Sunday, December 22, 2024

కృత్రిమ మేధ: ప్రపంచ భవితవ్యం

- Advertisement -
- Advertisement -

1950ల నుండి కృత్రిమ మేధస్సు (ఎఐ=AI) విషయంలో అనేక పరిశోధనలు జరిగి, అది సిద్ధించి ప్రస్తుతం మానవ జాతి చేతిలోఒక కొత్త సాధనం సమకూరింది. నవంబర్ 2022లో విడుదలైన చాట్ జిపిటి దీనికి ఒక తాజా ఉదాహరణ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రపంచ భవితవ్యం ఏమి కానుంది అనే చర్చ కూడా మొదలయింది. ఇది కార్పొరేట్ ప్రపంచానికి అందివచ్చిన ఫాసిస్టు ఆయుధం అని కొందరు వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధస్సు అంటే యంత్రాలు, ముఖ్యంగా కంప్యూటర్ వ్యవస్థల ద్వారా మానవ మేధస్సులో జరిగే ప్రక్రియలను అనుకరించడం. డేటా సేకరణ, డేటా ఎంట్రీ, కస్టమర్ ఫోకస్డ్ బిజినెస్, ఇ -మెయిల్ ప్రతిస్పందనలు, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, ఇన్వాయిస్ జనరేషన్ వంటి యాంత్రికంగా పునరావృతం చేసే సాధారణ (రొటీన్) పనులను ఆటోమేషన్ చేసి పనిలో విసుగుదలను తగ్గించి మనిషి మరింత సృజనాత్మకంగా చేసుకోవాల్సిన పనులకు సమయం కల్పిస్తుంది.

Also Read: అడ్డగాలేసింది హస్తమే

రోబోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ అసిస్టెంట్లు, హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, ఆటోమేటెడ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్, వర్చువల్ ట్రావెల్ బుకింగ్ ఏజెంట్, సోషల్ మీడియా మానిటరింగ్, మార్కెటింగ్ చాట్ బోట్స్ వంటి రూపాలలో కృత్రిమ మేధస్సు ఇప్పటికే మన నిత్య జీవితంలోకి ప్రవేశించింది. అది సాంకేతిక అభివృద్ధిలో గుణాత్మకమైన, పరిమాణాత్మకమైన పెద్ద మార్పును సూచిస్తుంది. ఇది మరింత వేగవంతమైన, శక్తివంతమైన మెరుగైన కంప్యూటర్ మాత్రమే కాదు. ఇది కంప్యూటర్లకు అవి ఎలా నేర్చుకోవాలో నేర్పుతుంది. ఎఐ వ్యవస్థలు ఒకదాని నుండి మరొకటి దాదాపు తక్షణమే నేర్చుకుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రాథమికంగా ఒక ‘బ్లాక్ బాక్స్’. దీని నుండి ఆలోచన అవుట్ పుట్ లా ఉద్భవిస్తుంది, విస్తారమైన డేటాను విశ్లేషించే, నమూనాలను గుర్తించే, ఖచ్చితమైన అంచనాలను అందించే సామర్థ్యంతో, కృత్రిమ మేధస్సు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పరిశ్రమల ఉత్పత్తులను పెంచడం, పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చేయడం, రవాణా సౌకర్యాలను సముచితంగా నిర్వహించటం, విద్య బోధన, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల కోసం అవసరమైనమార్పులు సూచిస్తుంది. పేదరికం, ఆకలికి వ్యతిరేకంగా పోరాడటంలో కూడా సహాయపడుతుంది. ఆరోగ్య సంరక్షణలో ఎఐ, వ్యాధి నిర్ధారణను మెరుగుపరచడానికీ, కొత్త చికిత్సలను అభివృద్ధి చేయడానికీ సహాయపడుతుంది. ప్రాణాంతక వ్యాధుల నివారణలతో సహా ఔషధాలలో పురోగతికి ఇది తోడ్పడుతుంది. విద్య రంగానికి ఇది మరింత ఆకర్షణీయమైన, అద్భుతమైన అభ్యాస అనుభవాలను అందించగలదు. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీల వల్ల పరస్పర సంభాషణా రీతిలోను (ఇంటరాక్టివ్’, బోధనలో పూర్తిగా లీనమయ్యే పద్ధతిలోనూ (ఇమ్మర్సివ్) నేర్చుకోవడం జరుగుతుంది. చదువుకోవటం ఒక ఆకట్టుకునే ప్రక్రియగా మారుతుంది.

కృత్రిమ మేధ సమాజంలోను, దైనందిన జీవితంలోను అనేక మార్పులు తెస్తోంది. సిరి, గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తిగత సహాయక యాప్‌లు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు, ఇతర పరికరాలతో అనుసంధానించబడి అనేక రకాల పనులనుచేస్తుంది. మన జీవితాలను సులభతరం, సౌకర్యవంతం, సౌఖ్యవంతం చేస్తుంది. కాకుంటే మానవులు యంత్రాలపై ఆధారపడటం మరింత పెరుగుతుంది. అది సోమరితనానికి దారి తీస్తుంది. పనిలో సృజనాత్మకత, భావోద్వేగం లేకపోవడం వంటి లోపాలు వుంటాయి. అంతేకాక సమాజపరంగా కొన్ని నష్టాలు కూడా సంభవిస్తాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఎక్కువగా సమాచార కార్మికుల ఉద్యోగాలకు, వైట్-కాలర్ ఉద్యోగాలకు ముప్పు వస్తుంది. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం యజమానులను, డెవలపర్లను సుసంపన్నం చేస్తుంది. ఫలితంగా సామాజిక సంపద పంపిణీలో అసమానతలు మరింత ఎక్కువవుతాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం లేదా వినాశకరమైన జీవాయుధాలను ఆవిష్కరించడం చాలా సులభంగా జరగవచ్చని, సాంకేతికత చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి పూర్తిగా పట్టించుకోవడం లేదు అని ఆరోపిస్తున్నారు. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు స్వార్థపరులు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం చాలా వుంది. దీనిని ఉపయోగించి వక్రీకరణలతో తయారు చేసే కథనాలు, సాక్ష్యాలు, నకిలీ చిత్రాలవ్యాప్తి వల్ల ఏది నిజమో, ఏది కాదో చెప్పడం కష్టమవుతుంది. దీని వల్ల రాజకీయ పక్షాలు ఒకరినొకరు మరింత ఎక్కువగా వక్రీకరించి చూపుతారు; అయితే ఆటోమొబైల్ నుంచి న్యూక్లియర్ పవర్వరకు ప్రతి కొత్త టెక్నాలజీ మొదట్లో ఇలాంటి ప్రమాదాలను వెంట తెచ్చినవే. మనుషులు వాటిని వాడుతూనే ఆ సమస్యలను పరిష్కరించుకున్నారు.

ఏఐ గాడ్ ఫాదర్ జెఫ్రీ హింటన్ న్యూయార్క్ టైమ్స్, బిబిసితో సహా అనేక వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ‘పుతిన్ వంటి నాయకులు కొంద రు రోబోట్లకు ఎలాంటి ఉప లక్ష్యాలను నిర్దేశిస్తారో అప్పుడు అవి ఏమి చేస్తాయో ఎవరికీ తెలియదు అని వ్యాఖ్యానించాడు. చైనా పట్ల కూడా కొందరు ఇలాంటి సందేహాలనే వ్యక్త పరుస్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాలు కొన్ని గుట్టలు గుట్టలుగా తయారు చేసి పోసుకున్న అణ్వాయుధాల కన్న ఈ మేధో ఆధారిత ప్రక్రియలు ప్రమాదకరమైనవా? అని ఆలోచించాలి. ఈ దేశాలే ఇంకా ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేయడానికి, మెరుగైన యుద్ధ వ్యూహాలతో దీర్ఘకాలిక భౌగోళిక లక్ష్యాలను సాధించడానికి తమ సైన్యంలో కృత్రిమ మేధను పెంచడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. రాజకీయ దురుద్దేశాలు, చైనా- రష్యాల పట్ల అక్కసు, ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడి వున్నవారి సంకోచం, తప్ప వారి అనుమానాలకు, అభియోగాలకు ఆధారం లేదు. కొందరు భయపడుతున్నట్లు కృత్రిమ మేధ భూమిపై అన్ని జీవరాశులను తుడిచి పెట్టలేకపోయినా, దాని సంభావ్య ప్రమాదాలు ఉద్యోగాలు కోల్పోవడం, నకిలీ వార్తలు, భ్రాంతికరమైన మభ్యపెట్టే వాస్తవాలకు మాత్రమే పరిమితం కాదు.

ఇప్పటికే, ఇంటర్నెట్, అధునాతన శోధనలు మన అభిజ్ఞా సామర్థ్యాలను దిగజార్చాయి. మీరు ఎన్ని ఫోన్ నంబర్లను గుర్తుంచుకునే వారు? ఇప్పుడు ఎన్ని గుర్తుంచుకోగలుగుతున్నారు? కొన్ని విధాలుగా మనం ఇప్పటికే మన మనసులను ఇంటర్నెట్‌కి, కంప్యూటర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానించాము. దీనిలో భాగంగా ఆలోచనలకు సైతం వాటిపై ఆధారపడుతున్నాము. కన్సిలియన్స్ ప్రాజెక్ట్ వ్యవస్థాపక సభ్యుడు డేనియల్ ష్మాచ్టెన్ బర్గర్‌” కృత్రిమ మేధకు మానవ చైతన్యంలో వున్న ఒక ముఖ్య కోణం లేదు. అదే వివేకం -సంబంధాలకు సున్నితత్వం, సాధారణ శ్రేయస్సుకు ప్రాధాన్యం, జీవన విలువలతో పాటు పరిమితులను గుర్తించడం దానికి తెలియదు అని వివరించారు. శక్తి వినియోగం, వనరుల వినియోగంపై మనం నియంత్రణ పాటించి అభివృద్ధిని- పర్యావరణాన్ని సమతులనం చేసి ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన సమయంలో వేగాన్ని, శక్తిని పెంచే ఎఐ మన చేతికి వచ్చింది. ప్రకృతి విసిరే అస్తిత్వ సవాళ్లను అర్థం చేసుకోవడానికి, ప్రతిస్పందించడానికి పూర్తి విచక్షణ జ్ఞానంలేని యంత్రాలకు మనం నిర్ణయాలు అప్పగిస్తున్నాము దీని వల్ల సహజ వనరులను పూర్తిగా కొల్లగొట్టే అవకాశం వుంది.

ఉదాహరణకి బై డెన్ ప్రభుత్వం ఒక వంక దీని గురించి ప్రజాభిప్రాయం సేకరిస్తామని చెబుతూనే మరోవంక, పర్యావరణ సమీక్షలలో జాప్యాన్ని తగ్గించడానికి, ఇంధన ప్రాజెక్టులను అనుమతించడానికి ‘ఆన్‌లైన్, డిజిటల్ టెక్నాలజీలు’ (అంటే ఎఐ) వాడవచ్చని బిల్లు చేసింది. ఒక వంక ఎఐ మీద అనేక అనుమానాలు, భయాలు వ్యక్తం చేస్తూనే మిలిటరితో సహా అన్ని చోట్లా దాని వినియోగం పెంచుతున్నారు. మెషీన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు ఎలిజెర్ యుడ్కో విస్కి, కృత్రిమ మేధ ఒక సూపర్- ఇంటెలిజెంట్ గ్రహాంతర వాసి వంటిది; చాలా ప్రమాదకరమైనది మొత్తం మానవాళిని తుడిచిపెట్టి వేస్తుంది అంటారు. ఈ అభివృద్ధిని వెంటనే ఆపి వేయండి. అత్యవసర అంతర్జాతీయ ఒప్పందం ద్వారా అన్ని పరిశోధనలు, మోహరింపులను నిలిపివేయండి అంటారు.

మే 30న, గూగుల్ డీప్ మైండ్‌కు చెందిన ఒక బృందం, (దాని సిఇఒ, శామ్ ఆల్టా మూన్తో సహా), ఈ సాంకేతికత ఏదో ఒక రోజు ‘మానవాళి అస్తిత్వానికే ముప్పును కలిగిస్తుంది’ అని హెచ్చరించారు.మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బిల్ గేట్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -వ్యాపార, టెక్ ప్రపంచానికి విఘాతం కలిగిస్తుంది. ఎఐ వల్ల సెర్చ్ సైట్‌లకు (గూగుల్) అమెజాన్‌కు వెళ్లవలసిన అవసరం వుండదు. కనుక అవి పతనమవుతాయి అన్న భయం. డేనియల్ ష్మాచ్టె న్బెర్గర్ కృత్రిమ మేధస్సును వివేకంతో నింపడం ఒక్కటే పరిష్కారం అని అభిప్రాయపడతారు. ఇలా పెట్టుబడిదారీ ప్రపంచం కృత్రిమ మేధ గురించి గగ్గోలు పడుతుంటే, భయాందోళనలు వ్యక్తం చేస్తుంటే; సోషలిస్టు చైనా సంయమనంతో వ్యవహరిస్తున్నది. దానికున్న ధన, ఋణ అంశాలను పరిగణిస్తున్నది. కృత్రిమ మేధ అనేది ‘పాజిటివ్ ఎనర్జీ యాక్సిలరేటర్’ అది క్రమంగా అభివృద్ధిని నడిపించే ప్రధాన శక్తిగా మారుతుంది’ అని చైనా ఇంటర్నెట్ కంపెనీలు, మీడియా ఏజెన్సీలు, మేధావులు కొత్త టెక్నాలజీ గొప్ప అవకాశాన్ని తెచ్చిందని ఆహ్వానిస్తున్నారు.

అదే సమయంలో తలెత్తే భారీ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని జాగ్రత్తలు చెబుతున్నారు. కృత్రిమ మేధో ఆధారిత ఆన్‌లైన్ కంటెంట్ ఉత్పత్తిలోకి చొచ్చుకుపోతున్నందున అవకాశాలు, సవాళ్లు రెండూ కలిసి వుంటాయని వారు అంటున్నారు. ఎఐని సవ్యమైన ధోరణితో అనువర్తింప చేయాలని, పరిశ్రమ ఆపరేటర్లు కచ్చితమైన స్వీయ క్రమశిక్షణను కలిగి వుండాలని వారు సూచిస్తున్నారు. సవాళ్ల కంటే అవకాశం గొప్పదని, నిరంతర సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించుకుని సమాజాన్ని సుసంపన్నం చేయడానికి సానుకూలత ఉందని చైనా భావిస్తున్నది. ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లను సురక్షితంగా, ప్రయోజనకరంగా మార్చే ‘పాజిటివ్ ఎనర్జీ యాక్సిలరేటర్’గా ఎఐని బైదు వైస్ ప్రెసిడెంట్ వాంగ్యింగ్ అభివర్ణించారు. ప్లాట్ ఫాం పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి కంటెంట్ ప్రొడ్యూసర్లు ఎలా టిట్రిక్స్ ప్రయత్నించినప్పటికీ ఎఐ- చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను సమర్థవంతంగా గుర్తించి ఫిల్టర్ చేయగలదని ఆయన భావిస్తారు.

సాంకేతిక అభివృద్ధిని అంగీకరిస్తూనే, భద్రతను కాపాడుకుం టూ, ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనేది సమాజంలోని అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న ప్రశ్న. విభిన్న డిమాండ్లను తీర్చడానికి, మరింత ఖచ్చితమైన, ప్రభావవంతమైన కంటెంట్ తో మరింత వ్యక్తిగతీకరించిన ఎఐ అల్గోరిథం అభివృద్ధి కావాలి. సైబర్ స్పేస్ స్పష్టమైన భద్రతను నిర్వహించడానికి చట్ట విరుద్ధమైన, అవాంఛనీయ సమాచారాన్ని గుర్తించడానికి సామర్థ్యాన్ని స్థాపించడం, మెరుగుపరచడం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా చాట్ జిపిటి ఉన్మాదం మధ్య చైనా సైబర్ స్పేస్ అథారిటీ ఏప్రిల్‌లో వేగంగా స్పందించి కృత్రిమ మేధ కోసం కంటెంట్‌ను నియంత్రించే ముసాయిదాను విడుదల చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృజనాత్మక అనువర్తనానికి స్పష్టమైన మద్దతును ప్రకటించింది. న్యాయమైన పోటీని, ఆరోగ్యకరమైన సమాచారాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చింది.సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సిఎసి) ముసాయిదా నిబంధనలలో సర్వీస్ డెవలపర్ సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని, తప్పుడు సమాచారాన్ని సృష్టించకూడదని పేర్కొంది.

ఇంటెలిజెంట్ అల్గారిథమ్ టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించేలా చూడటం ఒక సవాలు. అలాగని సాంకేతిక పురోగతిని అడ్డుకోవటం, దాన్ని ఆపివేయాలనడం అవివేకం అని చైనా భావిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఎలా అభివృద్ధి చెందినా, దాని అంతిమ లక్ష్యం మానవులకు సేవ చేయడమే. మానవ కేంద్రకంగా పనిచేయకపోతే, అసలు ఉద్దేశం నుండి వైదొలగి పక్కదారి పడుతుంది అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఫెలో షెను హువావే అన్నారు. మన భవిష్యత్తుకు ముప్పుగా పరిణమించే సంక్షోభాలకు సాంకేతిక మానవుల మైన మనమే కారణం. యంత్రాలు ఆ ముప్పును బాగా వేగవంతం చేయగలవు, కానీ అవి బహుశా దానిని పెద్దగా తగ్గించలేవు. సంక్షోభాలను నివారించటం మన ఇష్టంపై ఆధారపడి వుంది. మన యంత్రాలు కృత్రిమ కార్యనిర్వాహక మేధస్సును అభివృద్ధి చేసే దాని కంటే వేగంగా సమిష్టి జ్ఞానాన్ని మనం అలవరచుకోవాలి.

(ప్రధాన ఆధార వ్యాసాలు: 1. రిచర్డ్ హెయిన బర్గ్: Artificial intelligence and the fate of the world అన్న 14/06/2023 వ్యాసం Common dreams.org 2. AI a ‘positive energy acce lerator’ for content spreading, but challenges remain- లియుకైయు. గ్లోబల్ టైమ్స్‌లో ఏప్రిల్ 21, 2023 వ్యాసం 3. Artificial Intelligence Special Exhibition Zone of 5th CIIE వంటి అనేక ఇతర ఇంటర్నెట్ వ్యాసాల నుండి గ్రహించిన సమాచారం)

డా. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News