Tuesday, April 22, 2025

కృత్రిమ మేధతో కష్టకాలం!

- Advertisement -
- Advertisement -

‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్నది ఒకప్పటి పెద్దల మాట. మగవాడు ఏదో ఒక ఉద్యోగం చేయాలన్నది అప్పటి పెద్దల భావన. కాస్తో కూస్తో చదువుకొన్నవాడు ఉద్యోగం కోసం వెంపర్లాడకుండా వ్యవసాయం లేదా కుల వృత్తో చేసుకునేవాడు. అదే ఇంటర్ లేదా డిగ్రీ దాకా చదువుకొన్నవాడయితే ఏ టీచరుగానో లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో క్లర్క్ గానో లేదా కాస్త పైస్థాయి ఉద్యోగంలోనో స్థిరపడాలనుకునేవాడు. కార్యాలయాల్లో కాస్త పని ఒత్తిడి ఉన్నా నెల తిరిగే సరికి జీతం కళ్ల చూస్తామనే ధీమా ఉండేది. అలా ఏ ముఫ్పై ఏళ్లో, అంతకుపైబడి ఒకే శాఖలోనో, కార్యాలయంలోనే పని చేసి రిటైర్ అయ్యేవాళ్లు. ఇలాంటి బలమైన వేతన జీవుల వర్గం సమాజంలో ఉంటూ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ వర్గం క్రమేణా కనురుగయ్యే స్థితి వస్తోంది అని నిపుణులు అంటున్నారు. వీరి స్థానాన్ని ఆటోమేషన్, ఏఐగా పిలుచుకునే కృత్రిమ మేధస్సు ఆక్రమించనుందనేది వారి అంచనా. భారత దేశం ఈ కొత్త దశలోకి ప్రవేశించిందని వారు అభిప్రాయం. మన తల్లిదండ్రులు ఒకే సంస్థలో 30 ఏళ్లు పని చేసిన పాత విధానం అంతరించపోనుంది. భారతీయ మధ్య తరగతి నిర్మాణం, ఉద్యోగ వ్యవస్థ ఇక ఎంతో కాలం మనజాలదు’ అని ప్రముఖ మార్కెట్ నిపుణుడు, పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్ సేవల సంస్థ మార్సెలస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా అంటున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే వైట్‌కాలర్ ఉద్యోగులు చేసే పనుల్లో చాలా వరకు ఇప్పుడు కృత్రిమమేధ చేసేస్తోంది. తమ కోడింగ్‌లో మూడింట ఒక వంతు కృత్రిమ మేధ చేసేస్తోందని ఇప్పటికే గూగుల్ సంస్థ అంటోంది.

భారతీయ ఐటి, మీడియా, ఫైనాన్సింగ్ రంగాల్లోనూ ఇదే పరిస్థితి వస్తోంది. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా మధ్యస్థాయి కెరీర్ అవకాశాలు క్రమంగా కనుమరుగయ్యే సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఉదయం 10.00 గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం 5 గంటల దాకా ఫ్యాన్ కింద కూర్చొని పని చేసి ఒకటో తేదీ నాటికల్లా ఠంచనుగా జీతం తీసుకుంటూ నిశ్చింతగా జీవితం గడిపేసే వేతన జీవులు ఇకపై క్రమేణా తగ్గిపోతారన్న మాట. కంప్యూటర్లు, కృత్రిమ మేధ వారి పని చేసేస్తాయేమో! అందుకే గత కొన్నేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ఖాళీలను కూడా భర్తీ చేయడం లేదు.

ప్రభుత్వ ఉద్యోగమనేది అందని మానిపండులాగా మారడంతో నిరుద్యోగులు సైతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు ఉద్యోగాలను వెతుక్కొంటున్నారు. కాని నిరుద్యోగులు లక్షల్లో ఉండడంతో ఆ ఉద్యోగాలు కూడా కొంత మంది అదృష్టవంతులకే దక్కుతున్నాయి. మిగిలిన వారు అటు ఉద్యోగం దొరక్క, ఇటు వేరే పని చేయడం చేతకాక ‘రెంటికీ చెడ్డ రేవడి’ గా మారిపోతున్నారు. కొందరైతే నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. అయితే దీనికి ఎవరినీ నిందించాల్సిన పని లేదు. కాలం తెచ్చిన మార్పు ఇది. అందుకే ప్రభుత్వం సైతం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలను సృష్టించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారాలని విద్యావంతులైన నిరుద్యోగులకు సలహా ఇస్తోంది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటోంది. ఫలితంగా ఇప్పుడు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం చెప్పుకోదగ్గ విజయాలను కూడా సాధించింది. దీన్నే ‘జామ్ ట్రినిటీ’గా వ్యవహరిస్తున్నారు.

జన్‌ధన్, ఆధార్, మొబైల్ ఈ మూడింటి సహకారంతో కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారవుతున్నారు. స్టార్టప్‌లు అలాంటి వాటిలో ప్రధానమైనవి. అలాగే ఇంటి వద్దే కూర్చుని వేలాది రూపాయలు ఆర్జించే స్థాయికి చాలా మంది చేరుకుంటున్నారు. ఇప్పుడు తక్కువ ఆదాయ వర్గాల వారికి సైతం బ్యాంకులు, ప్రభుత్వాలు అందించే సబ్సిడీ, రుణ పథకాలకు సంబంధించిన సమాచారం సులువుగా లభించడంతో వాటి సహాయంతో స్వయంగా వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా మారుతున్నారు. ఇదే స్ఫూర్తిని కార్పొరేట్ కెరీర్‌లలోనూ కొనసాగించినట్లయితే లక్షలాది మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారవుతారని, దేశం అభివృద్ధికి మరో కొత్త చోదకశక్తిగా మారుతారని నిపుణులు అంటున్నారు.

నిలకడైన జీవితం, నెల తిరిగే సరికి జీతం అందుకునే మనస్తత్వం నుంచి భారతీయ సమాజం మారాల్సిన అవసరం ఉందని కూడా వారు సలహా ఇస్తున్నారు. మనది డబ్బుతో అన్నింటినీ అంచనా వేసే సమాజం. మీరు పొందే వేతనంతో మీ సక్సెస్‌ను అంచనా వేస్తుంటారు. ఈ మనస్తత్వం ఇకపై మారాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రతినెలా వచ్చే ఆదాయం కాకుండా సంతోషం కోసం కొత్త మార్గాలను అన్వేషించుకోవలసిన అవసరం ఉంది. మన పిల్లలను కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూసే పిల్లలుగా తయారు చేయడం ఇకపై మానుకోవడం మంచిది. ఎందుకంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగాలు అనేవి ఉండవేమోనని నిపుణుల అభిప్రాయం. మరి ఆ స్థితికి భారతీయులు మారుతారా! అలాంటి పరిస్థితి ఎన్నేళ్లలో వస్తుంది? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News