ప్రపంచ కవులు, రచయితలు, శాస్త్రజ్ఞులు శాంతియోధులుగా జీవించాలనుకుంటారు. వారు వారి చుట్టూ గిరిగీసుకుని కూర్చోరు. వారికి ప్రాంతాల హద్దులుండవు. మనిషిని మనిషి దోపిడీ చేస్తున్న దుష్టవ్యవస్థను ఎదిరిస్తూ బతుకుతారు. ఆ వ్యవస్థను, ఎదరించడానికి ప్రజల్ని జాగరించడానికి ప్రయత్నిస్తారు. ప్రపంచంలో ఎక్కడ స్వేచ్ఛకు భంగం వాటిల్లినా వారు చూస్తూ ఊరుకోరు. సాహిత్యకారులు తమ సాహిత్యాన్ని, శాస్త్రవేత్తలు తమ విజ్ఞాన ఫలితాల్ని సమాజాభ్యుదయానికి వెచ్చిస్తారు. 18, 19 శతాబ్దంలో జన్మించిన మహనీయులు పరిశోధనా ఫలితాలూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానమూ 20వ శతాబ్దంలో సాధించిన అపూర్వ విజయాలకు మాతృక వహించాయి. సైన్సు పరిశోధనా ఫలితాలు సాహిత్య కుసుమాలయి ప్రపంచం నలుమూలలా విస్తరించాయి. విజ్ఞాన వీచికలందించాయి.
డార్విన్, జేమ్స్ జాయిస్, మార్స్, ఏంగెల్స్, ఫ్రాయిడ్, సాత్రే, బసిస్టీస్ యాంత్రిక యుగంలో జన్మించిన ఆధునిక ఋషులుగా మానవ సమాజాన్ని సంరక్షించారు. వారు ఏకాంతంగా జీవించినా. వారు తపించింది విశ్వశాంతి విశ్వమానవత కోసమే. వీరి ఆలోచనా స్రవంతి కాంతివేగంతో ప్రపంచం అంతా ప్రవహించి మానవాళి మనో నేత్రాలు విప్పారేలా చేసింది. మానవ సమాజ వెన్నెముకను నిట్ట నిటారుగా నిలబడేలా చేసింది. ప్రపంచంలో అలుముకున్న అజ్ఞానపు తెరలు తొలగించి మానవ సమాజానికి సుఖమయ జీవితాన్నందించింది.
విద్యుత్ బల్బు కనిపెట్టిన దగ్గరే వెలుగురు చిందించి అక్కడే ఆరిపోలేదు. ఆ కాంతి ప్రపంచం నలుమూలలకూ పాకింది. చీకట్లు ఛేదించింది. పూర్వం రోజుల్లో కలరా, మశూచి, ఆట్లమ్మ వంటి అంటు వ్యాధుల వల్ల వేలాది మంది చనిపోవడం మనకు తెలిసిందే. అయితే నేటి సమాజంలో వీటి బారిన పడిన వారు ఎవరూ చనిపోవడం లేదు. టీకా వేసుకోవడం, మాత్ర మింగడం, నీళ్లు మరిగించి తాగడం లాంటి చికిత్సలు ప్రజలకి తెలిసింది సైన్సు సాహిత్యం వల్లనే. బలులు వేయడం వల్ల ఆట్లమ్మ శాంతించదు-అన్న వివేచన ప్రజలకి తెలియచేయడం కేవలం సాహిత్య కథారూపంతోనే సాధ్యపడింది. తరతరాలుగా ప్రజల్లో పాతుకుపోయిన మూఢాచారాలను పటాపంచలు చేయడానికి హేతువాదం మిళాయించి అందించినది, హృదయవిదారకమైన కథ దృశ్యరూపకమైన నాటకం. ఈ రెండు ప్రక్రియలే అద్భుత విజయం సాధించాయి. ప్రజల జీవన విధానాల్ని మార్చగలిగాయి.
ఈ నేపథ్యంలో శాస్త్రసాంకేతిక రంగాలలోగల ప్రజా ప్రయోజనకర విషయాలకు సృజనాత్మకతను జోడించి చదివించే గుణాన్ని దట్టించి కొందరు సైన్సు రచయితలు అన్నిరకాల పాఠకుల్ని ఆకర్షిస్తున్నారు. పాఠకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. సైన్సుని ప్రజాభ్యుదయం కోసమే ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సైన్సు మానవ సమాజానికి ఎంత సుఖమయ జీవితాన్ని అందించిందో అది అంతగానూ వెర్రి తలలు వేయడం కూడా మానవ సమాజం భరిస్తూనే ఉంది. ఆ దుష్టవిధానాలు మానవాళిని అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. ఈ యంత్ర యుగంలో నౌకరుగా ఉండి సేవలు చేయాల్సిన సైన్సు, యజమానిగా మారి బీభత్సం సృష్టించడంతో సాహితీ వేత్తలు, మేధావులు, శాస్త్ర వేత్తలూ కొందరు నైరాశ్యంతో అరాచక వాదులుగా మారిపోయారు. ఎన్నో వ్యష్టి వాదాలుద్భవించాయి. సైన్సు వెర్రి తలలు వేసినట్టే సాహితీ వేత్తల్లోనూ వ్యష్టివాదన మొదలయింది. రచయితలు తమ విజ్ఞానం కోసమే చదువుకుని తమ మనస్సుకి నచ్చిందే రాసుకుని తమలో తామే పరమానందం చెందుతూ అభ్యుదయ భావజాలం నుండి ముఖం తిప్పుకున్నారు. తాము నిర్మించుకున్న భావనామయ జగత్తులోనే విహరిస్తూ హంసగీతి పాడుకుంటూ అదృశ్యమై పోయారు. నేటికీ వారి అంశీయులు సాహిత్యంలో చెట్టుమీద, పిట్టమీద కవిత్వం రచిస్తూనే ఉన్నారు. ప్రజాభ్యుదయాన్ని అంగీకరించని ఈ కురచు బుద్ధులు మనకి అక్కడక్కడ తారస పడుతుంటారు నేటికీ. వీరు తమలోని విజ్ఞానాన్ని సమాజానికి ఇసుమంతైనా ఉపయోగపడేలా చూడరు. అయితే దీనికి విరుద్ధంగా మరికొందరు రచయితలు సమాజంలో ఏ మాత్రం కుసంస్కార దుర్గంధాలు అలుముకున్నా వెంటనే వాటిని తమ రచనల ద్వారా ప్రజలకి అందించి వారిని చైతన్య పరచడం తక్షణ కర్తవ్యంగా భావిస్తారు. ఛాందస భావాల నుండి జాతిని రక్షించి హేతువాద దృష్టిని ప్రజలకి అందిస్తారు. అలా సైన్సుని సాహిత్యాన్ని ప్రజాధ్యదయానికే అంకితం చేస్తూ కుడి ఎడమలుగా రచించిన ప్రముఖులు కొడవటిగంటి కుటుంబరావు గారు. వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బహుకొద్ది మంది రచయితల్లో డా॥ దేవరాజు మహారాజు ఒకరు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సైన్సులో ఆచార్యులు. వీరు కథ కవిత సాహిత్య వ్యాసం, సైన్సే వ్యాసం, బాల సాహిత్యం, విమర్శ, సంపాదకత్వం, అనువాదం, సినిమా స్క్రిప్టు మున్నగు వాటన్నింటిలోను కృషి చేసి గొప్ప ఉపజ్ఞను సాధించారు. జీవశాస్త్రాన్ని నవజీవన శాస్త్రాన్ని తెలుగు భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన పరిశోధకులు. ఇంచుమించు సాహితీ ప్రక్రియలన్నింటిలోనూ తనదైన శైలిని ’రాజముద్ర’గా ప్రదర్శించినారు. లైఫ్ టానిక్, స్మృతి సుగంధం, స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం, ఆత్మనుంచి అక్షరానికి సాహిత్య విశ్లేషణ వ్యాస సంపుటాలు, గుడిసె గుండె, గాయపడ్డ ఉదయం, కవితా భారతి, రాజముద్ర, మధుశాల మరాఠీ దళిత కవిత, నాటికలు, పాఫ్యులర్ సైన్స్ వ్యాసాలు మున్నగు రచనలు వీరికి ఉత్తమ సాహిత్య కారునిగా పాఫ్యులర్ సైన్స్ రచయితగా కీర్తినందించాయి.
డా. దేవరాజు మహారాజు సైన్సుని సాహిత్యాన్ని ఒకటి మేధని రెండోది పాఠక హృదయాన్ని రెండు స్థాయిల్లో పనిచేసేలా అందించారు. సైన్సు ప్రత్యక్షంగా సామాజిక రుగ్మతలను తుడిచిపెట్టేలాగ, సాహిత్యం పరోక్షంగా మానసిక వైక్లబ్యాలను శాశ్వతంగా మాన్సేలాగ ఆయన తన సమస్త సాహిత్యాన్ని ననపథంలో నిష్కంటకంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రపంచ సమాజంలో ఎక్కడా ఎవరి జీవితమూ విడిగా ఏకాకిగా మనుగడ సాగించదు. సాగించలేదు. ప్రతి జీవితము ఎన్నింటితో సంబంధం కలిగి ఉంటుంది. ఇలాంటి ఆధార-ఆధేయాల్ని అధ్యయనం చేయడం, లోతులు పరికించడం దేవరాజు మహారాజు అలవరుచుకున్న ప్రధాన అంశం. తనదైన ఉపజ్ఞ ‘The land and sea the animals, fishes and birds the sky of heaven and orbs the forests mountains and rivers are not small theams’ అన్న సత్యం ఆయనకి స్పష్టంగా తెలుసు. దేవరాజు అలవరుచుకున్న లోదృష్టితోనే సమస్త సృష్టి రహస్యాల్ని ఈక్షించి అందులోంచి సైన్సుకి కావలసిన అంశాల్ని సైన్సుకి సాహిత్యానికి కావలసిన అంశాల్ని సాహిత్యానికి కళాత్మకంగా సృష్టించి గ్రంథస్థం చేశారు. మొదటి పనిలో వారు ఒక డాక్టరేటు అందుకున్నారు. సాహిత్యంలో రెండు మూడు డాక్టరేట్లకు సరితూగినంత ఆలోచనాత్మక సాహిత్యాన్ని తెలుగు. జాతికి అందించారు.
పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ కవికి తెలియని విషయం అంటూ ఉండకూడదు అన్నట్టుగానే ఆయన ‘ఆత్మనుంచి అక్షరానికి’ ఒక అఖండ యాత్ర సాగించి, ఆ సుదీర్ఘ యాత్రా సమయంలో పొలం, కలం, కంప్యూటర్, ఈమెయిల్, బుద్ధుడు, కన్నీరు, కాలం, భూగోళం, ప్రకృతి, జీవకణం, చెట్టు, వేరు లాంటి వాటిపై రచనలు, రసాయనిక చర్యతో మేళవించి మానవ ఇతిహాసాన్ని ఒక మహా యాత్రగా చిత్రీకరించారు. పాఠకుల్ని ఆ మహాయాత్రలోకి రప్పించుకుని యాత్రికుల్ని చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళి ఎన్నో అద్భుత దృశ్యాన్ని చూపించారు. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్న శ్రీకృష్ణదేవరాయలను ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్టు’ అన్న నికోలై కౌంటిని పాఠకులకు పరిచయం చేసి గొప్ప అదృష్టాన్ని కల్పించారు దేవరాజు మహారాజు. వీరు ఏర్పరుచుకున్న సాహితీ సభా ప్రాంగణానికి మూడు తరాల సాహితీవేత్తల్ని కొలువుతీరా ఆహ్వానించారు. వారితో గల అనుభవాల ’స్మృతి సుగంధాల్ని’ తాను ఆస్వాదించడంతోపాటు, పాఠకులచేత ఆస్వాదింపచేశారు. ’కవితా భారతి’, ‘కవితా ప్రపంచం’ తెలుగు పాఠకులకు అందించడంతోపాటు నేడు కథ నవల భ్రష్టుపడుతున్న సాహిత్య విలువలు విశ్లేషించి పాఠకుల ఆలోచనలను ఉన్నతీకరించారు. మూఢనమ్మకాల్ని వదిలిద్దాం, మూఢనమ్మకాలు-సైన్సు, భారతీయ విజ్ఞాన వికాసం, భారతీయ వారసత్వం సంస్కృతి విజ్ఞాన నాగరికతలు, మొదలయిన వీరు రచించిన గ్రంథాలు ప్రాణ వాయువు దొరక్క కొట్టుమిట్టాడుతున్న నేటి తెలుగు జాతికి లైఫ్ టానిక్కులు, ఆక్సిజన్ సంచీలు, దారి దీపాలు. భారతీయ చరిత్రలో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం మూఢనమ్మకాలు ఛాందస వాదాలతోనూ ఎదిరించి పోరాడిన స్త్రీ మూర్తుల విజయ దరహాసాలను అక్షరబద్ధం చేసి తొలినాటి స్త్రీ వాదుల జీవిత గాథలను నేటి స్త్రీవాదులకు అందించారు. వారి ఉదయానికి ఊపిరులందించారు. బహినా బాయి, రససుందరి, సావిత్రి బాయి ఫూలే, తిరుమలాంబ, శరత్‌కుమారి బండారు అచ్చమాంబ లాంటి విదుషీమణులు నడిపిన స్త్రీ సంస్కరణోద్యమాన్ని వీరగాథల్ని వీరు గ్రంథస్థం చేశారు. మహిళల ఆగ్మగౌరవాన్ని గౌరవించారు. ఘోషా, పరదా, తలాఖ్ వంటి మూఢ ఆచారాలతో ముస్లిం స్త్రీలను హింసిస్తున్న సందర్భాలు, సిద్ధిఖా బేగం, చక్రవర్తిని తిరస్కరించిన హమీదా, హుమయూన్ నామా రచించిన గుల్బదన్‌ల సాహస కృత్యాలు తెలుసుకోవాలంటే దేవరాజు మహారాజు రచించిన “స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం” గ్రంథం తప్పక తెరిచి చూడవలసిందే. నేడు ఫెమినిస్టు ఉద్యమాలు నడుపుతున్న వారందరికీ ఈ గ్రంథం కరదీపిగా అభివర్ణించవచ్చు. కందుకూరి కవుల చరిత్ర ఆంధ్ర శేషగిరిరావు ఆంధ్ర విదుషీమణులు సోమసుందర్ నూరు శరత్తులు జానుమద్ది హనుమచ్చాస్త్రిగారి సుప్రసిద్ధుల జీవిత విశేషాలు మున్నగు గ్రంథాలు తెలుగువారి సంస్కృతిని ఎంతగానో సుసంపన్నం చేశాయి. ఆ వరుసలోని హరే దేవరాజు మహారాజు కూడా. ప్రముఖుల జీవన రేఖలు గ్రంథ రూపంలో అందించి తెలుగు వారికి ఎంతో మేలు చేకూర్చారు. వారి పరిచయమే మనకి పరిచయమైనంత అనుభూతిని కలిగించారు. డా॥ దేవరాజు మహారాజు అనువరించిన స్టెయిన్ బెక్ నవల- ద పెరల్ “మంచి ముత్యం’‘గా తెలుగు అనువాద సాహిత్యానికే ఆణిముత్యంగా అభివర్ణించవచ్చు. నవల ఆద్యంతమూ ఎక్కడా అనువాదం అన్న అనుమానం పొడసూపదు. స్వంత రచనలాగే భాసిస్తుంది. ఒక్క పాత్రల పేర్ల మూలంగానే పాఠకుడు అనువాదం అని గుర్తించగలుగుతాడు. వీరి అనుసృజనికి ఇది ప్లస్ మార్క్. డా॥ దేవరాజు మహారాజు రచించిన కాలాన్ని వెనకేసిన మనిషి’ జీవపరిణామ సిద్ధాంతానికి సృజనాత్మక సాహితీ ప్రతిబింబం చినుకు మాస పత్రికలో ధారావాహికగా వచ్చి పాఠక ప్రేక్షకుల్ని ఆలోచింపచేసింది. ఈ భూమ్మీద మానవుని పుట్టుక కాల ప్రభావం మానవుని జయాపజయాలు అన్నీ ఒక కథారూపంలో రచించారు. అలాగని ఇది కథకాదు, నవలకాదు, నాటకం. అంతకన్నా కాదు. ఈ గోళం మీద మానవుడు కాలాన్చిన దగ్గరనుండి మానవుడు కాలాన్ని తన చేతిలోకి తీసుకున్న నేటి సైన్సు యుగం వరకూ వైజ్ఞానిక పరిణామం సృజనాత్మకంగా వాస్తవ పద చిత్రాలతో రూపొందించారు.. ‘Literature is the Science of feeling. Science is the art of learning’ అన్న ఫ్రాయిడ్ వాక్యాలు ప్రొ. దేవరాజు మహారాజు లాంటి సైన్సు సాహితీ వేత్తకు అక్షరాలా అచ్చుగుద్దినట్టు అన్వయిస్తాయి. ఇటు సైన్సుని అటు సాహిత్యాన్ని సవ్యసాచిగా నడపడం తెలుసుకున్న సృజనాత్మక శాస్త్రవేత్త అని మనకి రూఢీగా తెలుస్తుంది. వీరు పాఠ్యాంశాలుగా నేర్చుకున్న సైన్సు చదువులు, వీరు సృజనాత్మకంగా రచించే సాహిత్యాంశాలకి ఎంతగానో ఉపకరించాయన్న సత్యం వీరి అన్ని రచనలూ వ్యక్తం చేస్తాయి. ఫ్రాయిడ్ వాక్యాలు నిజం అని నిరూపిస్తాయి.
“నా కృషి నేను చేసుకుంటూ పోతున్నాను.
ఎవరి నుండీ ఏమీ ఆశించడం లేదు
తక్కువ స్థాయి గుర్తింపుకి పాపులారిటీ కి నేను వ్యతిరేకిని
అవార్డుల వల్ల సత్కారాల వల్ల నాకు తృప్తి కలగదు
అసంతృప్తి రెట్టింపు అవుతుంది” అని అంటారు వీరు.
అక్షరాక్షరం మానవాభ్యుదయాన్నే ఆకాంక్షించిన దేవరాజు మహారాజు, కోటి రతనాల తెలంగాణ వీణ మోగించిన దాశరథకి నచ్చిన కవి. అచ్చమైన భారతీయ కవి.
తెలంగాణ వైతాళికులలో ఒకరైన దేవులపల్లి రామానుజరావు పేర తెలంగాణ సారస్వత పరిషత్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారం సుప్రసిద్ధ సాహితీవేత్త, మానవవాది డాక్టర్ దేవరాజు మహారాజు గారు ఈ నెల 24న హైదరాబాదులో స్వీకరించబోతున్న సందర్భంగా..
– విరియాల లక్ష్మీపతి
Article about Telugu Poet Dr Devaraju Maharaju