Sunday, January 19, 2025

6న ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల కమిటీ రాక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్‌ను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించింది. అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో సెంట్రల్ సాయిల్ మెటిరియల్స్ రిసెర్చి సంస్థకు చెందిన శాస్త్రవేత్త యు.సి. విద్యార్థి, పూణెకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రిసెర్చ్ కేంద్రం నుంచి ఆర్.పాటిల్, సెంట్ వాటర్ కమీషన్ బిసిడి విభా గం డైరెక్టర్ శివకుమార్ శర్మ, సెంట్రల్ వాటర్ కమీషన్‌లోని గేట్స్ డిజాస్టర్ విభాగం డైరెక్టర్ రాహుల్ కుమార్ సింగ్‌లను అధికారిక సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్‌ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. నేషనల్ డ్యామ్ సేఫ్టి అథారిటి డిప్యూటి డైరెక్టర్ అమిత్ మిట్టల్ ఈ మేరకు అదేశాలు జారీ చేశారు.

మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవటంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం. సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. మూడు బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల అధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టి అథారిటికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ మేరకు ఎన్‌డిఎస్‌ఏకు లేఖ రాశారు. రాష్ట్ర అభ్యర్ధనపై స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ మార్చి 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనుమతి మేరకు కమిటి అవసరమైతే ఇతర సభ్యులను కూడా కోఆఫ్ట్‌చేసుకునే అవకాశం కల్పించింది. కాళేళ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిం చి, కుంగుబాటుకు, పగుళ్లు, నీటి బుంగలు ఏర్పడటానికి గల కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని డ్యామ్‌సేఫ్టీ అథారిటీ ఈ కమిటీకి సూచించింది. ప్రాజెక్టు డాటా, డ్రాయింగ్స్, డిజైన్స్, నిర్మాణంలో ఉపయోగించిన మెటిరీయల్, నిర్మాణంలో నాణ్యత పరీక్షల నివేదిక లు, బ్యారేజిల ఆపరేషన్ నిర్వహణ నివేదికలు ,బ్యారేజిల హైడ్రాలిక్ , స్ట్రక్చరల్, జియోలాజికల్ అంశాలను సమగ్రంగా పరిశీలించి నాలుగు నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది.
ఈ నెల 6న డ్యామ్‌ సేఫ్టీ కమిటీ రాక
గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణల కమిటీ ఈనెల 6న రాష్ట్రానికి రానుంది. గతంలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు బ్యారేజిలో నీటిని ఖాళీ చేసి ఉంచాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ బ్యారేజి పరిశీలన అనంతరం ఎగువన ఉన్న రెండు బ్యారేజిలను పరిశీలించనున్నట్టు తెలిపింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన బుంగలు, నీటి ఊట సమస్యలతోపాటు ఈ రెండు బ్యారేజిల డిజైన్లు, నిర్మాణంలో వాడిన మెటీరియల్, నాణ్యత తదితర అంశాలను పరిశీలించనుంది. ఈ రెండు బ్యారేజిలలో కూడా నిల్వ ఉన్న నీటిని తొలగించి బ్యారేజిలను ఖాళీగా ఉంచాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News