గత ఏడాది జులై 16న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధా విజ్ఞానం) ప్రశంసా దినోత్సవం సందర్భంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ భారతదేశం ప్రపంచ కృత్రిమ మేధ విజ్ఞాన పవర్ హౌస్‌గా స్థాయిని పెంచుకుంటోందని వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న గొప్పలకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దేశంలోని పాఠశాలల వాస్తవ పరిస్థితుల వివరాలను వెల్లడించే ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యుడిఐఎస్‌ఇ) డేటా ప్రకారం అటువంటి ఆశయాలు నెరవేరడం చాలా బలహీనంగా ఉంటోందని తెలుస్తోంది. దేశంలోని మొత్తం పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యాలు కేవలం 57.2%, అలాగే ఇంటర్నెట్ సౌకర్యం 53.9% మాత్రమే అందుబాటులో ఉంటోందని వెల్లడైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు కంప్యూటర్‌లో లేదా ఇంటర్నెట్ ప్రక్రియలను అందిపుచ్చుకునే పూర్తి సామర్ధాన్ని ఇంకా పొందలేకపోతుండటం మన దేశం ఎంత వెనుకబడి ఉందో ఆందోళన కలిగిస్తోంది. విద్యాబోధనలో డిజిటల్ పరిజ్ఞానం ప్రభుత్వ పాఠశాలల్లో 44%, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 70%, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 71% విద్యార్థులకు లోపిస్తోందని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా రాష్ట్రాల వారీగా ఈ ఆధునిక విద్యాబోధన సౌకర్యాల కల్పనలో తేడా బహిర్గతమవుతోంది. బీహార్‌లో 11%, బెంగాల్‌లో 18%, ఉత్తరప్రదేశ్‌లో 21% వరకు కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ధనిక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సౌకర్యాల కల్పనలో తేడాలు ఉంటున్నాయి. కర్ణాటకలో 33 శాతం వరకు ఈ సౌకర్యాలు ఉండగా, కేరళలో 99 శాతం వరకు ఉన్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే ఒక ప్రభుత్వం తరువాత వచ్చిన మరో ప్రభుత్వం పాఠశాలలో కంప్యూటర్ అనుసంధాన సౌకర్యాలను మరింత విస్తరింపచేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చదువుల పునాదుల్లోనే విద్యార్ధులకు ఆధునిక విద్యాబోధన సౌకర్యాలను దూరం చేస్తే వారి వ్యక్తిగత, వృత్తిపరమైన ఉజ్వల భవిష్యత్తును చిదిమివేసినట్టు అవుతుంది. అంతేకాదు ఇతర మార్గాల ద్వారా కూడా డిజిటల్ నిరక్షరాస్యత ప్రభావం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందన్న హెచ్చరికలు వస్తున్నాయి. మిశ్రమ డిజిటల్ స్వీకరణ సూచిక ప్రకారం అమెరికా వంటి దేశాల కన్నా భారత దేశంలో ప్రజలు, వ్యాపార సంస్థలు డిజిటల్ వినియోగంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని తెలుస్తోంది. దేశంలో గ్రామీణ యువతలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న దాదాపు 50% మంది పాస్‌వర్డ్‌ను మార్చగలగడం, ప్రొఫైల్‌ను బ్లాక్ చేయడం వంటి కనీస రక్షణ చర్యలను చేయలేకపోతున్నారని స్పష్టమవుతోంది. ఈ రోజు డిజిటల్ స్కూలింగ్ లోటు రేపటికి విద్యార్థులకు ఏ విధమైన అభివృద్ధికి దారి తీస్తుందన్నది ప్రశ్న. ప్రపంచంలోనే ఐదో భారీ ఆర్థిక స్థాయికి ఎదుగుతున్న భారత్‌లో అన్ని పాఠశాలలకు కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు సమకూరితేనే భావిభారత పౌరుల భవిష్యత్ ప్రగతి పథంలో ముందుకెళ్తుంది. ఈ మేరకు ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం అత్యంత ముఖ్యం కూడా. కృత్రిమ మేధ, రోబోటిక్స్, బిగ్‌డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర అత్యంత ఆధునిక ప్రక్రియల విస్తరణతో అనేక రంగాల్లో వినూత్న మార్పులు సంతరించుకుంటున్నాయి. వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా విరివిగా లభిస్తున్నాయి. ఇటువంటి ప్రక్రియల్లో యువతకు నైపుణ్యం అందించడంలో మన చదువులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో పరిశీలిస్తే అగమ్యగోచరమే. ఈ కారణాల వల్ల గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్ (జిటిసిఐ)లో 134 దేశాల జాబితాలో మన దేశం 103వ స్థానంలో ఉంది. బ్రిక్స్ సభ్య దేశాలైన చైనా 40వ ర్యాంకు, రష్యా 52, దక్షిణాఫ్రికా 68, బ్రెజిల్ 69 స్థానాల్లో ఉన్నాయి. వీటితో పోలిస్తే మన దేశం ఎంతో వెనుకబడే ఉందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిన్‌లాండ్ దేశాల్లో 90 శాతానికి మించి విద్యార్థులు విద్యాభ్యాసం కోసం డిజిటల్ సాధనాలను వినియోగిస్తున్నారు. పోర్చుగల్ ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితమే పాఠశాల తరగతి గదుల్లో కంప్యూటర్, ఇంటరాక్టివ్ బోర్డులను ఏర్పాటు చేసింది. అమెరికా పాఠశాలల్లో కంప్యూటర్ కోడింగ్ ఫక్కాగా అమలవుతోంది. జర్మనీలో ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడంతో పిల్లలకు బోధన సులభతరమవుతోంది. మన దేశంలో మొత్తం 10.17 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఐదు లక్షల పాఠశాలలకు మాత్రమే కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. తొమ్మిది నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు బోధన కోసం ఆధునిక సాంకేతిక సౌకర్యాలు సమకూర్చడానికి 2019లో ఆపరేషన్ డిజిటల్ బోర్డు అనే ప్రణాళిక ప్రారంభమైనప్పటికీ, దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1.30 లక్షల స్మార్ట్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకే ఈ ప్రణాళిక పరిమితం అయింది. దీనికి తోడు విద్యారంగానికి ప్రభుత్వ కేటాయింపులు రానురాను దిగజారుతున్నాయి. గత ఆరేళ్లలో జిడిపిలో విద్యకు కేటాయింపులు కేవలం 2.7 నుంచి 2.9 శాతం మధ్యలోనే ఉండడం గమనార్హం. స్వీడన్ 6.7 శాతం నుంచి 6.9 శాతం, బ్రిటన్ 5.3 5.6 శాతం, థాయిలాండ్ 4 4.3 శాతం ఈ విధంగా ఆయా వర్ధమాన దేశాలు తమ జిడిపిలో విద్యకు కేటాయింపులను 5 నుంచి 7 శాతం వరకు పెంచుతుంటే మన దేశం మాత్రం కేవలం కంటితుడుపుగా నిధులను కేటాయిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన చదువులు ఉండాలంటే జిడిపిలో 6 శాతానికి మించి నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
‘ఈ’ తరంలోనూ ఇవా మన చదువులు?
- Advertisement -
- Advertisement -
- Advertisement -