Saturday, November 16, 2024

వరద జలాల పేరిట వంకరబుద్ధి

- Advertisement -
- Advertisement -

పోతిరెడ్డిపాడు పేరిట తెలంగాణ హక్కులకు బొక్క
కొత్తగా రాయలసీమ ఎత్తిపోతలతో రక్తం పీల్చే యత్నం
ఆంధ్రానేతలవి అసత్యాలు, అసంబద్ధ వాదనలు
ఎపిలోని పెన్నానది పరివాహక ప్రాంతాలకు కృష్ణా జలాల తరలింపేమో న్యాయమట!
తెలంగాణ కృష్ణాబేసిన్‌లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలేమో కొత్త ప్రాజెక్టులట!
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డులకు వక్రబాష్యాలు

కృష్ణా బేసిన్ అవతలికి కేటాయింపులు చేయడంపై నిషేధం లేదు కానీ బేసిన్ లోపలి అవసరాలు పట్టించుకోకుండా ఒక పరిమితిని మించి చేయడం సరైన చర్య కాదు— బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్

బేసిన్ లోపలి ప్రాంతాలకు ఆ నదీ జలాలపై మొదటి యాజమాన్య హక్కు ఉంటుంది. బేసిన్‌లోని ప్రాంతాల అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత ఆ పైన లభించే నీటిని బేసిన ఆవలి ప్రాంతాలకు మళ్లించవచ్చు. దానికి విరుద్ధంగా జరిగితే ఇప్పుడైనా, మున్ముందైనా అవాంఛనీయ ఉపద్రవాలకు దారితీయవచ్చు— “అంతర్రాష్ట్ర నదుల అభివృద్ధి: లా అండ్ ప్రాక్టీస్‌” అనే పుస్తకంలో ఎన్‌డి గులాటీ
గత సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 88 వేల క్యూసెక్కులకు పెంచే విస్తరణ పనులకు, రోజుకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జి ఒ నంబరు 203 ను, ఇతర అనుబంధ జి ఒ లను జారీ చేసిన సంగతి అందరికీ ఎరుకే. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఈ చర్యలు ఆజ్యం పోశాయి. ఈ సందర్భంగా కృష్ణా జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు. మేధావులనబడే వారు అసంబద్ద, న్యాయ విరుద్ద వాదనలు వినిపిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమన అంశాలను పరిశీలిద్దాం.

1. 512 టిఎంసిల మా వాటా నీళ్ళను వాడుకోవాటానికి ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరాలు దేనికి ?
పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ 811 టిఎంసిల నీటిని గంపగుత్తగా కేటాయించిన నీటిలో ఆంద్ర ప్రాంత ప్రాజెక్టులకు చేసిన పునః కేటాయింపులు 512 టిఎంసిలు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు చేసినవి 299 టిఎంసిలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బేసిన్లో 68% పరీవాహక ప్రాంతం కలిగిన తెలంగాణకు 36.80 % నీటిని కేటాయించి, 32% పరీవాహక ప్రాంతం కలిగిన ఆంధ్రా ప్రాంతానికి 63.20% కేటాయించడం అన్యాయం. ఆంధ్రాకు కేటాయించిన 512 టిఎంసిల నికర జలాల్లో 350 టిఎంసిలకు పైగా నీరు బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు తరలిపోతున్నాయి. నేడు అమలులో ఉన్న ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఎగువ రాష్ట్రాలకు 75% డిపెండబిలిటీ వద్ద కేటాయించిన నికర జలాలు వాడుకున్నాక దిగువకు వచ్చే నీళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోనే వెసులుబాటు ఉంది. కానీ వా టిపై హక్కు మాత్రం ఉండదు. ఈ వెసులుబాటు ఆధారంగానే ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వరద ఆధారిత పలు ప్రాజెక్టులను ప్రతిపాదించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ అదనపు జలాలను కూ డా మూడు రాష్ట్రాలకు పంచింది. బ్రిజేష్ కుమార్ అవార్డు అమల్లోకి రాకుండా సుప్రీం కోర్టు నిలిపివేసినందున ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ అమల్లో ఉన్నది. వరద జలాల వినియోగం కోసం ఉమ్మడి రాష్ట్రం తెలంగాణాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బి్సి ప్రాజెక్టులు; రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ మొదలైనవి ప్రతిపాదించింది. తెలంగాణ ప్రాజెక్టులకు 77 టిఎంసిలు, ఆంధ్రా ప్రాజెక్టులకు 150 టిఎంసిల వరద జలాలు కేటాయించారు. వరద జలాల కేటాయింపుల్లో కూడా కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ పట్ల వివక్షను చూపించారు ఉమ్మడి పాలకులు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణా ప్రాజెక్టులకు న్యాయబద్దంగా రావలసిన వాటా కోసం తెలంగాణా ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పోరాటం చేస్తున్నది. నికర జలాల కేటాయింపులు లేని ఎస్‌ఎల్‌బి్సి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండీ, గట్టు తదితర ప్రాజెక్టులకు కలిపి కనీసం 565 టీఎంసీలు రావాలని ఆశిస్తున్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా నీటిని 299:512 నిష్పత్తిలో పంచుకోవడానికి ఇరు రాష్ట్రాలు 2016 లో అంగీకరించాయి. ఇది తాత్కాలిక ఏర్పాటే తప్ప హక్కు కాదు.ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాలో తమ వాటా 512 టిఎంసిలు అని చెప్పుకోవడానికి వీలు లేదు. కొత్త ప్రాజెక్టులు కట్టి ఈ కేటాయింపులను స్థిరపరచుకుంటామని అనడం న్యాయ విరుద్దం. రాష్ట విభజన జరిగిన తర్వాత ఇప్పటికీ ఇరు రాష్ట్రాలకు కృష్ణాలో adjudicate అయిన నీటి వాటాలు లేవు. అందువల్ల మా నీటి వాటా మేము వాడుకుంటామన్న ఆంధ్రప్రదేశ్ వాదన ఆమోదయోగ్యం కాదు.
2. సముద్రంలోకి వృధాగా పోతున్న వరద జలాలను తరలించడానికి ప్రాజెక్టులు కట్టుకుంటే తప్పు ఏమిటి?
సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని కరువు పీడిత ప్రాంతాలకు తరలించడానికి తెలంగాణకు అభ్యంతరం లేదు. తెలంగాణ సర్వేజనా సుఖినోభవంతు అన్న భావన కలిగిన సమాజం. అయితే వరద జలాలు అంటే ఏవీ? 216 టిఎంసిల సామర్థ్యం కలిగిన శ్రీశైలం, దిగువన ఉన్న312 టిఎంసిల నాగార్జున సాగర్, 45 టిఎంసిల పులిచింతల నిండి పొంగి పొర్లుతున్నప్పుడు మాత్రమే కృష్ణా నదిలో వరద జలాలు ఉన్నట్టు లెక్క. ఇవన్నీ పొంగి పొర్లుతున్నప్పుడు, శ్రీశైలం వద్ద పూర్తి నీటి మట్టం (885 అడుగులు) ఉన్నప్పుడు కదా వరద జలాలను తీసుకోవలసింది? అప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీ ద్వారానే ఇప్పుడున్న వ్యవస్థ ద్వారానే తీసుకుపోయేఅవకాశం ఉంది కదా! మరి ఈ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పంపింగ్ లెవెల్ శ్రీశైలం జలాశయం అట్టడుగు నుంచి (797 అడుగులు) నీటిని తోడుకోవడం అంటే అది వరద నీటిని తీసుకోవడం ఎట్లా అవుతుంది? శ్రీశైలం రిజర్వాయర్ లోకి జూన్, జులై నెలల్లో వచ్చే కృష్ణా నది తొలి ప్రవాహాలను మొత్తంగా మళ్లించడానికి ఉద్దేశించిందే ఈ కొత్త లిఫ్ట్ స్కీం అని రూడి అవుతున్నది. అందువల్ల పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం తెలంగాణ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు లాంటిదని చెప్పక తప్పదు.వరద జలాల పేరుతో నికర జలాలను తరలించే రాయలసీమ ఎత్తిపోతాలను తెలంగాణ వ్యతిరేకించి తీరుతుంది.
3. పోతిరెడ్డిపాడు కింద ఉన్నతెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయి. వాటి అవసరాలను తీర్చడం కొసం మాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినాము తప్ప కొత్తగా సాగులోకి వచ్చే ఒక్క ఎకరం లేదు, నింపడానికి కొత్త జలాశయం లేదు.
అసలు పోతిరెడ్డిపాడు నుంచి ఎంత నీటిని తరలించడానికి అనుమతులు ఉన్నాయి అన్నది కీలకమైన అంశం. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు, జలాశయాలు అన్నీ ఏ అనుమతులు లేకుండా నిర్మించినవే. 1976 వెలువరించిన తీర్పులో బచావత్ ట్రిబ్యునల్ శ్రీశైలం ప్రాజెక్టును కేవలం జల విద్యుత్ ప్రాజెక్టుగానే పరిగణించింది. శ్రీశైలం జలాశయం నుంచి 33 టిఎంసి ఆవిరి నష్టాలను మాత్రమే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది తప్ప, ఆంధ్రప్రదేశ్ ఎంత వేడుకున్నా, సాగు నీటికి కేటాయింపులు చేయలేదు. మానవతా దృక్పథంతో మద్రాస్ నగరానికి 15 టిఎంసి తాగునీరు అందించడానికి మూడు రాష్ట్రాల మధ్య 1977 లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం పోతిరెడ్డిపాడు వద్ద నిర్మించే రెగ్యులేటర్ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని తాగునీటి కోసం మాత్రమే తరలించాలి. ఆ నీటిని సాగు కోసం వినియోగించరాదు అని ఒప్పందంలో స్పష్టంగా రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం కుడి గట్టు కాలువకు 19 టిఎంసి కృష్ణా నికర జలాలను కేటాయిస్తూ కేంద్ర ప్లానింగ్ కమీషన్ నుంచి అనుమతి పొందింది. అట్లా పోతిరెడ్డిపాడు నుంచి తరలించే కృష్ణా నికర జలాల పరిమాణం 34 టిఎంసికు పెరిగింది.
1500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం కావలసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో, 4 గేట్లతో నిర్మాణం అయ్యింది. ఆ తర్వాత అదనపు జలాల వినియోగం కోసం తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరి,గురు రాఘవేంద్ర తదితర ప్రాజెక్టులు నిర్మించుకున్నారు. ఈ ప్రాజెక్టుల కింద 350 టి్‌ఎ్‌ంసిల సామర్థ్యం కలిగిన జలాశయాలు నిర్మించుకున్నారు. ఈ ప్రాజెక్టులకు వేటికీ నికర జలాల కేటాయింపులు లేవు. ఏ ట్రిబ్యునల్ అనుమతులు లేవు. ఇవన్నీ పెన్నా బెసీన్లో ఉండే ప్రాంతాలకు కృష్ణా నీటిని సరఫరా చేసే ప్రాజెక్టులు. ట్రిబ్యునల్ అనుమతులు లేని, బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించడానికి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44000 క్యూసెక్కులకు పెంచుకున్నారు. కొత్తగా 10 గేట్లు నిర్మాణం అయినాయి. ఇప్పుడు పోతిరెడ్డిపాడు సామర్త్యాన్ని88,000 క్యూసెక్కులకు పెంచడానికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జిఓలు జారీ చేసింది. కొత్తగా రోజుకు 3 టిఎంసిలను తరలించే సామర్థ్యం కలిగిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించింది. పోతిరెడ్డిపాడు నుంచి అనుమతి కేవలం 34 టిఎంసిలకు ఉంటే ఆంధ్రా ప్రభుత్వం 250-300 టిఎంసిల నీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. అదే సమయమలో ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయిన, వంద శాతం కృష్ణా బేసీన్లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలను కొత్త ప్రాజెక్టులని ముద్ర వేస్తున్నది. గతంలో ఏనాడూ జాడ పతా లేని, పెద్ద ఎత్తున బేసిన్ ఆవలకు నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రం కొత్తది కాదట. ఇంతకంటే హాస్యాస్పదం అయిన విషయం మరొకటి ఉంటుందా?
4. తెలంగాణ ప్రాజెక్టులు శ్రీశైలం నుంచి 800 అడుగుల మట్టం నుంచి నీటి పంపు చేస్తున్నారు కనుక మేము కూడా అదే మట్టం నుంచి పంపు చేసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించాము.
బేసిన్లో ఉండే తెలంగాణ ప్రాజెక్టులను, బేసిన్ ఆవలకు నీటిని తరలించే ఆంధ్రా ప్రాజేక్టులను ఒకే గాటన కట్టి వాదించే పద్దతి గర్హనీయం. నదీ జలాల కేటాయింపుల్లో దశాబ్దాలుగా జరిగిన అన్యాయం ఫలితమే తెలంగాణ ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం. ఇదే విషయాన్నిఅపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ గట్టిగా చెప్పారు. ఇండస్ కమీషన్(1942) మొదలుకొని హెల్సింకి రూల్స్(1966), యునైటెడ్ నేషన్స్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్(1997), బచావత్ ట్రిబ్యూనల్(1980), బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్(2013), ఎన్‌డి గుల్హాటి లాంటి జల వివాదాల నిపుణులు అందరూ బేసిన్లో ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే మిగులు జలాలను బేసిన్ ఆవల ఉన్న ప్రాంతాలకు తరలించవచ్చునని నిర్దేశిస్తున్నారు. కానీ క్రిష్ణా నదీ జలాలను ఏ విధమైన సహజ న్యాయసూత్రాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు గానీ పట్టించుకోకుండా కేవలం ఆంధ్ర ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తీవ్ర వివక్ష చూపించాయి. ఉమ్మడి రాష్ట్రంలో జగినదంతా మోసపూరిత వ్యవహారమే. మొదట ఏదో విధంగా ప్రాజెక్టులను కట్టి ఆ తరువాత వాటి వినియోగాలను కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికే వాడుకలో ఉన్న, స్థిర పడ్డ వినియోగాలుగా హక్కులు అడగడం ఒక వ్యూహంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పర్వం సాగింది. విచిత్రంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా కృష్ణా బేసిన ఆవల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించేవే.
కృష్ణా ట్రిబ్యునళ్ళు బేసిన్ ఆవలి మరియు బేసిన్ లోపలి వినియోగాలను ఒకే విధంగా పరిగణించలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పును రాసేటప్పుడు బేసిన్ లోపల ప్రాంతాలు ఏవి, బేసిన్ ఆవల ప్రాంతాలు ఏవి అన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్నది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఎంత వేడుకున్నా బేసిన ఆవల ఉన్న ప్రాజెక్టులకు ఇక ఎంత మాత్రం నీటి కేటాయింపులు చేయలేమని ఖరాఖండిగా చెప్పింది. బేసిన్ ఆవలికి కేటాయింపులు చేయడంపై నిషేదం లేదు కానీ, బేసిన్ లోపలి అవసరాలను పట్టించుకోకుండా ఒక పరిమితిని మించి చేయడం సరికాదు అని స్పష్టం చేసింది. ఎన్‌డి గుల్హాటి తన అంతర్రాష్ట్ర నదుల అభివృద్ధి: లా అండ్ ప్రాక్టీస్ అనే పుస్తకంలో బేసిన్ లోని ప్రాంతాలకు ఆ నది జలాలపై మొదటి యాజమాన్య హక్కు ఉంటుంది. బేసిన్లోని ప్రాంతాల అవసరాలు పూర్తిగా తీరిన తర్వాత ఆ పైన లభించే నీటిని బేసిన్ ఆవలి ప్రాంతాలకు మళ్లించవచ్చు. బేసిన్ అవసరాలను కాదని బేసిన్ ఆవలికి తరలిస్తే ఇప్పుడైనా ముందుముందైనా అవాంఛనీయ ఉపద్రవాలకు దారితీయవచ్చు అని హెచ్చరించారు. ఇప్పుడు కృష్ణా బేసిన్లో జరుగుతున్నది అదే. కృష్ణా బేసిన్లో ఉండే మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్ ఆవల ప్రాంతాలకు నీటిని తరలించడానికి తెలంగాణకు అభ్యంతరం ఉండదు. మీరు 800 అడుగుల వద్ద నుంచి నీటిని పంపు చేస్తున్నారు కనుక మేమూ అదే మట్టం వద్ద నుంచి నీటిని పంపు చేస్తాము అన్నది మొండితనం నుంచి వచ్చే న్యాయ విరుద్ద భావన.

శ్రీధర్ రావు దేశ్ పాండే

Article About Pothireddypadu Project Dispute

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News