వాషింగ్టన్ : ఈనెల 22న చంద్రునిపైకి పంపవలసిన ఆర్టెమిస్ 1 రాకెట్ ను ఆగస్టు నాటికి అమెరికా అంతరక్ష సంస్థ నాసా వాయిదా వేసింది. మేలో చివరి పరీక్షగా ప్రచారం జరిగినా రిహార్సల్స్‌లో అనేక జాప్యాలు జరగడంతో ఆగస్టుకు వాయిదా పడింది. ఇప్పుడు జూన్‌లో తుది పరీక్ష నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. అనుకున్న ప్రకారం అన్నీ సవ్యంగా జరిగితే ఆగస్టులో ఆర్టెమిస్ ప్రయోగం జరుగుతుంది. 21బిలియన్ డాలర్ల వ్యయంతో 322 అడుగుల ఎత్తుతో ఈ రాకెట్ చాలా భారీగా రూపొందింది. అగ్రభాగాన ఓరియన్ క్రూ కాప్సూల్ కలిగిన భారీ అంతరిక్ష ప్రయోగ వ్యవస్థ అయిన ఆర్టెమిస్ 1 రాకెట్ ఫ్లోరిడా లోని నాసా కెనడీ అంతరిక్ష కేంద్రం (కెఎస్‌సి) వద్ద హెలిపాడ్ 39బి కి గత మార్చినెల మధ్యలోనే రిహార్సల్స్ కోసం అమర్చడమైంది. ఇంధనం నింపడం దగ్గర నుంచి అనేక కీలకమైన పరీక్షలతో రిహార్సల్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఏప్రిల్ 1 నుంచి రిహార్సల్స్ ప్రారంభమైనా, బృందానికి అనేక సమస్యలు ఎదురయ్యాయి.
మొబైల్ లాంచ్ టవర్‌లో కవాటం రబ్బరు వ్యర్థం వల్ల బిగుసుకు పోవడం, టవర్ నుంచి స్పేస్ లాంచ్ సిస్టమ్ వరకు ఉన్న గొట్టాల నుంచి హైడ్రొజన్ లీక్ అవడం వంటి తీవ్ర లోపాలు తలెత్తాయి. దీంతో మూడుసార్లు ఇంధనం నింపడానికి ప్రయత్నించిన తరువాత ప్రయోగాన్ని ఆపేశారు. ఏప్రిల్ 25 న బృందం సభ్యులు ఆర్టెమిస్ 1 ప్యాడ్ 39బిని తిరిగి కెఎస్‌సి కెవెర్నస్ అసెంబ్లీ భవనం ( విఎబి) వద్దకు చేర్చి సమస్యలను పరిశీలించారు. మరమ్మతులు చేసి అవసరమైన వాటిని కొత్తగా అమర్చారు. కవాటం బిగుసుకు పోవడం వంటి లోపాలపై ఇంకా పరిశీలన జరుగుతోందని గత వారం నాసా అధికార యంత్రాంగం వెల్లడించింది. ఒకవైపు పరిశీలన జరుగుతున్నా మరోవైపు ఇంకో రిహార్సల్‌కు ప్రయత్నం సఫలమవుతుందన్న ఆశతో నాసా ఉంటోంది. తాజాగా జూన్ మధ్యలో కచ్చితంగా రిహార్సల్ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని నాసాకు చెందిన జిమ్ ఫ్రీ వెల్లడించారు. ఒరియన్ కాప్సూల్‌కు సంబంధించి ఇది రెండో భారీ రాకెట్ ఇంజిన్ మిషన్. 2014 డిసెంబర్‌లో ఇదే ఒరియన్ కాప్సూల్‌తో పరీక్ష చేశారు.