ఈ దేశ సామాజిక స్వరూప స్వభావాల రీత్యా ఇది ఎన్నటికీ సమసిపోని అనునిత్య వేదనాభరిత సమస్య అనడం అబద్ధం కాబోదు. దేశంలో ప్రతి రోజూ లేదా ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట దళితులపై దూషణ, దౌర్జన్య, అత్యాచారాల వంటివి మామూలైపోయాయి. ప్రాచీన భారతంలో ఏమి జరిగినప్పటికీ అది గతం. ప్రజాస్వామిక జీవన విధానాన్ని ఎంచుకొని అందుకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించుకొని అమల్లోకి తెచ్చుకున్న తర్వాత కూడా సాటి మానవులపై సామాజిక వివక్ష చూపించడం, అమానుషాలకు పాల్పడడం జాతికి తలవంపులు తెచ్చే విషయం. ఎక్కడో కాదు దేశ రాజధానిలోనే తొమ్మిదేళ్ల దళిత బాలికపై హత్యాచారం చేసి కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకోకుండానే దహనక్రియలు జరిపించిన దారుణం సంభవించింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ అమానుష ఘటన జాతీయ పార్టీలు సహా వివిధ రాజకీయ పక్షాల దృష్టిని విశేషంగా ఆకర్షించడానికి కారణం ఇది దేశ రాజధానిలో జరగడమేనని అనుకోవాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా తదితర నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దళిత బాలిక కూడా ఈ దేశం కన్నబిడ్డేనని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని రాజకీయ పక్షాలన్నీ కలిసి చిత్తశుద్ధితో కృషి చేస్తే దళితులు, మహిళలు, బిసిలు, మైనారిటీలు తదితర సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాల పట్ల భారతీయ సమాజం ధోరణిలో సమూలమైన మార్పు అసాధ్యమేమీ కాదు. అధికారాన్ని సాధించుకోడం కోసం ఈ వర్గాలను వాడుకొని వదిలిపెట్టడానికి రాజకీయ పక్షాలు అలవాటుపడ్డాయి. అందుచేత ఇటువంటివి జరిగినప్పుడు వివిధ పార్టీల నేతలు పలికే పలుకులకు విలువ లేకుండా పోతోంది. సామాజిక చిన్నచూపుతో కింది వర్గాలను అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ, అందుకు కఠిన శిక్షలను నిర్దేశిస్తూ గట్టి చట్టాలున్నప్పటికీ అవి అమలుకు నోచుకోడం లేదు. 2009- 2018 మధ్య దేశంలో దళితులపై అమానుష ఘటనలు 6 శాతం పెరిగాయని ‘న్యాయం కోసం జాతీయ దళిత ఉద్యమం, దళిత మానవ హక్కుల జాతీయ ప్రచారోద్యమ సంస్థ కలిసి జరిపిన సర్వేలో తేలింది. 2009 18 లో దళితులపై అత్యాచారాల నిరోధ చట్టం కింద నమోదైన కేసుల్లో సగటున 88.5 శాతం కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని, దళిత మహిళలపై హింసా దౌర్జన్యాలు అధికంగా జరుగుతున్నాయని ఈ నివేదిక తెలియజేసింది.
2019 ఏప్రిల్‌లో ఉత్తరాఖండ్‌లో తమతో పాటు తమ ఎదురుగా కుర్చీలో కూర్చొని వివాహ భోజనం చేసినందుకు 21 ఏళ్ల దళిత వ్యక్తిని అగ్రవర్ణస్థులు చితకబాదారు. ఆ దెబ్బలకు అతడు తొమ్మిది రోజుల్లో మరణించాడు. గుజరాత్‌లో చనిపోయిన ఆవు తోలు వొలుస్తున్నందుకు ఒక దళిత కుటుంబాన్ని దారుణంగా కొట్టారు. దేశంలో ప్రతి 18 నిమిషాలకు ఒకసారి దళితులపై దౌర్జన్యకాండ సాగుతున్నదని అంచనా. స్త్రీ, పురుష, కుల, మత, ప్రాంత, భాష మున్నగు వాటి ప్రాతిపదికగా దేశ ప్రజల మధ్య అసమానత గాని, వివక్ష గాని చూపడం నేరమని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. ఎటువంటి తేడా లేకుండా వయోజనులందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించడం ద్వారా ఈ విషయాన్ని సందేహాతీతంగా చాటింది. అయినా సమాజం పరిణతి చెందనప్పుడు ఏర్పాటు చేసుకున్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఆధారంగా అగ్ర, అల్ప తేడాలతో మనుషులను విభజించి చూసే వివక్ష ఇప్పటికీ తొలగడం లేదు. ఆస్తి, అంగ బలం, ముష్కరత్వం బొత్తిగా ఉండని కింది వర్గాలకు చెందిన అమాయక జనాన్ని వేధించడం, అత్యాచారాలకు గురి చేయడం నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఢిల్లీలో మైనర్ దళిత బాలికపై హత్యాచారాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలోని బూల్గరీ గ్రామంలో 20 ఏళ్ల దళిత మహిళను నలుగురు అగ్ర వర్ణస్థులు సామూహిక అత్యాచారానికి గురి చేసి చంపేసిన ఉదంతం తెలిసిందే. ఢిల్లీ దారుణాన్ని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంత వరకు స్పందించకపోడాన్ని విజ్ఞులు ఎత్తి చూపుతున్నారు. ఢిల్లీ పోలీసు విభాగం నేరుగా కేంద్ర హోం శాఖ అధికార పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ ఘటన జరిగిన వెంటనే హోం మంత్రి తగిన ప్రకటన చేసి ఉండవలసింది. ఇప్పటికైనా కేంద్ర పాలకులు తక్షణమే స్పందించి చట్ట ప్రకారం నిందితులకు శిక్ష పడేలా చేయడం అవసరం. అది దేశ వ్యాప్తంగా దళితులలో ధైరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. కులాధిపత్య దురహంకారం గూడుకట్టుకున్న వారిలో భయాన్ని కలిగిస్తుంది. చట్టాలు ఎన్ని ఉన్నా రాజకీయ నాయకత్వం గట్టి సంకల్పంతో భారతీయ సమాజంలోని ఈ రుగ్మతను సమూలంగా తొలగించడానికి నడుం బిగించవలసి ఉంది.
Article on 9 years dalit girl raped in Delhi