Friday, November 15, 2024

రసవత్తరంగా మారిన హెచ్‌సిఎ ఎన్నికలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో జరుగున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకప్పుడూ భారత క్రికెట్‌లోని బలమైన సంఘాల్లో ఒకటిగా పేరున్న హెచ్‌సిఎ కొన్నేళ్లుగా వరుస వివాదాలతో పూర్వ వైభవాన్ని కోల్పోయింది. శివలాల్ యాదవ్, అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, అర్షద్ అయూబ్, రాయుడు వంటి స్టార్ ఆటగాళ్లను భారత్‌కు అందించిన ఘనత హెచ్‌సిఎదే. అలాంటి హెచ్‌సిఎ ఇటీవల కాలంలో వరుస వివాదాలతో సతమతమవుతూ వస్తోంది. హెచ్‌సిఎలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు యువ ఆటగాళ్ల కెరీర్‌పై బాగానే ప్రభావం చూపించింది. ఆటగాళ్ల సెలెక్షన్స్, నిధుల దుర్వినియోగం, టికెట్ల విక్రయాల్లో అక్రమాలు, లీగ్ క్రికెట్‌లో ఆడించేందుకు డబ్బులు డిమాండ్ చేయడం వంటి కారణాలతో హైదరాబాద్ క్రికెట్ సంఘం భ్రష్ఠు పట్టిపోయింది. ఇలాంటి పరిస్థుతుల్లో దేశ సర్వోన్నత న్యాయ స్థానం జోక్యంతో హెచ్‌సిఎలో ఎన్నికలకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే హెచ్‌సిఎ పాత పాలక మండలి రద్దయ్యింది. అక్టోబర్ 20న హెచ్‌సిఎ ఎన్నికలు జరుగనున్నాయి.

గతంలో హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని ఏలిన పలువురు ప్రముఖులను ఈసారి సుప్రీం కోర్టు దూరంగా పెట్టింది. సుప్రీం కోర్టు నియమించిన ఏక కమిటీ సభ్యుడు రిటైర్డ్ జస్టిస్ లావు నాగేశ్వర రావు పర్యవేక్షణలో ఈసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీంతో ఎన్నికల్లో విజయం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. దేశంలోని ప్రముఖ క్రికెట్ సంఘాల్లో ఒకటైన హెచ్‌సిఎలో పాగా వేసేందుకు క్రికెట్, రాజకీయ ప్రముఖులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో హెచ్‌సిఎలో కీలక పదవిని నిర్వహించిన మాజీ ఎంపి, బిజెపి నాయకుడు వివేక్ వెంకటస్వామి ఈసారి ఎన్నికల్లో తన వ్యక్తులను గెలిపించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసు శాఖలోని ఒక ఉన్నతాధికారి రంగంలోకి దిగినట్టు సమాచారం. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తిని ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్టు తెలిసింది.

బిఆర్‌ఎస్ మద్దతుతో బరిలో జగన్‌మోహన్ రావు!
మరోవైపు అధికార బిఆర్‌ఎస్ పార్టీ కూడా ఈసారి తన తరఫున బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్టు తెలిసింది. భారత హ్యాండ్‌బాల్ సంఘం ప్రతినిధి, ప్రముఖ విద్యావేత్త అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఈసారి హెచ్‌సిఎ అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్నారు. ఆయనకు ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మంత్రి హరీష్‌రావు మద్దతు ఉన్నట్టు తెలిసింది. వారి మద్దతుతో ఈసారి ఎలాగైనా హెచ్‌సిఎ అధ్యక్ష పదవిని చేపట్టాలని జగన్‌మోహన్ రావు భావిస్తున్నారు. ఇప్పటికే జగన్‌మోహన్ రావు భారత హ్యాండ్‌బాల్ సంఘంలో తన చక్రాన్ని తిప్పారు. పలు వివాదాలతో సతమతమవుతున్న హ్యాండ్‌బాల్ సంఘాన్ని గాడిలో పెట్టిన ఘనత ఆయనకు దక్కుతోంది. హెచ్‌సిఎలో కూడా ఆయనకు కీలక పదవి లభిస్తే ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘంలో నెలకొన్న వివాదాలకు తెరపడుతుందని హెచ్‌సిఎ పరిధిలోని ఆయా క్రికెట్ క్లబ్బుల ప్రతినిధులు భావిస్తున్నారు. ఇక అర్షద్ అయూబ్, శేష్ నారాయన్, జాన్‌మనోజ్, అజారుద్దీన్, శివలాల్ యాదవ్, వివేక్ వెంకటస్వామి తదితరులు కూడా తమ ప్యానెల్‌లనూ గెలిపించుకునేందుకు కసరత్తులు ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలు రసకందాయకంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News