Monday, November 25, 2024

స్టాక్స్ పై అసలు జ్ఞానం లేదు: నటుడు అర్షద్ వార్సీ!

- Advertisement -
- Advertisement -

ముంబై: నటుడు అర్షద్ వార్సీ తనకు, తన భార్య మరియా గోరెట్టికి స్టాక్ మార్కెట్‌పై సంపూర్ణ జ్ఞానం లేదని స్పష్టీకరణ చేశాడు. పైగా ట్విట్టర్ ద్వారా చెప్పుడు మాటలు వినొద్దని మదుపరులకు సలహా ఇచ్చాడు. యూట్యూబ్‌లో తప్పుదారి పట్టించే వీడియోలు పెట్టినందుకు వారిద్దరినీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించింది. అర్షద్ వార్సీ, మరియాతోపాటు అనేక సంస్థలను ‘సెబీ’ నిషేధించింది. వారిలో యూట్యూబ్ మనీశ్ మిశ్రా, సాధనా బ్రాడ్‌కాస్ట్ శ్రేయ గుప్తా, గౌరవ్ గుప్తా, సౌరభ్ గుప్తా, పూజా అగర్వాల్, వరుణ్ మీడియాలను నిషేధించింది. వీరంతా మదుపరులను తప్పుదారి పట్టించే(మిస్‌లీడింగ్) వీడియోలను యూట్యూబ్‌లో పెడుతున్నారని, పైగా ఈ కంపెనీల షేర్లు కొనండి అని సిఫార్సులు చేస్తున్నారని ఆరోపణ.

సెబీ జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వు(ఇంటరిమ్ ఆర్డర్) ప్రకారం అర్షద్ వార్సీ రూ. 29.43 లక్షలు, ఆయన భార్య మరియా గోరెట్టి రూ. 37.56 లక్షలు గడించారు. వారు ఈ లాభాలను 2022 ఏప్రిల్ 27 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో గడించారు. సెబీ తాత్కాలిక ఉత్తర్వుల అనంతరం నటుడు అర్షద్ వార్సీ ట్విట్టర్ ద్వారా తనకు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన జ్ఞానంలేదని పేర్కొన్నారు. ఈ కేసులో పేర్కొన్న నటుడు అర్షద్ వార్సీ దంపతులు, ఇతరులు 15 రోజుల్లోగా స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఏదేని షెడ్యూల్డ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలని సెబీ ఆదేశించింది. ‘తమ పేరిట ఉన్న ఆస్తులను అవి స్థిరాస్తులు, చరాస్తులు ఏవేని కావొచ్చు, వాటిని అమ్మేయడానికి వీలులేదు’ అని కూడా పేర్కొంది.

ఇదిలావుండగా ‘మీరు చదివే ప్రతి వార్తని నమ్మకండి. మరియా, నాకు స్టాక్స్‌పై ఎలాంటి జ్ఞానం లేదు. మేము ఇతరుల వలెనే సలహా తీసుకుని శారదలో మదుపు చేశాము. మేము సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాము’ అని అర్షద్ ట్వీట్ చేశాడు. కొన్ని సంస్థలు ప్రైస్ మ్యానిపులేషన్‌కు పాల్పడుతున్నాయి, సాధనా బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్, షార్ప్‌లైన్ బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ షేర్లను వదిలించుకుంటున్నాయి(ఆఫ్‌లోడింగ్ షేర్స్) అని సెబీకి ఫిర్యాదులు అందాక ఇన్వెస్టిగేషన్ మొదలయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News