కోల్‌కత: నారద స్టింగ్ కేసులో సిబిఐ అరెస్టు చేసిన రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ, టిఎంసి ఎమ్మెల్యే మదన్ మిత్ర, టిఎంసి మాజీ నాయకుడు సోవన్ చటర్జీలను అస్వస్థత కారణంగా మంగళవారం ఆసుపత్రికి తరలించారు. ఇదే కేసులో అరెస్టు అయిన టిఎంసి మంత్రి ఫిర్హద్ హకీమ్‌కు జ్వరం రావడంతో ఆయనను కూడా కారాగారంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిత్ర, చటర్జీలకు శ్వాసకోశ ఇబ్బంది తలెత్తడంతో వారిని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ నలుగురు నేతలను సోమవారం ఉదయం సిబిఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రత్యేక సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయగా దానిపై కోల్‌కత హైకోర్టు డివిజ్ బెంచ్ స్టే ఇచ్చింది.
నారద న్యూస్ అనే వెబ్ పోర్టల్‌కు చెందిన మాథ్యూ శామ్యుల్ 2014లో ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా ఒక బూటకపు కంపెనీ నుంచి ముడుపులు స్వీకరిస్తూ కొందరు టిఎంసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కెమెరాకు చిక్కినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ టేపులు బటయపడగా 2017మార్చిలో స్టింగ్ ఆపరేషన్‌పై సిబిఐ దర్యాప్తునకు కోల్‌కత హైకోర్టు ఆదేశించింది.