Friday, November 22, 2024

సిగ్గు మాలిన నిఘా!

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖుల టెలిఫోన్ సంభాషణలు, ఇ మెయిల్స్ తదితర సందేశాలపై పెగాసస్ దొంగ చెవిని ప్రయోగించారన్న సమాచారం పెను సంచలనాన్ని కలిగించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వెల్లడైన ఈ అంతర్జాతీయ సమాచార నివేదిక సహజంగానే ఉభయ సభల్లో ప్రకంపనాలను సృష్టించింది. ఎన్‌ఎస్‌ఒ గ్రూప్ అనే ఇజ్రాయెలీ కంపెనీ తయారు చేసిన ఈ స్పైవేర్ (గూఢచార పరికరం)ను టెర్రరిస్టుల ఉనికిని, వ్యూహాలను తెలుసుకోడం కోసం, ఇతర తీవ్ర నేరాల పరిశోధనలోనూ ఉపయోగపడేందుకు ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అమ్ముతామని ఆ సంస్థ స్పష్టంగా ప్రకటించి ఉంది. అందుచేత అనుమానపు ముల్లు సహజంగానే కేంద్ర ప్రభుత్వం వైపు చూపుతుంది. అందుకే ప్రతిపక్షాలు పార్లమెంటులో దీనిపై కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. సమగ్ర దర్యాప్తు జరిపించాలని, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం మాత్రం తనకేమీ తెలీదని, ఇదంతా కట్టుకథ అని తోసిపుచ్చింది. కీలకమైన పార్లమెంటు సమావేశాలు జరగనీయకుండా ఆటంకం సృష్టించాలనుకునే వారికి విచ్ఛిన్నకారులు సిద్ధం చేసి అందించిన నివేదికగా అమిత్ షా దీనిని తోసిపుచ్చారు.

అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత ప్రతిష్ఠను దెబ్బ తీయడానికే ఈ నివేదికను రూపొందించి వదిలిపెట్టారని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అన్నారు. విచిత్రంగా ఆయన పేరు కూడా పెగాసస్ గురి పెట్టిన ప్రముఖుల జాబితాలో ఉంది. మరొక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కూడా ఈ నివేదికలో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ పై ఎన్నికల అక్రమాల కేసును కొట్టివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సమావేశాన్ని బహిష్కరించిన అప్పటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన మహిళ, ఆమె బంధువులు ఇలా దేశంలో పలు రంగాల్లో కీలకమైన వారు, వివాదాస్పదులైన వారి వెయ్యి స్మార్ట్ ఫోన్లపై పెగాసస్ నిఘా సాగిందని వెల్లడైంది. ప్రభుత్వమంటున్నట్టు ఈ నివేదిక ఆషామాషీ వర్గాల నుంచి రాలేదు. ప్యారిస్‌లోని ఫర్బిడెన్ స్టోరీస్ అనే లాభనష్టాలు లేని మీడియా సంస్థ, అంతర్జాతీయ క్షమా సంస్థ (ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్) కలిసి నిర్వహించిన శోధన ద్వారా వెల్లడైన ఈ నివేదికను మన దేశానికి చెందిన ‘ది వైర్’, ప్రముఖ ప్రపంచ స్థాయి ఆంగ్ల పత్రికలు వాషింగ్టన్ పోస్ట్, ది గార్డియన్ తదితర 16 ప్రముఖ మీడియా సంస్థలు ఈ నివేదికను ప్రచురించాయి. అందుచేత దీనిని అల్లరిచిల్లరి, ఉత్తుత్తి చిత్తు కాగితంగా తీసిపారేయలేము.

పెగాసస్ ఉదంతం మన దేశంలో సంచలనం సృష్టించడం ఇది మొదటి సారి కాదు. ఇంత భారీ ఎత్తున కాకపోయినా 2019 అక్టోబర్‌లో తొలివిడతగా దీని నిర్వాకం గురించిన సమాచారం దేశంలో పొక్కింది. అప్పుడు భీమా కోరేగావ్ కేసు నిందితులపై దీనిని ప్రయోగించినట్టు వెల్లడైంది. తనకేమీ తెలియదని అమాయకత్వం ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెగాసస్ యజమాని ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌తో సంబంధాలున్నాయా లేదా, ఆ స్పై వేర్‌ను కొన్నారా, కొనలేదా అనే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నదన్న సమాచారం గమనించదగినది. భారత ప్రజాస్వామ్య చట్టాలలో ఉన్న విధి నిషేధాల పకడ్బందీ ఏర్పాట్లు ఇటువంటి నిఘాలకు అవకాశం ఇవ్వబోవని ప్రభుత్వం చెబుతున్న దాన్ని నమ్మలేని పరిస్థితి దురదృష్టవశాత్తు దేశంలో గత కొంత కాలంగా నెలకొని ఉన్నది. సర్వస్వతంత్రంగా, నిష్పాక్షికంగా పని చేయవలసిన సిబిఐ, ఇడి వంటి అత్యగ్రశ్రేణి కేంద్ర దర్యాప్తు సంస్థలనే పాలకులు రాజకీయ, స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణ, విమర్శ చాలా కాలంగా వినవస్తున్నది. అటువంటప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పై మరింత నిఘా కోసం వారి వ్యక్తిగత సంభాషణలు, సమాచారాన్ని కూడా తెలుసుకొని లాభపడాలనే సంకల్పం వారిలో కలగలేదని అనుకోలేము. కేవలం మన దేశంలోనే కాకుండా దేశ దేశాల్లోని అనేక వందల మంది ప్రముఖుల ఫోన్లలో పెగాసస్ తిష్ఠ వేసుకొన్నదని దర్యాప్తు నివేదిక వెల్లడి చేసింది. మన దేశంలో అతి ముఖ్యులైన రాజకీయ నేతలతో పాటు 40 మంది జర్నలిస్టుల ఫోన్లను కూడా లక్షం చేసుకున్నట్టు సమాచారం. ఇంత విస్తృతంగా సాగినట్టు సవివరంగా వెల్లడి చేస్తున్న ఈ నివేదిక పై నమ్మదగిన దర్యాప్తుకి ఆదేశించడం కేంద్ర ప్రభుత్వం కర్తవ్యం. అలా చేయకుండా శుష్క ఖండనలతో సరిపుచ్చడానికి కేంద్ర పాలకులు తాపత్య్రపడే కొద్దీ వారిపై అనుమానం మరింత పెరుగుతుంది. కేవలం నియంతల పాలనలోనే ఊహించగల ఇటువంటి దారుణాలకు వ్యక్తి గోప్యతపై ఇంత విస్తృత దాడికి మన పాలకులు పాల్పడి ఉంటే అంతకంటే సిగ్గుపడాల్సింది మరొకటి ఉండదు.

Article About Pegasus Spyware Target

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News