తెలంగాణ రాష్ట్రానికి వరుసగా మూడోసారి 2023 నుంచి 2028 వరకూ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారా… ఎనిమిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మరో ఏడేళ్ళపాటు ముఖ్యమంత్రిగా కొనసాగటానికి వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారా… అని అంటే అవుననే సమాధానాలను వ్యక్తంచేస్తున్నారు టీఆర్‌ఎస్ నాయకులు. ఉద్యమ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా ప్రజల మనసులను గెలుచుకొన్న టిఆర్‌ఎస్ పార్టీ వచ్చే టర్మ్‌లో అభివృద్ధి చేసి చూపించిన పార్టీగా ప్రజల్లోకి వెళ్ళేందుకు ఈ ప్లీనరీ నుంచే ముఖ్యమంత్రి కే.సీ.ఆర్.సంకేతాలు పంపించారు. అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతూ నిరాఘాటంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కే.సి.ఆర్. తనదైన ముద్రవేస్తూన్నారు. సమైక్యాంధ్ర పాలకుల ఏలుబడిలో సాగునీటి సంగతి దేవుడెరుగు కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుర్భర పరిస్థితులను చవిచూసిన తెలంగాణ ప్రజలకు వేల సంఖ్యలో చెరువులు మరమ్మత్తులు చేసి, కొత్తగా చెరువులను నిర్మించి నదీ జలాలను చెరువులకు తరలించి ఏటా రెండేసి పంటలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పండించుకునే విధంగా చేసిన కెసిఆర్ అంతులేని ఆత్మవిశ్వాసం, ధీమాతోనే వచ్చే ఏడేళ్ళ వరకూ తామే అధికారంలో ఉంటామని ప్లీనరీ సాక్షిగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనక తెలంగాణ ప్రజలపైన కే.సీ.ఆర్.కున్న అచంచలమైన అభిమానం, తెలంగాణ ప్రజల్లో తనపట్ల తప్పకుండా కృతజ్ఙతా భావం ఉంటుందని, మేలు చేసిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకునే మనస్తత్వం కలిగిన తెలంగాణ ప్రజలు టీ.ఆర్.ఎస్.ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరని, అందుకే తెలంగాణ ప్రజల కోసం ఇంతలా అభివృధ్ధి-సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నందున తప్పకుండా తననే సంపూర్ణంగా ఆదరిస్తారని కే.సీ.ఆర్. బలంగా నమ్ముతున్నారు. రానున్న ఏడేళ్ళల్లో సుమారు 23 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజల కోసం ఖర్చు చేయబోతున్నామని, అందులో దళితబంధు వంటి పథకాలకు ఒక లక్షన్నర కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయలేమా అంటూ కే.సీ.ఆర్. ధీమాగా చెప్పిన మాటలు దళిత వర్గాల మనసులను గెలుచుకునే ఉంటుంది. ఒక్క దళిత బంధుకే పరిమితంగా కాకుండా బీసీలు, బాగా వెనుకబడిన బీసీలు, మైనారిటీలు, చివరకు కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ వంటి అగ్రకులాల పేదలకు కూడా దళితబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ఆర్ధికాభివృద్ధే తన లక్షమని కే.సీ.ఆర్. ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు న్నమ్ముకున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడుతూ తాను అన్ని వర్గాల ప్రజలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా&సర్వతోముఖాభివృద్ధి చేయడమే తన లక్షమని కే.సీ.ఆర్. ప్లీనరీలో ప్రకటించి అందరి మన్ననలను పొందారు. అంతేగాక ప్రతిపక్ష పార్టీలకున్న రాజీకయపరమైన ఇబ్బందులను కూడా ప్లీనరీలో లేవనెత్తి ఆ పార్టీలకు అధికారమిస్తే దళితబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టలేరని, ఒకవేళ ఎవ్వరైనా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తేనే అవి జాతీయ పార్టీలు గనుక ఒక్క తెలంగాణలో ప్రవేశపెడితే తాము దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది గనుక అలాంటి ప్రస్తావన తేవద్దని తిట్టి వెనక్కు పంపించే అవకాశాలుంటాయని కే.సీ.ఆర్. వివరించిన వైనం ప్లీనరీలో పాల్గొన్న నేతలనే కాకుండా టీవీల్లో ప్రత్యక్షప్రసారాలు చూసిన ఇతరులను కూడా ఆలోచింపజేశాయి. ఎస్& కే.సీ.ఆర్. చెప్పింది నిజమే కదా&అని అనిపించుకోగలిగారు. అందుకే రానున్న ఏడేళ్ళల్లో అమలు కాబోయే పథకాలకు కే.సీ.ఆర్. ఇప్పట్నుంచే శ్రీకారం చుట్టారు. 202౩లో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా టీ.ఆర్.ఎస్.ను గెలిపించుకోవాలి లేకుంటే అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలు రద్దవుతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొనే విధంగా వ్యూహరచన ఉందని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. కరోనా కాలంలో కూడా ఆర్ధికంగా ప్రభుత్వ ఖజానాకు అంతులేని నష్టం వాటిల్లినప్పటికీ ఎక్కడా వెనుకంజ వేయకుండా అన్ని పథకాలను యధేఛ్ఛగా ముందుకు తీసుకుపోతుండటం, ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపకుండా సజావుగా పాలన సాగిస్తుండటంతో పాటుగా దళితబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలను లక్షలాధికారులను చేస్తున్న ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. తప్పకుండా తాను నిర్దేశించుకొన్న లక్షాలను సాధిస్తారని నేతలు ధీమాగా చెబుతున్నారు. దేశం యావత్తూ ఉలిక్కిపడేటట్లు చేసిన రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలకు తోడుగా ఇప్పుడు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళితబంధ పథకం వంటి పథకాలే టీ.ఆర్.ఎస్.పార్టీని విజయతీరాలకు చేరుస్తాయని నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. సమైక్యపాలనలో వానాకాలంలో కూడా చెరువుల్లో నీరు కనిపించని రోజులను తెలంగాణ ప్రజలు ఇంకా మరచిపోలేదని, అలాంటి కరువు పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్కలంగా వేసవిలో కూడా నీరు కనిపిస్తున్న దృశ్యాలు ప్రజలను టీ.ఆర్.ఎస్.పార్టీ పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండే విధంగా చేస్తాయని, ఇందులో ఎలాంటి సందేహంలేదని అంటున్నారు. ఇకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్షపార్టీల కల్లబొల్లి కబుర్లను నమ్మి మోసపోయేందుకు ఎవ్వరూ సిద్దంగా లేరని, ఒకవేళ ఈ రెండు అంశాలు కూడా పనిచేస్తాయని భౠవించినా ఆ వ్యతిరేకత కేవలం పది శాతానికే పరిమితంగా ఉంటుందని, మిగతా తొంభై శాతం ప్రజలు టీ.ఆర్.ఎస్. పార్టీ ప్రభుత్వం చేసిన మంచి పనులను తప్పకుండా గుర్తుంచుకొంటారని, అందుకే తమ అధినేత అంతటి ధీమాతో వచ్చే టర్మ్ కూడా తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పారని ఆ నాయకులు విశ్లేషిస్తున్నారు.
సిహెచ్. శ్రీనివాసరావు
Article about TRS Plenary