జెకెలో పోలింగ్ శాతం పెరిగింది
ప్రజాస్వామ్యంపై జనానికి విశ్వాసం
హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : 370 అధికరణాన్ని రద్దు చేయాలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోందని, జమ్మూ కాశ్మీర్‌లో పోలింగ్ శాతం పెరిగిందని, ప్రజాస్వామ్యంపై జనానికి విశ్వాసం పెరిగిందనేందుకు సూచిక అని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం తెలిపారు. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 38 శాతం పోలింగ్ నమోదైన మరునాడు హోమ్ శాఖ మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నాలుగవ దశలో సోమవారం శ్రీనగర్‌లో పోలింగ్ జరిగింది. శ్రీనగర్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 14.43 శాతం, 2014 ఎన్నికల్లో 25.86 శాతం, 2009 ఎన్నికల్లో 25.55 శాతం, 2004 ఎన్నికల్లో 18.57 శాతం పోలింగ్ నమోదైంది.
‘370 అధికరణం రద్దుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పోలింగ్ శాతంలోనే ఫలితాలు చూపుతోంది. అది ప్రజాస్వామ్యంలో జనం విశ్వాసాన్ని పెంచింది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం మరింత బలంగా వేళ్లూనుకున్నది’ అని అమిత్ షా ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెరుగుదల ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలు 370 అధికరణం నిబంధనల రద్దును వ్యతిరేకించిన, దాని పునరుద్ధరణను ఇప్పటికీ కోరుతున్న వారికి గట్టి సమాధానం ఇచ్చారని అమిత్ షా అన్నారు.