Sunday, December 22, 2024

వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం

- Advertisement -
- Advertisement -

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు. ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో రైతులు ఈ పద్ధతులకు అలవాటుపడ్డారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం రంగం నేడు పుంజుకున్నది. కానీ తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు. ఇలాంటి సమయంలో కృత్రిమ మేధ సాంకేతికతలు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) తెరపైకి వచ్చింది.

వ్యవసాయ రంగంపైనా దీని ప్రభావం నేడు చూపుతున్నది. ఇప్పటికే కొన్ని కృత్రిమ మేధ సాంకేతికత ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.వ్యవసాయ రంగానికి, రైతులకు దీని వల్ల ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయ రంగానికి అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50%పైనే ఉన్నది. కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతు పవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగమును విస్తృత పరిచి రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలని తలచి వ్యవసాయ రంగమునకు వివిధ పథకాలు ప్రవేశపెట్టి తద్వారా లాభాలు చేకూరుస్తున్నప్పటికీ వ్యవసాయం అనేది అంత లాభసాటిగా ఉండడం లేదు. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది.

అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జిపిటి’ ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రో సాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఒపెన్ ఎఐ సర్వీస్ ద్వారా చాట్ జిపిటి ఆధారంగా తయారైన ‘జుగల్ బందీ’ చాట్ బొట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుంది ఈ సాఫ్ట్ వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకో గల ఈ చాట్ బోట్ ఇంగ్లీష్‌లో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి రైతులకు అందిస్తుండడం విశేషం.చాట్ జిపిటి వంటి కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్‌లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలా మంది అనుకోవచ్చు. కానీ దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా.సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడం కోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో వుంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు.

అంచనా విశ్లేషణ (ప్రిడిక్టివ్ అనాలసిస్): వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వేసిన పంట ఎంత బాగా పండుతుంది అని కచ్చితంగా చెప్పగలదు. దీన్నే అంచనా విశ్లేషణ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి.
గరిష్ఠంగా దిగుబడులు: పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీని ద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.

ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఎఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించ గల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలాల్లో తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే అతి తక్కువ కలుపు నాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఎఐ అందివ్వగలదన్న మాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయా చిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి.
కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఎఐను ఉపయోగిస్తే అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు వెల్లడిస్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కృత్రిమ మేధ సాంకేతికతలు వేగంగా గుర్తించ గలవు.

ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఎఐ (కిసాన్ జిపిటి)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లోకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఎఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఎఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హిస్తుండగా, ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఎఐ’ ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్ బొట్ ద్వారా అందిస్తోంది. ఇప్పటికే ‘మిర్చి, పసుపు’ పరికరాలు, మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నా రు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు.

నిప్పు… విద్యుత్తు… ఎలాగైతే మానవ జాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో, అలాగే కృత్రిమమేధ కూడా అని గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ అంటారు. మనిషీ, యంత్రమూ చేయీ చేయీ కలిపి ఆడుతూ పాడుతూ పని చేసే రోజులు వచ్చే శాయి అంటారు ఆయన. కృత్రిమ మేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు. మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి. కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పైస్థాయిలో సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే, ఇక ముందు ఎఐ అన్ని రంగాల్లోనూ మనకు కుడి భుజంగా మారనుందన్న మాట! ఏది ఏమైనా కృత్రిమ మేధ సాంకేతికత పద్ధతి ద్వారా అయిన మన దేశానికి వెన్నెముక అయిన రైతన్నకు వ్యవసాయం లాభాసాటిగా వుండాలని, వ్యవసాయంలో నష్టం వచ్చిందని ఆత్మహత్యలకు పాల్పడ కూడదని, రైతు కుటుంబాలు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం.

ఎన్.సీతారామయ్య
94409 72048

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News