Sunday, December 22, 2024

పేదరికాన్ని జయించి.. ఒలింపిక్ స్వర్ణం సాధించే స్థితికి

- Advertisement -
- Advertisement -

ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో గురువారం అర్ధరాత్రి పెను సంచలనం నమోదైంది. పాకిస్థాన్ యువ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి పెను ప్రకంపనలు సృష్టించాడు. భారత యువ అథ్లెట్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టి అర్షద్ పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఇదే క్రమంలో 40 ఏళ్లుగా పాకిస్థాన్ ఎదురు చూస్తున్న ఒలింపిక్ స్వర్ణ పతకం కలను సాకారం చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన జావెలిన్ త్రో ఫైనల్లో నదీమ్ అసాధారణ ప్రతిభను కనబరిచాడు. నీరజ్ చోప్రా నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించినా అతని కంటే ఎంతో పైస్థాయిలో నిలిచి ఒలింపిక్ ఛాంపియన్‌గా అవతరించాడు. స్వర్ణం సాధించే క్రమంలో నదీమ్ సరికొత్త ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు. నదీమ్ ఏకంగా 92.97 మీటర్ల దూరంలో ఈటెను విసిరి పెను సంచలనం సృష్టించాడు. నీరజ్ కూడా అద్భుత ఆటను కనబరిచినా 90 మీటర్ల మార్క్‌ను అందుకోలేక పోయాడు. నీరజ్ 89.45 మీటర్ల దూరంలో ఈటెను విసిరి రెండో స్థానంతో రజతం దక్కించుకున్నాడు. ఇక ఈసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అండర్సన్ (గ్రెనెడా) కాంస్యం పతకంతో సరిపెట్టుకున్నాడు.

అసాధారణ ప్రతిభావంతుడు..
ఇక ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నదీమ్ అపార ప్రతిభావంతుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్థాన్‌లోని నిరుపేద కుటుంబంలో జన్మించిన నదీమ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. ఏడాదికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇంట్లో మాంసం వండుకునేంత పేదరికం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నదీమ్ నేడు ఒలింపిక్‌లో స్వర్ణం సాధించి ఎందరికో ఆదర్షంగా నిలిచాడు. నదీమ్ తండ్రి ఓ కూలి. అతడి గ్రామంలోని ప్రజలు చందాలేసుకుని నదీమ్‌కు శిక్షణ ఇప్పించారు. నదీమ్ కూడా వాళ్ల నమ్మకాన్ని వమ్ముచేయలేదు. బుద్ధిగా శిక్షణ తీసుకున్నాడు. ఇక ఆటకు అవసరమైన కొత్త పరికరాలు కొనే స్థోమత లేకపోవడంతో పాత వాటినే జాగ్రత్తగా వాడుకన్నాడు. చివరికి విశ్వక్రీడలకు వెళ్లేందుకు సరైన వనరులు లేకపోతే వాటిని సమకూర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు. ఎట్టకేలకు తన కలల వేదికపైకి అడుగుపెట్టి..ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇదే క్రమంలో 40 ఏళళ్లుగా అతడి దేశం పాకిస్థాన్ ఎదురుచూస్తున్న పసిడి పతకం కలను నెరవేర్చాడు. పాకిస్థాన్‌లోని మియా చాను సమీపంలోని ఖనేవాలే గ్రామంలో నదీమ్ 1997 జనవరి 2న జన్మించాడు. అతని తండ్రి మహ్మద్ అష్రఫ్ భవన నిర్మాణరగంలో కూలి.

ఆ కుటుంబంలోని ఏడుగురు సంతానంలో నదీమ్ మూడో వాడు. కాగా, నదీమ్ చిన్నప్పటి నుంచే క్రీడల్లో ముందుండేవాడు. ఆరంభంలో క్రికెట్ ఆడేవాడు. జిల్లా స్థాయి టోర్నీల్లో కూడా ఆడాడు. క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో నదీమ్ అద్భుతంగా రాణించేవాడు. అతని ప్రతిభను కోచ్ రషీద్ అహ్మద్ సాకీ గుర్తించాడు. తన పర్యవేక్షణలో అతడిని తీర్చిదిద్దడం మొదలు పెట్టాడు. నదీమ్ జావెలిన్ కెరీర్ 2015లో ప్రారంభమైంది. తర్వాతి సంవత్సరమే వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి స్కాలర్‌షిప్ అందుకున్నాడు. అంతేగాక మారిషస్‌లోని ఐఎఎఎఫ్ హైపెర్ఫార్మింగ్ ట్రెయినింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నాడు. అయితే కెరీర్ అనుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. పలుసార్లు గాయపడ్డాడు. దీంతోపాటు సొంత దేశం పాకిస్థాన్‌లో అతడికి స్కాలర్‌షిప్ లభించడం కూడా కష్టమైంది. ఇలాంటి స్థితిలో ఆయా టోర్నీలు ఆడేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఖర్చుల కోసం గ్రామంలోని వారు చందాలు వేసుకొని డబ్బులు ఇచ్చేవారు. ఈ విషయాన్ని అర్షద్ తండ్రి స్వయంగా వెల్లడించారు. 2016లో జరిగిన దక్షణాసియా క్రీడల్లో నదీమ్ కాంస్య సాధించాడు.

2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి 90 మీటర్ల మైలురాయిని అందుకుని స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నదీమ్ తన ఒలింపిక్ శిక్షణ మొదలు పెట్టాడు. కానీ, గాయానికి గురవ్వడంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా కూడా గాయాలను తట్టుకుంటూ నదీమ్ ముందుకు సాగాడు. అసాధారణ ఆటతో ఏకంగా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి నయా చరిత్ర సృష్టించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News