న్యూఢిల్లీ : ప్రముఖ కళా చరిత్రకారులు , రచయిత బిఎన్ గోస్వామి కన్నుమూశారు. 90 సంవత్సరాల గోస్వామి చండీగఢ్‌లోని వైద్య సంస్థ (పిజిఐఎంఇఆర్)లో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సన్నిహితులు, రంగస్థల కళాకారులు నీలం మాన్ సింగ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. గోస్వామికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. చాలాకాలంగా అనారోగ్యంగా ఉన్నారు.
శ్వాసతీసుకోవడం క్లిష్టం అయిందని నీలం తెలిపారు. రంగస్థల, కళారంగంలో గోస్వామిని అంతా ఆదరణ ఆప్యాయతలతో బిఎన్‌జి అని పిలుస్తారు. 1933 ఆగస్టు 15వ తేదీన బ్రిజిందర్ నాథ్ గోస్వామి ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రావియెన్స్‌లోని సర్గోదాలో జన్మించారు. పలు కళాకృతుల విశిష్ట విమర్శకులు, విశ్లేషకులుగా పేరొందిన గోస్వామి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు పొందారు. స్వయంగా పహారీ కళలో ఆరితేరిన వారు. గోస్వామికి కూతురు మాళవిక ఉంది. భార్య కరుణ 2020లో మరణించారు. ఆమె కూడా ఆర్ట్ హిస్టోరియన్‌గా సేవలు అందించారు. పంజాబ్ వర్శిటీలో ఆర్ట్ హిస్టరీ ప్రొఫెసర్‌గా కూడా గోస్వామి వ్యవహరించారు. పలువురు కళాకారులకు తగు స్ఫూర్తి అందించారు.