Thursday, January 23, 2025

గోవా బీచ్ తరహా సిద్దిపేటలో ‘ఆర్టిఫిషియల్ బీచ్’

- Advertisement -
- Advertisement -
  • కెసిఆర్ దీవెనలు … సిద్దిపేట ప్రజలు ఇచ్చిన శక్తి
  • ప్రజలు చూపిన ప్రేమ ఆదరణకు ఎంత చేసిన తక్కువే
  • రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 100 ఆరోగ్య కేంద్రాలు రెండు నెలల్లో సిద్దిపేటకు రైలు
  • ఆకు పచ్చని ఆరోగ్య సిద్దిపేట వైపే మనందరీ అడుగులు
  • యూజీడి పూర్తితో తొలగిన దోమల, ఈగల బాధ
  • ప్రతి జాతీని గౌరవించి ఆత్మ గౌరవ భవనాలు నిర్మించాం 
  • చదువుల నిలయంగా మారిన సిద్దిపేట
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: గోవాలో ఉండే సముద్రం బీచ్ తరహా ‘సిద్దిపేట ఆర్టిఫిషియల్ బీచ్’ను అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యా రోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 6,26,27 వార్డులలో నూతనంగా నిర్మించిన యాదవ , ఎకలవ్య సంఘాల భవనాలతో పాటు మహిళా సమాఖ్య భవనాన్ని ఆయన ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇక ముందు సిద్దిపేట ప్రజలు సముద్రం బీచ్‌ల కోసం గోవా లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా సిద్దిపేటలోనే ఆలాంటి ఆహ్లాదాన్ని పొందేలా లారీల కొద్ది ఇసుకను వేస్తూ ఆర్టీఫిషియల్ బీచ్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఈ బీచ్ సముద్రం బీచ్ తరహాలోనే ఉంటుందన్నారు.

కెసిఆర్ దీవెనలు సిద్దిపేట ప్రజలు ఇచ్చిన శక్తి మేరకు అభివృద్ధి కోసం పని చేస్తానన్నారు. నియోజక వర్గ ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ ఎంత చేసిన తక్కువేనన్నారు. రెండు నెలల్లో సిద్దిపేటకు రైలు రానుందని ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాను ప్రపంచంలో ఎక్కడ తిరిగిన అక్కడ కనబడే మంచి పనులను సిద్దిపేటలో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నదే తన తపన అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇందులో బాగంగా సిద్దిపేటలోని ఎల్లమ్మ గుడి బస్తి దవాఖానాలో ఈ ఆరోగ్య కేంద్రాలు ప్రతి మంగళవారం మహిళలకు వైద్యసేవలు అందిస్తామన్నారు. మహిళలు ధైర్యంగా చెప్పుకునే విధంగా ఈ ఆరోగ్య కేంద్రంలో మహిళా సిబ్బంది ఉంటారని అన్ని విదాల పరీక్షలు చేసి మందులు అందిస్తారన్నారు.

ప్రతి జాతీని గౌరవించి సిద్దిపేటలో 54 ఆత్మ భవనాలను నిర్మించుకున్నామన్నారు. చదువులకు నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నామని తెలిపారు. ఆకుపచ్చ ఆరోగ్య సిద్దిపేట వైపే మనందరి అడుగులు పడాలన్నారు. సిద్దిపేట కోమటి చెరువు అందాలను వీక్షించడానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు. త్వరలో సిద్దిపేటలో డైనోసర్ పార్కుతో పాటు శిల్పారామంను ప్రారంభించుకోబోతున్నామన్నారు. అలాగే రెండో రింగు రోడ్డు సైతం తుది దశకు చేరుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ప్రజాప్రతినిధులు, నాయకులు జంగిటి కనకరాజు, పాల సాయిరాం, కెమ్మసారం ప్రవీన్‌కుమార్, సద్ది నాగరాజురెడ్డి, సాయిగౌడ్, పోశంగారి సత్తిరెడ్డి, మల్లికార్జున్, మల్లారెడ్డి , ఇర్షాద్, రాంచందర్, సురేశ్, శ్రీనివాస్, ఆరవింద్, లక్ష్మన్, దుర్గయ్య, లికిఖ్, రాజు, ఐలయ్య, శ్రావన్, నర్సింలు, ఆశోక్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News