Monday, January 20, 2025

కృత్రిమ మేధతో జగడాలు తీర్చలేరు: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పుడంతా తానే అయ్యి విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) కోర్టు వ్యవహారాల్లో పనిచేయదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమం కృత్రిమమే అది ఒరిజినల్ కాలేదని రూలింగ్ వెలువరించారు. నిజానికి కృత్రిమ మేధ మానవ ప్రకృతి సిద్ధ తెలివితేటలకు కానీ కోర్టు వ్యవహారాల మధ్యవర్తిత్వ ప్రక్రియలో కానీ ప్రత్యామ్నాయం కాలేదని న్యాయస్థానం తెలిపింది. వ్యాజ్యాల పరిష్కారానికి మధ్యవర్తుల ప్రమేయం ఉంటుంది. అయితే కృత్రిమ మేధ మానవ మస్తిష్యానికి ప్రత్యామ్నాయం కావడం కుదరదని తెలిపారు. ఎఐ సంబంధిత ప్రక్రియ ఛాట్‌జిపిటిని మధ్యవర్తిత్వ ప్రక్రియకు వాడుకోవచ్చుననే వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. వాస్తవిక లేదా న్యాయచట్టపరమైన విషయాలకు దీనిని వాడుకుంటే అది అనర్థాలకు దారితీస్తుందని న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ తెలిపారు. ఇప్పటికీ ఏ మేరకు ఎఐ ఉత్పాదక సమాచారం విశ్వసనీయం అనేది తేలని విషయంగా ఉంది.

పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి వ్యవస్థను కీలకమైన తీర్పులకు వాడుకోవడం అనుచితం అవుతుందని న్యాయమూర్తి తెలిపారు. లగ్జరీ బ్రాండ్ క్రిస్టియన్ లౌబైటిన్ దాఖలు చేసిన ఓ కేసు విచారణ దశలో ఎఐ అంశం ప్రస్తావనకు వచ్చింది. తమ ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘిస్తూ భాగస్వామ్య సంస్థ ఒకటి పాదరక్షల ఉత్పత్తి, విక్రయాలకు దిగడాన్ని సవాలు చేస్తూ ఈ ప్రఖ్యాత కంపెనీ కోర్టును ఆశ్రయించింది. తమ రెడ్ సోల్ షూస్ విశిష్టమైనవి, ఇవే ఒరిజినల్ అనే విషయాన్ని కృత్రిమ మేధో ప్రక్రియ అయిన ఛాట్‌జిపిటి కూడా నిర్థారించిందని ఈ సంస్థ న్యాయవాది సంబంధిత రికార్డులను కోర్టుకు అందించింది. అయితే న్యాయస్థానానికి ఏ విషయంపై అయినా నిజనిర్థారణకు వాస్తవికత ప్రాతిపదిక అవుతుంది. అంతేకానీ కృత్రిమ ప్రక్రియ కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇతర విషయాలను , కంపెనీ రికార్డును దృష్టిలో పెట్టుకుని సదరు కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా పార్టనర్ కంపెనీ వ్యవహరించిందని నిర్థారించి, ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడరాదని పేర్కొంటూ ఇప్పటివరకూ జరిగిన దానికి రూ 25 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News