Monday, April 21, 2025

కృత్రిమ మేధ అద్భుతమా, అనర్థమా?

- Advertisement -
- Advertisement -

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎఐ) అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చింపబడుతూ విశ్వవ్యాప్త అంశంగా మారింది. ఫోన్‌ని ముఖగుర్తింపుతో అన్‌లాక్ చేసిన క్షణం నుండి ఇష్టమైన వివిధ రకాల స్ట్రీమింగ్ సర్వీసెస్‌పై వ్యక్తిగతమైన సిఫార్సులను చేసే వరకు కృత్రిమ మేధస్సు నిశ్శబ్దంగా తెరవెనుక పనిచేస్తుంది. ఇది మానవ మేధస్సును అనుకరించే, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగిన సాంకేతిక వ్యవస్థ. కృత్రిమ మేధస్సు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ప్రాక్టికల్ ఆటోమేషన్ వంటి వివిధ సాంకేతిక విభాగాలను కలిగి ఉంటుంది. కృత్రిమ మేధస్సు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. అయితే, మానవ ప్రగతికి దీని ప్రయోజనాలు చాలానే ఉన్నప్పటికీ, దీనిని దుర్వినియోగపరచడం వల్ల మానవ మనుగడకి చాలా అనర్ధాలే ఉన్నాయనేది చాలామంది విశ్లేషకుల వాదన.

అందుకే, కృత్రిమ మేధస్సు అద్భుతమా లేదా అనర్ధమా అనే ప్రశ్నపై సమగ్రంగా చర్చించుకోవడం అవసరం. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ మానవ సమాజాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు వివిధ రంగాలలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చి అనేక ప్రయోజనాలను సమాజానికి చేకూరుస్తుంది. ఎఐ ద్వారా పరిశ్రమల్లో మానవీయ జోక్యం లేకుండానే పనులు జరిగిపోతున్నాయి.తయారీ, లాజిస్టిక్స్, డేటా ఎనలిసిస్ వంటి రంగాల్లో ఆటోమేషన్ వేగాన్ని పెంచుతోంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో చిప్ డిజైన్, ప్రోగ్రామింగ్ సిస్టమ్స్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఎఐ ఆధారిత రోగ నిర్ధారణ వ్యవస్థలు (ఎఐ డయాగ్నోస్టిక్స్) అధిక నాణ్యతతో, తక్కువ సమయంలో వ్యాధులను గుర్తిస్తున్నాయి. కృత్రిమ అవయవాలు (ఆర్టిఫీషియల్ ఆర్గాన్స్) అభివృద్ధి అవుతున్నాయి. స్మార్ట్ వైద్యసహాయ సిస్టమ్స్, రోబోటిక్ సర్జరీలు, ఎఐ -ఆధారిత డ్రగ్ డిస్కవరీ వల్ల చికిత్స మరింత ప్రభావవంతంగా మారింది. ఎఐ ఆధారిత వ్యక్తిగతీకరించిన విద్యా విధానాలు (పెర్సనలైజ్డ్ లెర్నింగ్) విద్యార్థుల విద్యను మెరుగుపరుస్తున్నాయి. బహుభాషా అనువాద సాధనాలు (లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టూల్స్) విద్యను అందరికీ సులభతరం చేస్తున్నాయి.

వర్చువల్ టీచర్లు, చాట్‌బాట్ లెర్నింగ్ అసిస్టెంట్లు విద్యార్థులకు సహాయంగా ఉంటున్నాయి. ఎఐ ఆధారిత మార్కెట్ విశ్లేషణలు వ్యాపార నిర్ణయాలను మెరుగుపరుస్తున్నాయి. ఫ్రాడ్ డిటెక్షన్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో మోసాలను తగ్గిస్తోంది. కస్టమర్ సపోర్ట్‌లో చాట్‌బాట్లు, వాయిస్ అసిస్టెంట్లు మెరుగైన సేవలను అందిస్తున్నాయి. ఎఐ ఆధారిత స్వయంచాలక వాహనాలు (అటానమస్ వెహికల్స్) రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాయి. డెలివరీ డ్రోన్లు, ఆటోమేటెడ్ లాజిస్టిక్స్ ద్వారా సరుకు రవాణా వేగవంతంగా మారింది. స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గుతున్నాయి. రహదారి భద్రత పెంపు తదితర రంగాల్లో ఎఐ సహకరిస్తోంది. గేమింగ్, కంటెంట్ సజెస్టషన్ సిస్టమ్స్ వంటి వేదికల్లో ఎఐ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రస్తుత సమయంలో అత్యంత ఆధునిక సాంకేతిక విలువలతో, వ్యయంతో నిర్మిస్తున్న భారీ సినిమాలలో కృత్రిమ మేధస్సును విరివిగా వాడుతున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు అనేది ఒక కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంగా మారింది.

ఇది మన దైనందిన జీవితాన్ని సులభతరం చేయడంలో, పరిశ్రమల వృద్ధిలో, ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా మొదలైన అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అయితే, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతను దుర్వినియోగం చేయడం వలన కొన్ని అనర్ధాలను కూడా మానవ సమాజం ఎదుర్కొనవలసి వస్తుంది. ఎఐ వల్ల మానవులకు పని అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆటోమేషన్ వల్ల అనేక ఉద్యోగాలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్, డ్రైవింగ్ రంగాల్లో పని చేస్తున్నవారికి ఇది ముప్పుగా మారింది. ఎఐ ఆధారిత సర్వైలెన్స్ సిస్టమ్స్ వ్యక్తిగత గోప్యతను ప్రమాదంలో పడేస్తున్నాయి. డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా తప్పుడు వీడియోలు, ఫేక్ న్యూస్ సృష్టించడం సాధ్యమవుతోంది. హ్యాకింగ్, సైబర్ మోసాలకు ఎఐ వాడబడే అవకాశముంది. ఎఐ అనేక రంగాల్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తే, మానవ నియంత్రణ తగ్గిపోతుంది.

ఎఐ ఆధారిత ఆయుధ వ్యవస్థలు (అటానమస్ వెపన్స్) భవిష్యత్తులో మానవాళికి ముప్పుగా మారవచ్చు. ఎఐ తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ నైతికంగా సరైనవిగా ఉండవు. ఎఐ డేటాను తప్పుగా ఉపయోగించుకుంటే, అన్యాయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎఐ ఆధారిత నియామక ప్రక్రియల్లో (హై రింగ్ సిస్టమ్స్) వివక్షత కనిపించవచ్చు. మనుషులు ప్రతి చిన్న విషయానికి కృత్రిమ మేధస్సుపై ఆధారపడుతూ ఉంటే తమ ఆలోచన శక్తిని క్రమక్రమంగా కోల్పోతారు. తద్వారా మనుషుల్లోని అద్భుతమైన సృజనాత్మక శక్తి క్రమక్రమంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఎఐ ఆధారిత రోబోట్లు, వర్చువల్ అసిస్టెంట్స్ వల్ల మానవ సంబంధాలు దెబ్బతిని మనిషి ఒంటరిగా మిగిలిపోయి తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఏఐ ఆధారిత ఆయుధ వ్యవస్థలు, మోసపూరిత టెక్నాలజీ మానవ సమాజానికి ముప్పుగా మారవచ్చు. కృత్రిమ మేధస్సు అనేది మనిషి సృజించిన ఒక గొప్ప సాంకేతిక అద్భుతం.

కృత్రిమ మేధస్సు అద్భుతమా లేదా అనర్ధమా అనేది దాని ఉపయోగం, ప్రయోజనాలు, పరిమితులను మనం ఎలా నిర్వహిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనిని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే, మానవుని జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అద్భుత సాధనంగా మారుతుంది. కానీ, ఈ ఎఐను ఉపయోగించడంలో నిర్దిష్టమైన నియంత్రణ లేకపోయినా, నైతిక మార్గదర్శక సూత్రాలను పాటించకపోయినా, చట్టపరమైన వ్యవస్థల ఆధీనంలో లేకపోయినా, సాంకేతిక అద్భుతంగా కొనియాడబడుతున్న ఈ కృత్రిమ మేధస్సు మానవ సమాజానికి ప్రమాదకరమైన అనర్ధంగా మారే అవకాశం పుష్కలంగా ఉంది. అందువల్ల, ఈ సాంకేతిక అద్భుతాన్ని అభివృద్ధి పరిచే దశలోనే సరైన నైతిక మార్గదర్శకాలను అనుసరించేలా, మానవ నియంత్రణ విధానాలను పాటించేలా, చట్టాల పరిమితులకు లోబడి పని చేసేలా దాని సాంకేతిక వ్యవస్థను సృజించాలి. సరైన నిబంధనలను, నైతిక మార్గదర్శక సూత్రాలను, మానవత్వ విలువలను, చట్టపరమైన పరిమితులను పాటిస్తే కృత్రిమ మేధస్సు నిజంగా ఓ అద్భుతమే. పాటించకపోతే సమాజానికి ఓ అనర్ధమే.

చెన్నుపాటి రామారావు
99590 21483

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News