Friday, November 22, 2024

చేతగాక ‘చే’జేతులా…

- Advertisement -
- Advertisement -

The dollar to rupee exchange rate is Rs. 80

జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని సోనియా గాంధీ విశసించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సవాలుగా మారడం వెనుక అధిష్ఠానం తెలివి తక్కువ తనమే కనిపిస్తున్నది. దేశాధికారం కోల్పోయిన తర్వాత గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వం విజ్ఞతతో వ్యవహరించి ప్రశంసలందుకున్న సందర్భం గట్టిగా ఒక్కటీ లేదు. ఇప్పుడు సైతం అదే తెలివిమాలినతనాన్ని, అపరిణతను అది మరింతగా ప్రదర్శించింది. దాని వల్లనే గెహ్లాట్‌తో వ్యవహారం బెడిసి కొట్టింది. 71 సంవత్సరాల అశోక్ గెహ్లాట్ పార్టీలో సీనియర్ నాయకుడు. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నవాడు. గతంలో రెండు సార్లు పూర్తి పదవీ కాలం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేసి మూడోసారి 2018 నుంచి అందులో కొనసాగుతున్నాడు. అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబిసి)కు చెందినవాడు. 20 ఏళ్ల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరిలో ఆయనను ప్రధాన అభ్యర్థిగా నిలబెట్టాలని సోనియా గాంధీ అనుకోడంలో ద్విముఖ వ్యూహం కనిపిస్తున్నది. అందులో ఒకటి పార్టీని సీనియర్ బిసి నేత చేతుల్లో పెట్టామన్న ఖ్యాతిని పొంది ప్రజాభిమానాన్ని చూరగొనడం. రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని యువ బిసి నాయకుడు సచిన్ పైలట్‌కు కట్టబెట్టడం ఈ వ్యూహం రెండో కోణంగా అర్థమవుతున్నది. దాదాపు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న గెహ్లాట్‌ను ఇందుకు బుజ్జగించి ఒప్పించి వుండవలసింది. అందుకు బదులుగా ఇద్దరు ఎఐసిసి ప్రతినిధుల(మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్)ను పంపించి ముఖ్యమంత్రి పదవికి గెహ్లాట్ వారసుని ఎన్నుకునే కార్యక్రమాన్ని జరిపించబోవడం దుస్సాహసమే. రాజస్థాన్ శాసన సభ బలం 200 కాగా, పాలక పక్షంగా కాంగ్రెస్ 108 స్థానాలను కలిగి వుంది. అందులో 92 మంది అధిష్ఠానం ఉద్దేశించిన లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా రాష్ట్ర మంత్రి ధరీవాల్ ఇంట్లో భేటీ కావడం అసాధారణ పరిణామం. అంతేకాదు గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి, ఆయన స్థానంలో సచిన్ పైలట్‌ను సిఎంగా చేయడానికి అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా స్పీకర్ సిపి జోషికి రాజీనామాలు సమర్పించారన్న వార్త సోనియా, రాహుల్ గాంధీలకు బొత్తిగా వన్నె, వాసి కలిగించని మలుపు. గతంలో పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌ను సిఎం పదవి నుంచి తొలగించినప్పుడు ఎదురైన పరిణామంతో పోల్చదగిన సందర్భమిది. గత ఏడాది నవంబర్‌లో ఆ రాష్ట్ర ఎన్నికలకు కొద్ది మాసాల ముందు పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి అమరీందర్ సింగ్‌ను తొలగించినప్పుడు ఆయన అయిష్టంగా దిగిపోతూ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను తీవ్రంగా విమర్శించాడు. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి ఇటీవల బిజెపిలో దానిని విలీనం చేశాడు. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికీ తాను దేశాధికార పీఠం మీద వున్నట్టే భావిస్తూ ఈ తప్పులను చేస్తున్నది. ముఖ్యమంత్రి పదవికి దూరం కావడం గెహ్లాట్‌కు బొత్తిగా ఇష్టం లేదు. అంతేకాదు ఆ పదవిలో సచిన్ పైలట్‌ను కూచోపెట్టడం ఆయనకు అంతకంటే గిట్టని పని. 2018 ఎన్నికల్లో గెహ్లాట్‌తో పాటు పైలట్ కూడా శ్రమించి పార్టీ విజయానికి దోహదం చేసిన మాట వాస్తవం. ఆయన రాహుల్ గాంధీ ప్రియమిత్రుడు కావడం వల్ల కూడా ముఖ్యమంత్రి పదవి తనకే దక్కుతుందని ఎదురు చూశాడు, దక్కాలని గట్టిగా భావించాడు. అది జరగకపోయేసరికి పైలట్ 2020లో 20 మంది ఎంఎల్‌ఎలతో తిరుగుబాటు చేశాడు. అంతేకాక 2018 ఎన్నికలప్పుడు రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడుగా పైలట్ పలువురు గెలుపు గుర్రాలకు పార్టీ టిక్కెట్లు నిరాకరించాడు. వారు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న 12 మంది ఇండిపెండెంట్లలో 10 మంది ఆ విధంగా గెలిచిన వారే. కాంగ్రెస్ పరిశీలకులు పిలిచిన లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని కాకుండా చేయడంలో ఈ ఇండిపెండెంట్లు ప్రధాన పాత్ర పోషించారు. సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కావడం వీరికి ఎంత మాత్రం అంగీకారం కాదు. పైలట్‌కు వ్యతిరేకంగా, గెహ్లాట్‌కు మద్దతుగా మంత్రి ధరీవాల్ ఇంట్లో భేటీ అయిన 92 మంది శాసన సభ్యుల్లో పైలట్ వర్గానికి చెందిన వారు ముగ్గురు, నలుగురున్నట్టు సమాచారం. గెహ్లాట్ అంతరంగాన్ని, లెజిస్లేచర్ పార్టీలో ఆయనకున్న బలాన్ని అంచనా వేయడంలో అధిష్ఠానం విఫలమైంది. అధ్యక్ష పదవికి స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు జరుపుతామని, ఎవరైనా పోటీ చేయవచ్చునని ప్రకటించిన సోనియా గాంధీ గెహ్లాట్‌ను అభర్ధిగా నిలబెట్టడానికి ఇన్ని పాట్లు పడవలసిన అవసరమే తలెత్తకుండా వుండవలసింది. గెహ్లాట్‌ను ఈ పరిస్థితికి నెట్టివేసిన అధిష్ఠానం ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి ఆయనకు బదులుగా ఎవరిని ఎంచుకుంటుంది లేక ఆయననే బుజ్జగించి ఆయన షరతుల మీదనే వ్యవహారానికి ముగింపు చెబుతుందో చూడాలి.

Article about Congress President Election

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News