Sunday, November 17, 2024

ప్రజల కోసం ప్రజాప్రతినిధి

- Advertisement -
- Advertisement -

చట్ట సభల్లోకి ప్రవేశార్హత సాధించడం వ్యక్తిగతంగా ఎవరికైనా గొప్ప విజయమే, అయితే అందులో అడుగుపెట్టడానికి తమను దీవించి పంపిన ప్రజల మేలు మరువకుండా ఐదేళ్లు పాటుపడడమే అసలైన ఘనకార్యం. పోటీ చేసిన నలుగురిలో ఎక్కువ ఓట్లు వేసి జనం ఎంచుకున్నారంటే దాని వెనుక వారి ఎన్నో ఆశలు తప్పకుండా ఉంటాయి. వాటిని భుజాన వేసుకొని సభలో గొంతెత్తే బాధ్యత ఆ ప్రతినిధిది. ఏ పక్షాన ఉన్నా తమ ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించడమే ప్రతినిధి ప్రధాన కర్తవ్యం. సభా మర్యాదలు, ప్రస్తావించవలసిన అంశాలు, వాటి తీరుతెన్నులపై సభ్యులకు అవగాహన తప్పనిసరి. శాసన సభ్యుడిగా జీవితకాల సంతృప్తి మిగిలేలా పని చేయాలి. ఇలాంటి లక్ష్యాలతో సభలో వ్యవహరించిన కొద్ది మంది శాసన సభ్యులలో చాడ వెంకటరెడ్డి ఒకరు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా ఇందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొంది ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టారు.
2004-09 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా సభ కల్పించిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆచరణాత్మకంగా నిరూపించారు. కాంగ్రెస్ మిత్ర పక్షంగా గెలిచి, పాలించే కాంగ్రెసునే ప్రజా సమస్యలపై నిలదీసిన ఆయన అన్ని విషయాల్లోనూ ఒక ఆదర్శ శాసన సభ్యుడిగా నిలుస్తారు. తన అయిదేళ్ల సభాపర్వంలో తాను ప్రత్యక్షంగా చూసి, తెలుసుకొన్న సమస్యలెన్నిటినో ప్రభుత్వం దృష్టికి తెచ్చి తగిన పరిష్కారం కోసం ప్రయత్నించారు. అలా ఆయా సందర్భాల్లో ఆయన శాసనసభలో చేసిన ప్రసంగాలను, ప్రశ్నలను, ప్రస్తావనలను, వాదనలను ముందు తరాలకు మార్గదర్శకంగా ఉండేలా ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం’ పేరిట పుస్తక రూపం లో తెచ్చారు. ఈ పుస్తకం ఆ నాటి జీవన, సామాజిక సమస్యలను, చట్టసభలో వాటి చర్చను, ప్రభుత్వ విధానాలను విశదపరుస్తోంది. అప్పటికి, ఇప్పటికి సామాన్యుడి బతుకులో వచ్చిన హెచ్చుతగ్గులను అంచనా వేసేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నికైన జననేతగా చట్టసభ ద్వారా ప్రజలకందించవలసిన సేవ లు ఏమిటో సాటి సభ్యులు కూడా తెలుసుకొనేలా ఈ సమాచారం పనికొస్తుంది.
చాడ వెంకటరెడ్డి అందరికీ తెలిసిన కమ్యూనిస్టు నేత, సిపిఐ తరఫున ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించి సంస్థాగత బాధ్యతలకు వన్నె తెచ్చిన సీనియర్ నాయకుడు. కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన 25 వ ఏట భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి 1981లో స్వగ్రామమైన రేకొండకు సర్పంచ్‌గా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. మూడు మార్లు చిగురుమామిడి మండలాధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సిపిఐ రాష్ర శాఖకు ప్రధాన కార్యదర్శిగా మే 2014 నుండి ఆగస్టు 2022 గా ఉన్నారు. పుస్తకంలో ముందుగా తన గురించి రాసుకున్న నాలుగు మాటల్లో చాడ వెంకటరెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా తన అనుభవాలను నిజాయితీగా చెప్పారు. హాలులో ముందు వరసలో అతిరథ మహారథుల మధ్య ఉండటంతో కొంత మానసిక అంతర్మథనం జరిగేది, మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించేది, నోముల నరసింహయ్య సలహాలు తీసుకొనేవాడిని, బడ్జెట్, గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీనియర్ల, ప్రొఫెసర్ల సూచనలను నోట్స్‌గా రాసుకొని ప్రసంగం చేసేవాడిని అనే వాక్యాలు అందుకు నిదర్శనం. తన కాలపు రోజులతో ఈ మధ్య కాలంలో కొనసాగుతున్న చట్టసభల నిర్వహణ, చర్చలను పోల్చుతూ- 2004 నాటి అసెంబ్లీ వ్యవహారాలు, చర్చలు, అధికార, ప్రతిపక్షాల తీరు ఈనాటి తరానికి తెలియపరచడం సమంజసంగా ఉంటుందనే భావనతో ఈ పుస్తకం తేవడం జరిగిందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్లలో సక్రియాత్మక పాత్ర పోషించిన జననేతల అనుభవాలు గ్రంథస్తం కావడం చారిత్రక అవసరం. ఈ క్రమంలో ప్రముఖ, ప్రసిద్ధ పార్లమెంట్ సభ్యుల సభా ప్రసంగాలు పుస్తక రూపంలో వస్తున్నాయి. సిపిఎం నేత సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యుడిగా చేసిన ప్రసంగాలు ‘అడ్వాన్సింగ్ పీపుల్స్ స్ట్రగుల్స్’ అనే పేరుతో ఇంగ్లీషులో ముద్రించబడ్డాయి. భిన్నపార్టీల సభ్యుల పార్లమెంట్ ప్రసంగాలను ఎంపిక చేసుకొని ప్రచురణ సంస్థలు పుస్తకాలుగా తెచ్చాయి. ఇలాంటి పుస్తకాల రాక చట్ట సభల్లో ప్రజాస్వామిక విలువలు పెంపొందించడానికి తప్పనిసరి అవసరం.
చాడ వెంకటరెడ్డి చట్టసభలో అడుగుపెట్టిన 2004 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన సమయం. అప్పుడే రాష్టాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వెళ్లారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తెరాస పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షంగా 26 మంది సభ్యులతో అసెంబ్లీ అరంగేట్రం చేసింది. ఇలా ఒక కొత్త ఊపుతో హేమాహేమీల సభ వేడివేడిగా సాగేది. సిపిఐ, సిపిఎంల తరపున 15 మంది సభ్యులు ఉండడం వల్ల రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై చట్టసభలో సుదీర్ఘ చర్చ సాగేది. ఇన్ని విశేషతలున్న సభలో సిపిఐ శాసనసభాపక్ష నాయకుడుగా చాడ వెంకటరెడ్డి గణనీయమైన పాత్ర పోషించిన సందర్భాలు ఈ పుస్తకంలో అక్షరబద్ధమైనాయి.ప్రతి యేడు బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్నప్పుడు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో సభలో తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా రాష్ట్ర సమస్యలపై ఆయన గురిపెట్టారు. వివిధ వర్గాలకు, అభివృద్ధి పనులకు బడ్జెట్ కేటాయింపులపై విమర్శనాత్మక విశ్లేషణ జరిగేది. గత బడ్జెట్ లో పూర్తి ఖర్చుకాని పద్దులను ప్రస్తావిస్తూ కేవలం కాగితాలపై కేటాయింపులతో లాభమేమిటని నిలదీసిన తీరు కనబడుతుంది.2004-05 బడ్జెట్ చర్చలో గత తెలుగుదేశం పాలనను ప్రస్తావిస్తూ కొత్త ప్రభుత్వం కూడా పరిశ్రమలను మూసివేయవద్దని, ప్రపంచ బ్యాంకు ఏజెంట్‌గా పని చేయవద్దని కోరారు.మిగులుగా ఉన్న కోటి ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగేలా పరిష్కార మార్గం చూపాలన్నారు. ఎస్‌సి, బిసి, మైనారిటీ సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం పూర్తిగా ఖర్చు చేయలేదని లెక్కలు చూపారు. గృహ నిర్మాణం, తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ బాధితుల గోస, వివిధ శాఖల్లో సిబ్బంది అవినీతి, ఉద్యోగ నియామకంపై అలసత్వం ఇలా సకల బాధకాలను సభ ముందుంచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ కార్పొరేట్ వ్యవసాయానికి, ఆక్వా సాగుకు, ఆదాయం పన్ను చెల్లించే వారికి ఉచిత విద్యుత్తునీయడాన్ని ఆక్షేపించారు. రైతు ఆత్మహత్యలు వారి మానసిక వైకల్యం వల్ల సంభవిస్తున్నాయని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నమాటను తీవ్రంగా ఖండిస్తూ రైతు కుటుంబాలను కలిసి వాస్తవాలను సభ ముందు ఉంచి రైతు చావులకు చితికిన ఆర్థిక స్థితే కారణమని నొక్కి చెప్పారు. నక్సలైట్ల పోరాటాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణించి వారితో చర్చలు కొనసాగించాలని కోరారు. ఆర్‌టిసి నష్టాలకు ప్రధాన కారణం అనేక రూట్లలో ప్రయివేటు సర్వీసులు ఒకే నెంబర్‌తో మూడు బస్సులు తిరగడమే అని చెప్పారు. ఫ్యాక్షనిస్టులను పార్టీల్లోంచి వెలివేయాలని, ఏ పార్టీ కూడా వారికి టికెట్టు ఈయవద్దని దీని వల్లనే రాజకీయాల్లో హింసను అరికట్టవచ్చని అన్నారు.
2004, 2005 వరుస కరువులో పశుగ్రాసం, నీటి వసతి, ఉచిత బియ్యం పంపిణీపై సభలో గట్టి పట్టుపట్టారు. 610 జీవో, గిర్ గ్లాని రిపోర్టుపై తెలంగాణ పక్షాన నిలబడి వాటి అమలుకు తాత్సారమెందుకని ప్రశ్నించారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ ప్రతిపాదనను సభాముఖంగా వ్యతిరేకించారు. భూదాన భూములు రెవెన్యూ అధికారుల సాయంతో అన్యాక్రాంతమవుతున్న వైనాన్ని లెక్కలతో సభ ముందుంచారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ, వికలాంగుల దుస్థితి, విద్యార్థులకు అందని స్కాలర్ షిప్‌లు, పారిశుద్ధ కార్మికుల సమస్య, పాత్రికేయులకు చేరని ఇళ్ల స్థలాలు, హాస్టళ్లలో వసతుల లేమి, పంటలకు మద్దతు ధరల సమస్య ఇలా వరుసపెడితే చాడ వెంకటరెడ్డి సభలో లేవనెత్తని సమస్య లేదనవచ్చు. కమ్యూనిస్టులు చట్ట సభలో అడుగుపెడితే ప్రజల సమస్యలపై ఎంత అర్థవంతమైన చర్చ జరుపుతారో, క్షేత్ర పర్యటనల ద్వారా నిజానిజాలు సభ ముందు ఎలా ఉంచుతారో, జంకు లేకుండా మంత్రులను, అధికారులను నిలదీసేందుకు ఎలా ముందుకొస్తారో ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. శాసనసభలో ప్రజాప్రతినిధి పాత్ర, బాధ్యతలు ఏమిటో తెలిసేందుకు ఈ ప్రసంగాలు అందరికీ ఉపయోగపడతాయి.2004- 09 కాలపు సభా చర్చలతో పాటు ఆనాటి సామాజిక సమస్యలను రికార్డు చేసి ఈ తరానికి అందించినందుకు సిపిఐ నేత వెంకటరెడ్డిని అభినందించాలి.

Artical About Chada Venkatareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News