ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ)లో వస్తున్న మార్పులు రానురాను అద్భుతాలను సృష్టిస్తున్నాయి. రాబోయే కొన్నేళ్లలో మన భవిష్యత్తును ఎఐ సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే చాట్‌జిపిటి, జెమిని, కోపైలట్ లాంటివి ఎఐలో దూసుకుపోతుండగా వీటిలో అగ్రగామిగా ఉన్న చాట్‌జిపిటిని మించిన చైనా డీప్‌సీక్ ఎఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే చాట్‌జిపిటిని మొబైల్ వినియోగదారులంతా విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇమెయిల్ రాయాలన్నా, ఏదైనా సలహా కావాలన్నా, ఏదైనా అనువాదం కావాలన్నా, కొత్త భాష నేర్చుకోవాలన్నా చాట్‌జిపిటి మనకు సహాయం చేస్తోంది. సంక్లిష్టమైన అంశాలను సులభంగా వివరిస్తోంది. పెద్దపెద్ద సమస్యలను పరిష్కరించగలుగుతోంది.
చాట్‌జిపిటిని మించినది మరొకటి లేదని నిన్నటివరకు అందరం అనుకునేవాళ్లం కానీ డీప్‌సీక్ వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. చాట్‌జిపిటి ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్‌సీక్‌ను చూసి నోరెళ్లబెడుతోంది. చాట్‌జిపిటిని మించి డీప్‌సీక్‌లో ఉన్న ప్రత్యేకతలేంటి? అని పరిశీలిస్తే అతితక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన మోడళ్లను ఇది అభివృద్ధి చేసింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటి కంటే డీప్‌సీక్ కొన్ని వందల రెట్లు అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది.
అందుకే డీప్‌సీక్ ధాటికి అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. మనం ఇచ్చిన ప్రాంప్ట్కి సమాధానం ఇచ్చే ముందు రీజనింగ్ కూడా ఇస్తుండటం డీప్‌సీక్ ప్రత్యేకత. చాట్‌జిపిటి సహా మిగిలిన సంస్థ లేవీ ఈ పని చేయలేకపోతున్నాయి. అంతేకాదు చాట్‌జిపిటి లాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు ఓపెన్ ఎఐ లాంటి సంస్థలు కొన్ని మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. కానీ డీప్‌సీక్‌ను కేవలం 5.6 మిలియన్ డాలర్ల ఖర్చుతోనే రూపొందించడం విశేషం. పైగా డేటా విషయంలో కానీ, టెక్నాలజీలో కానీ, స్టోరేజి విషయంలో కానీ మిగిలిన వాటికంటే డీప్‌సీక్ చాలా ముందుంది. అందుకే లక్షలాది మంది డీప్‌సీక్‌ని డౌన్లోడ్ చేయడం ప్రారంభించడంతో సర్వర్ తట్టుకోలేక క్రాష్ అయింది.
ఆ వెంటనే (జనవరి 28న)డీప్‌సీక్ ఎ1అసిస్ట్పై సైబర్ దాడి జరగడం గమనార్హం. అమెరికన్ టెక్ కంపెనీలకు డీప్‌సీక్ గట్టి షాక్ ఇవ్వడంతో రెండు రోజుల క్రితం నాస్టాక్ షేర్లు 3%, ఎన్విడియా సంస్థ షేర్లు 17% నష్టపోయాయి. ఒక్క ట్రేడింగ్ సెషన్ లోనే 600 మిలియన్ డాలర్లు ఎన్విడియా నష్టపోయింది. ఎన్వీడియా స్టాక్ ధర ఇంట్రాడేలో 18% మేర క్షీణించి కనిష్ఠంగా 116.70 డాలర్లకు దిగజారింది. అమెరికాకు చెందిన అతిపెద్ద చిప్ తయారీదారు ఎన్వీడియా గత ఏడాది ఒక్క రోజులోనే భారీగా లాభపడి వాల్‌స్ట్రీట్‌లో కొత్త చరిత్రను సృష్టించింది. అలాంటి సంస్థ ఇప్పుడు డీప్‌సీక్ షాక్‌కు ఒక్క రోజులోనే భారీ పతనాన్ని ఎదుర్కొని మరోసారి చరిత్రలోకి ఎక్కడం గమనార్హం. మరి డీప్‌సీక్‌లో లోపాలు లేవా అని సందేహాలు కలగవచ్చు. డీప్‌సీక్‌కు కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. చైనా సంస్థ కావడమే డీప్‌సీక్‌కు పెద్ద మైనస్ పాయింటు.
భద్రత విషయంలో ఈ సంస్థను పూర్తిగా నమ్మలేకపోతున్నారు. మన డేటాను దుర్వినియోగం చేసే అవకాశాలుంటాయని అనుమానిస్తున్నారు. డీప్‌సీక్‌ను డౌన్లోడ్ చేసుకునే వాళ్లు తమ డేటా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చైనా సంస్థ కాబట్టి ఆ దేశ భద్రతాపరమైన అంశాలను సెన్సార్ చేస్తోంది. చాట్‌జిపిటి సహా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు తమ సర్వీసులను వాడుకునేందుకు ఎంతో కొంత ఛార్జీ వసూలు చేస్తున్నాయి. కానీ డీప్‌సీక్ మాత్రం పూర్తిగా ఉచితం. దీనికి తోడు మిగిలిన వాటి కంటే వేగంగా, సమర్ధంగా పనిచేస్తోంది. ఇంతకీ సంచలనం కలిగిస్తున్న ఈ డీప్‌సీక్ ఎ1 స్టార్టప్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ 1985లో చైనాలో గ్వాంగ్డాంగ్లోని ఝాన్జియాంగ్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.
లియాంగ్ చదువులో చాలా తెలివైనవాడు. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. చైనాలోని జెజియాంగ్ విశ్వవిద్యాలయం నుండి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. మెషిన్ లెర్నింగ్ ఫైనాన్షియల్ విశ్లేషణపై విస్తృతమైన పరిశోధనలు చేశాడు. క్వాంటిటేటివ్ ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ చేసిన తరువాత 2023లో డీప్‌సీక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. ఫైనాన్షియల్ డేటాను విశ్లేషించేందుకు ఎఐని వినియోగించే హెడ్ఫండ్కు గతంలో నేతృత్వం వహించాడు. ఈయన టీం ఓపెన్‌సోర్స్ ఎఐ మోడల్‌ను డెవలప్‌చేసింది. దీన్ని డీప్‌సీక్ ఆర్1గా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్‌కు దీన్ని ఉచితంగా అందించారు. వాళ్లు తమ టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు డీప్‌సీక్ ఆర్ 1ను వినియోగించుకోవడం పరిపాటి అయింది.
సాంకేతిక ఆధిపత్య రేసులో చైనా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, జిపియు, సెమీకండక్టర్ల వంటి అత్యంత ఆధునిక టెక్నాలజీలను చైనాకు ఎగుమతి చేయడాన్ని అమెరికా నిషేధించింది. కానీ ఇవేవీ చైనాపై ఎలాంటి ప్రభావం చూపలేదని డీప్‌సీక్ అద్భుత విజయంతో స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలో అమెరికా టెక్ కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేశారు. ఇదో మేలుకొలుపుగా గుర్తించాలని అప్రమత్తం చేశారు. అతితక్కువ ఖర్చుతో డీప్‌సీక్ అందుబాటులోకి రావడం సానుకూల అభివృద్ధిగా అభివర్ణించారు. బిలియన్ల కొద్దీ ఖర్చు చేసే బదులు తక్కువ ఖర్చుతోనే ఇలాంటివి చేయాలని, అలాంటి పరిష్కారంతోనే ముందుకు రావాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ట్రంప్ ఈ విధంగా స్పందించారంటే డీప్‌సీక్ ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది.