Thursday, January 23, 2025

370కి స్వస్తి

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగం 370 అధికరణను రద్దు చేస్తూ 2019 ఆగస్టులో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు ధర్మాసనం పూర్తిగా ధ్రువపరిచింది. ఈ మేరకు సోమవారం నాడు అది ప్రకటించిన తీర్పు ఆ సరిహద్దు ప్రాంతాన్ని ఎటువంటి షరతులూ లేకుండా భారత దేశంలో విలీనం చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 16 రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత గత సెప్టెంబర్ 5న వాయిదా వేసిన తీర్పును ధర్మాసనం ఇప్పుడు ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 370 రద్దుకు, జమ్మూకశ్మీర్ పునర్వవస్థీకరణకు సంబంధించి రెండు బిల్లులను, రెండు తీర్మానాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2019 ఆగస్టు 5న పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. దీనిని సవాలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. 370వ అధికరణ శాశ్వతమైనది కాదని, తాత్కాలిక ప్రాతిపదిక పైనే రూపొందిందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తన ప్రత్యేక తీర్పులో స్పష్టం చేసిన దానితో మిగతా న్యాయమూర్తులు పూర్తిగా ఏకీభవించారు.

జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సభ కూడా తాత్కాలికమైనదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలన్నింటికీ మూస మాదిరి ఒకే సమాఖ్య విధానం లేదని, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో స్థాయి సమాఖ్య పద్ధతి వున్నదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాలూ శాసన, కార్యనిర్వాహక అధికారాలను కలిగి వున్నప్పటికీ అవి వివిధ స్థాయిల్లో వున్నాయని, భిన్న రాష్ట్రాలకు భిన్నమైన ప్రత్యేక ఏర్పాట్లు గలవని ఇందుకు రాజ్యాంగం 371ఎ నుంచి 371 జె వరకు గల అధికరణలే ఉదాహరణలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అమెరికాలో మాదిరిగా మన దేశంలోని రాష్ట్రాలు శాశ్వతమైన హద్దులు కలిగినవి కావని, వాటిని విస్తరించడానికి, విభజించడానికి పూర్తి అధికారాలను రాజ్యాంగం కల్పిస్తున్నదని అందుచేత జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని తప్పు పట్టలేమని ధర్మాసనం భావించినట్టు అర్థమవుతున్నది. జమ్మూకశ్మీర్‌ను క్రమక్రమంగా మిగతా రాష్ట్రాల మాదిరిగా భారత దేశంలో పూర్తి అంతర్భాగంగా చేయాలన్నదే 370వ అ ధికరణ లక్షమని న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ తన తీర్పులో విస్పష్టంగా అభిప్రాయపడ్డారు. దేశ విభజన జరిగినప్పుడు 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం ముస్లింలు మెజారిటీగా వున్న ప్రాంతాలు పాకిస్థాన్‌లో విలీనం కాగా, ఇండియాలో గాని,

పాకిస్థాన్‌లో గాని చేరడానికి స్వేచ్ఛను 570కి పైగా వుండిన రాచరిక రాష్ట్రాలకు కల్పించారు. ఆగస్టు 15 నాటికి జునాగఢ్, జమ్మూకశ్మీర్, హైదరాబాద్ రాష్ట్రాలు మినహా మిగతావన్నీ భారత దేశంలో కలిసిపోయాయి. అప్పటి జమ్మూకశ్మీర్ పాలకుడు హరిసింగ్ తన రాష్ట్రాన్ని స్వతంత్ర ప్రాంతంగా కొనసాగించుకోవాలని అనుకొన్నారు. కాని పాకిస్థాన్ వైపు నుంచి గిరిజన దళాలు దండెత్తడంతో భారత దేశం సాయాన్ని ఆయన అర్థించారు. ఇండియాలో భాగం కాని ప్రాంతానికి రక్షణ ఇవ్వలేమని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆయన విలీన ఒప్పందం మీద సంతకం చేశారు. అప్పుడు భారత సైన్యం రంగ ప్రవేశం చేసి రెండు వారాల్లో ముట్టడిదారుల ఆట కట్టించింది. ఆ విలీన ఒప్పందం ప్రకారం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి (రాజ్యాంగం 370వ అధికరణ) కల్పించారు. భారతీయ జనతా పార్టీ అది జన సంఘ్‌గా వున్నప్పటి నుంచి కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి వివాదాస్పద అంశాలను సాధించుకోడమే లక్షంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేసింది. ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీటిని వివాదాస్పద అంశాలుగానే పరిగణించి పక్కన పెడుతూ వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాత తన సంకల్పాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిర్ నిర్మాణానికి సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపడంతో బిజెపి మొట్టమొదటి ఆశయ సిద్ధి జరిగింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఆ పార్టీ మరో స్వప్నం నెరవేరిందని చెప్పవచ్చు. అయితే కశ్మీర్ ప్రజల మద్దతు లేకుండానే 370 రద్దు జరిగిందనే విషయాన్ని విస్మరించకూడదు. అక్కడ రోజురోజుకీ పేట్రేగుతున్న పాక్ ప్రేరిత ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆ ప్రజల మద్దతు భారత ప్రభుత్వానికి అత్యంత అవసరం. ఈ మొత్తం వ్యవహారంలో ఈ కోణం విస్మరణకు గురైన చేదు వాస్తవం కనిపిస్తున్నది. జమ్మూకశ్మీర్‌లో కనీసం 1980 నుంచి ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల వల్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రత్యేక కమిటీని నియమించాలని ఈ విషయంలో పరిస్థితిని చక్కదిద్డడానికి చర్యలు తీసుకోవాలని, ఇది నిర్ణీత వ్యవధిలో జరగాలని జస్టిస్ కౌల్ చేసిన సిఫారసు మెచ్చుకోదగినది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News