున్నది. వారంట్లను యూన్ ఖాతరు చేయకపోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.