Saturday, September 21, 2024

కమలా హారిస్

- Advertisement -
- Advertisement -

Article About Indo-American Kamala Harris

అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆఫ్రో అమెరికన్, దక్షిణాసియన్ అమెరికన్ మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకోడం ఎంతో విజ్ఞతాయుతమైనది. ఈ ఎంపికలో బిడెన్ ముందు చూపును ప్రదర్శించారని అంగీకరించక తప్పదు. 55 ఏళ్ల కమలా హారిస్‌కు బిడెన్‌కు వయసులో చాలా తేడా ఉంది. ఆమె ఆయన కంటే 23 ఏళ్ల పిన్నవయస్కురాలు. న్యాయవాది, మంచి వక్త. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేశారు. ఆ రాష్ట్రం నుంచి సెనెటర్‌గా ఎన్నికైన మూడవ మహిళగా, రెండవ ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా మొట్టమొదటి దక్షిణాసియన్ అమెరికన్ వనితగా గుర్తింపు పొందారు. జమైకా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన డోనాల్డ్ హారిస్, మన తమిళ బ్రాహ్మణ వనిత శ్యామలా గోపాలన్ దంపతులకు జన్మించిన కమలా హారిస్ ఆఫ్రికన్, ఆసియన్ సంతతికి చెందిన వారుగా ఆ ఓటర్లను ఆకట్టుకోగలుగుతారు. భారతీయ సంతతి వ్యక్తిగా ఆమెకున్న నేపథ్యం ఇప్పటికే మచ్చు పోలింగ్‌లు, ప్రజాభిప్రాయ సేకరణల్లో ముందుకు దూసుకుపోతున్న బిడెన్‌కు అధ్యక్ష ఎన్నికల్లో బాగా కలిసి వస్తుంది. కమలా హారిస్ ఉపాధ్యక్షురాలైతే ఆ పదవిని అందుకున్న తొలి మహిళ, తొలి నల్లజాతి మహిళగా చరిత్రకెక్కుతారు. ఆమె గడుసు పిండంగా ప్రసిద్ధికెక్కారు. కాలిఫోర్నియా జిల్లా అటార్నీగా, అటార్నీ జరనల్‌గా పాఠశాల పిల్లల గైర్హాజరీకి వారి తల్లిదండ్రులను బాధ్యులను చేసిన చట్టాన్ని తెచ్చి వివాదాస్పదురాలయ్యారు. అటువంటి తల్లిదండ్రులను జైలు పంపిచాలని ఆమె విధించిన కఠిన నిబంధన చాలా నల్లజాతి కుటుంబాలకు కష్టాలు కొని తెచ్చిపెట్టింది. అమెరికాలో బడికి వెళ్లని పిల్లల్లో అధిక శాతం నల్లజాతివారే ఉంటారు. వారి ఆర్థిక పరిస్థితులు అందుకు దోహదం చేస్తాయి. ఇంత కఠిన నిబంధనను అమలు చేసినందుకు ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అలాగే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఎంపికకు ముందు ఆ పార్టీలో జరిగిన ప్రైమరీలలో జో బిడెన్‌కు కమలా హారిస్ గట్టి పోటీ ఇచ్చారు. చివరికి గత డిసెంబర్‌లో ఆ పోటీ నుంచి ఆమె తప్పుకున్నారు.

గత ఏడాది జూన్‌లో జరిగిన ప్రైమరీల వాదోపవాదాల్లో బిడెన్‌ను జాత్యహంకారిగా ఆమె ఎత్తి చూపారు. జాతి వివక్షాపరులైన సెనెటర్లతో కలిసి ఆయన పని చేశారని విమర్శించారు. స్కూలు పిల్లలకు బస్సులు, టీచర్లకు జీతాలు పెంచాలని ఆమె గట్టిగా వాదించారు. తనను తెగ తిట్టిన వ్యక్తినే బిడెన్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నాడని ఆమె ఆ పదవికి అత్యంత అనర్హురాలని ప్రస్తుత దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీడియా గోష్టిని ఏర్పాటు చేసి మరీ ఎత్తిపొడవడం కమలా హారిస్ అభ్యర్థిత్వం తన ఓటును దెబ్బ తీస్తుందని ఆయన భయపడుతున్నాడనడానికి నిదర్శనంగా పరిగణించవచ్చు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఉపాధ్యక్షుడుగా పని చేసిన జో బిడెన్‌కు వయసు మీద పడుతోంది(77). ఆయన ఎన్నికైతే ఆయనతో పాటు ఉపాధ్యక్ష పదవి అలంకరించనున్న కమలా హారిస్ ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు అధ్యక్ష పీఠం అధిష్ఠించే అవకాశాలు లేకపోలేదు. ఆమె అంటే బిడెన్ కుటుంబ సభ్యులకు కూడా మంచి అభిప్రాయం లేదని చెబుతారు. కేన్సర్‌తో చనిపోయిన బిడెన్ పెద్ద కుమారుడితో సత్సంబంధాలు ఉండడమే ఆమెకున్న అనుకూల అంశం.

కమలా హారిస్‌కు కాలిఫోర్నియా డెమొక్రాట్లలోనే అమిత్రులు అనేక మంది ఉన్నారు. అయినా బిడెన్ ఆమెనే తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోడంలో ట్రంప్‌తో పోటీలో ఎటువంటి అజాగ్రత్తకు అవకాశం ఇవ్వరాదని, విధేయత కంటే సామర్థానికే ప్రాధాన్యమివ్వాలని ఆయన గట్టిగా అనుకోడమే కారణమని బోధపడుతున్నది. అందుకే దిగ్గజాల వంటి పలువురు డెమొక్రాటిక్ మహిళా సెనెటర్లలో చివరికి కమలా హారిస్‌ను ఆయన ఎంచుకున్నారు. పాలనలో సమర్థురాలైన తోడు ఉండాలని ఆయన కోరుకున్నారు. డెమొక్రాటిక్ పార్టీకి నల్లవారి మద్దతు దండిగా ఉంది. ట్రంప్ పాలనలో అమెరికన్ రాజకీయాల్లో ప్రజాస్వామిక సంప్రదాయాలకు తీవ్రమైన గండి ఏర్పడిన మాట వాస్తవం. ఆయన జాత్యహంకార ధోరణులు నల్లవారిని అమితంగా భయ పెట్టాయి. ఇటీవల తెల్ల పోలీసు అధికారి బూటు కాలి కింద ఊపిరి వదిలి ‘నల్లవారి ప్రాణాలు ముఖ్యం’ ఉద్యమానికి ఊపిరిపోసిన జార్జి ఫ్లాయిడ్ విషాదాంతం తర్వాత అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ తదితర జాతుల నల్లవారు అపూర్వ స్థాయిలో సంఘటితమయ్యారు. అక్కడి భారతీయులు అంతగా ఆ ఉద్యమంతో మమేకం కాకపోయినా, కమలా హారిస్ తల్లికి తమిళ బ్రాహ్మణ నేపథ్యం ఉన్నా ఆమె ప్రగతిశీల వైఖరి, శ్వేతజాత్యహంకార వ్యతిరేక ధోరణి ఆమెకు నల్లవారిలో అనుచర గణాన్ని పెంచాయి. అందుచేత కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలైతే అది తమకెంతో మంచి పరిణామమని, గర్వ కారణమని అక్కడ చైతన్యం పుంజుకున్న ఆఫ్రికన్ అమెరికన్‌లు ఇతర నల్లజాతి వారు భావిస్తారు. అందుకే బరాక్ ఒబామా కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థించారు.

Article About Indo-American Kamala Harris

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News