Wednesday, January 22, 2025

చందమామ పైకి బయల్దేరిన ఆర్టెమిస్ 1

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : దాదాపు రెండు నెలలుగా నాసా కలలు గంటున్న ఆర్టెమిస్1 ప్రయోగం ఎట్టకేలకు విజయవంతంగా మొదలైంది. రెండు హరికేన్లు, సాంకేతిక లోపాలను దాటుకొచ్చింది. బుధవారం తెల్లవారు జామున ఫ్లోరెడా లోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి చరిత్రలోనే అత్యంత ఆర్టెమిస్ 1 రాకెట్ గాల్లోకి ఎగిరింది. భవిష్యత్తులో చంద్రుడి పైకి మనుషులను పంపడానికి ఈ ప్రయోగం దోహదపడనుంది. దీంతోపాటు వ్యోమగాములు లేని ఒరాయన్ స్పేస్ క్యాప్సుల్‌ను కూడా తీసుకెళ్లింది. దాదాపు 25 రోజుల పాటు 1.3 మిలియన్ మైళ్లు ఇది ప్రయాణించనుంది. అమెరికా లోని ఫ్లోరెడా నుంచి ప్రయోగించిన ఆర్టెమిస్1కు సంబంధించిన ట్రాకింగ్ మాత్రం ఐరోపా లోని ఇంగ్లాండ్ నుంచి జరుగుతుంది. ఇక్కడి గూన్‌హిల్లీ ఎర్త్‌స్టేషన్ నుంచి ఒరాయన్ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రయాత్రను ట్రాక్ చేయనున్నారు.

మెర్లిన్ పేరిట నిర్మించిన భారీ డిష్ యాంటెన్నాను ఇందుకోసం వినియోగించనున్నారు. 1969లో నిర్వహించిన చంద్రయాత్రలో కూడా గూన్‌హిల్లీ ఎర్త్ స్టేషన్ కీలక పాత్ర పోషించింది. ఒరాయన్ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి అవకాశం ఉంది. మరో వ్యోమనౌకకు అనుసంధానం కావాల్సిన అవసరం లేకుండానే ఏకబిగిన 21 రోజుల పాటు చంద్రుడి కక్షలో ఇది పనిచేయగలదు.

ఇందులో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ కీలకం. రోదసీ యాత్రలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. క్రూ మాడ్యూల్‌కు ఐరోపా నిర్మించిన సర్వీసు మాడ్యూల్ ఉంటుంది. అది ఇంధనం, శక్తిని అందిస్తుంది. దానికి సౌర ఫలకాలు ఉంటాయి. భూమికి తిరిగి రావడానికి ఒరాయన్ గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణం లోకి దూసుకొస్తుంది. ఆ దశలో గాలి రాపిడి వల్ల ఒరాయన్‌పై 2,750 డిగ్రీల సెల్సియస్ మేర వేడి ఉత్పత్తవుతుంది. దీన్ని తట్టుకునేలా ఆ వ్యోమనౌకకు ప్రత్యేక ఉష్ణరక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News