ప్రపంచ జనాభా రానున్న 25 సంవత్సరాల్లో 20 శాతానికి పైగా పెరగనుంది. అనగా 2050 నాటికి ప్రపంచ జనాభా సుమారుగా 9.7 బిలియన్ల వరకు పెరుగుతుందని అంచనా. జనాభాకు సరిపడా ఆహార భద్రత కల్పించడం అత్యవసరం. పెరుగుతున్న జనాభా అనేక సమస్యలకు దారి తీస్తుంది, ముఖ్యంగా పట్టణీకరణ అధికమై, సహజ వనరులు తగ్గనున్నాయి. దీనికి తోడు వాతావరణంలో మార్పులు పంటల దిగుబడులు తగ్గుదలకు కారణమవుతున్నాయి. అంతేకాకుండా, ప్రపంచంలో పట్టణీకరణ పెరిగి, పట్టణాలకు ప్రజల వలస పెరిగింది. 2007వ సంవత్సరం నుంచి ప్రజల నివాసం గ్రామాల్లో కంటే పట్టణాల్లో నివసించడం అధికమైంది.
2050 నాటికి దాదాపుగా 68 శాతం ప్రపంచ జనాభా పట్టణాల్లో నివసించబోతున్నారు. ఈ విధంగా ప్రజలు పట్టణాలకు వలస వెళ్లడం వల్ల వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొనే వారి సంఖ్య తగ్గనుంది. మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన మొదటి దశాబ్దంలో సుమారు 70 శాతం దేశ జనాభా వ్యవసాయాన్ని జీవన వృత్తిగా కొనసాగించే వారు తరువాతి దశాబ్దాల్లో వ్యసాయాన్ని వృత్తిగా ఎంచుకునే వారి సంఖ్య 2020 నాటికి 51. 8 శాతానికి తగ్గింది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం-కాలానుగుణ కార్మికశక్తి సర్వే ప్రకారం 2023- 24 సంవత్సరంలో ఈ సంఖ్య 46.1 శాతానికి చేరింది. రాబోయే దశాబ్దాల్లో పంటలు పండించే వారి సంఖ్య మరింత తగ్గనుంది. మారుతున్న సమాజానికి, పెరుగుతున్న జనాభా అవసరాలకు తగు ఆహార భద్రత కల్పించుటకు ఉన్నా వనరులను సమర్ధవంతగా వినియోగించుకొవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నూతన అడుగులు వేసి సుస్థిర వ్యవసాయం వైపు ముందుకు సాగాలి.
వ్యవసాయ రంగంలో క్లిష్టత, వైవిధ్యత పెరగడం వల్ల అనునిత్యం నవీనీకరణకు కృషి చెయ్యాలి. నిరంతరం మారుతున్న వాతావరణ మార్పులకు, మారుతున్న పురుగుల, తెగుళ్లకు, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయాన్ని నవీకరించాలి. అయితే వ్యవసాయ రంగం విశాలమైనది, దాని నవీకరించడానికి వ్యవసాయ రంగంలోని అనేక శాఖలు, విభాగాలు, పనిముట్లు, యంత్రాలు, వ్యవసాయ పద్ధతులు, సస్యరక్షణ విధానాలు, వాతావరణం, నూతన వంగడాలు లాంటి అనేక అంశాలను అనుసంధానం చెయ్యాలి. అంతేకాకుండా, మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్న ఉత్పాదకత ఆశించిన రీతిలో లభించడం లేదు. ఈ తరుణంలో, ఉత్పాదకతను పెంచాలంటే వున్న అన్ని రకాల వనరులను సమర్ధవంతగా వినియోగించుకోవాలి. అందులోను సాంకేతిక వనరులను విస్తృతస్థాయిలో ఉపయోగించుకోవాలి. వ్యవసాయరంగంలోని బహుళ అంశాలను పునర్నిర్మిచడానికి కృత్రిమ మేధస్సు చాలా విధాలుగా తోడ్పడుతుంది.
కృత్రిమ మేధస్సు మనుషుల మాదిరిగా తన తెలివితేటలను రకరకాల పనులకు వాడుకోగలదు. కృత్రిమ మేధస్సు స్వయంచాలక కార్యకలాపాలైన మాటలను గుర్తించడం, భాషను అర్ధం చేసుకోగలడం, అనువాదించడం, చిత్రాలను విశ్లేషించడం, నిర్ణయాలు తీసుకోవడం, అర్ధం చేసుకోవడం, నేర్చుకోవడం లాంటి మనిషి ఆలోచించి చేసే పనులను కృత్రిమ మేధస్సు యంత్రాల సహాయంతో ప్రదర్శించగలదు. అదే విధంగా, వ్యవసాయ రంగంలో నేలల ఆరోగ్యం, సాటిలైట్ చిత్రాలను, పంటల దిగుబడి, ఉత్పత్తి, వినియాగం, నాణ్యత పరిమాణాలు, భూముల రికార్డులు, పురుగులు తెగుళ్ల అంచనా, నిర్వహణ, మార్కెట్ వివరాలు, పంటల ధరలు, ఎగుమతి , దిగుమతులు ధరలు పురుగుల మందులు, రసాయనిక ఎరువులు వెదజల్లడానికి వీటి దుర్వినియోగాన్ని తగ్గించడానికి, సరైన రీతిలో నీటి పారుదలకు, స్వయం చాలక తెగుళ్ల నిఘా, వ్యవసాయ రంగంలోని పరిశోధన అభివృద్ధి లాంటి అనేక వ్యవసాయ సంబంధిత చారిత్రాత్మక, కాలానుగుణ సమాచారాన్ని కృత్రిమ మేధలోనే సహజ భాషా ప్రాసెసింగ్, యంత్ర అభ్యాసం, ఆర్టిఫిషల్ న్యూరల్ నెట్‌వర్క్, ఫేజ్ సిస్టం, వర్చువల్ రియాలిటీ, అగుమెంటి వేరియాలిటీ, లోతైన అభ్యాసం, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ అప్ థింకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కృత్రిమ మేధలోని సాంకేతికా విభాగాల ద్వారా సమగ్రంగా విశ్లేషించి నిర్వహించగలదు.
అగ్రిఫుడ్ రంగంలో కృత్రిమ మేధ నూతన ఆవిష్కరణల లెక్కలు చూసినట్లైతే చారిత్రాత్మకంగా అమెరికా ముందంజలో ఉండగా, గడిచిన కొద్ది కాలంలో అగ్రిఫుడ్ రంగంలో పరిశోధన, అభివృద్ధిలో అత్యధిక అగ్రిఫుడ్ పేటెంట్లు ఆసియాలోని చైనా, జపాన్, భారతదేశం ముందజలో ఉన్నాయి. గడిచిన 20 సంవత్సరాల్లో అగ్రిఫుడ్ రంగంలో సుమారుగా 3.5 మిలియన్ల పేటెంట్ కుటుంబాల నూతన ఆవిష్కరణలు ప్రచురించబడ్డాయి. అగ్రిఫుడ్ రంగంలో, పురుగులు, తెగుళ్ల నిర్వహణ శాఖలో అత్యధిక పేటెంట్లు ప్రచురించబడ్డాయి (WIPO, 2024).
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను రైతులకు చేరవేడంలో ప్రభుత్వ, ప్రైవేట్, అగ్రిస్టార్ అప్లు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్రను పోషించనున్నాయి. మన దేశంలో అగ్రిస్టార్ అప్లు అయినా ఐబినో, ఫసల్, ఇంటెల్ ల్యాబ్, క్రాపఇన్, భారత్ అగ్రి, మారుతీ డ్రోన్స్ మొదలైన స్టార్ట్ అప్లు కృత్రిమ మేధను ఉపయోగించి రైతులకు డిజిటల్ సేవలు అందిస్తున్నాయి. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన కృత్రిమ మేధ సేవలను వ్యవసాయానికి సంబంధించిన ప్రతి జాతీయ స్థాయి సంస్థలు, కేంద్రాలు అనేక అప్లికేషన్స్, పోర్టల్స్, వెబ్‌పేజెస్, డెసిజన్ సపోర్ట్ సిస్టం, ఎక్స్‌ఫర్ట్ సిస్టంలను రూపొందించి రైతులకు పంటల నిర్వహణ, నెలల ముఖచిత్రలను, పురుగులు, తెగుళ్ల నివారణ లాంటి వివిధ రకాల అంశాలపై కృత్రిమ మేధ సహాయంతో రైతులకు తోడ్పడుతున్నాయి. కానీ వాటిని రైతులకు విస్తృత స్థాయిలో అందించడంలో విఫలమైవుతున్నాయి.
అయితే పూర్తి స్థాయిలో కృత్రిమ మేధ ఫలితాలు రైతులకు చేరాలంటే ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.నాల్గవ పారిశ్రామిక విప్లవంలోని సాంకేతిక పురోగతిని వ్యవసాయ రంగానికి అనుసంధానం చెయ్యడానికా ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవసాయ రంగంలోని ఆవిష్కరణకు కృత్రిమమేధ (AI 4 AI) అనే అంకురార్పణను ప్రారంభించింది. ఇందులో భాగంగా, ప్రపంచ ఆర్థిక వేదిక, తెలంగాణ ప్రభుత్వం, బిల్- మెలిండా గట్స్, డిజిటట్ గ్రీన్లు కలిసి ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ‘సాగు -బాగు’ అనే కార్యక్రమాన్ని పైలట్ -ప్రాజెక్ట్‌గా ప్రారంభించి వ్యవసాయ రంగానికి కృత్రిమ మేధ వినియోగించి మొదటి దశలో గణనీయమైన లాభాలను ఖమ్మ జిల్లాలోని సన్నకారు రైతులకు అందించారు. సాగు-బాగు కార్యక్రమంలో నాల్గవ వ్యవసాయ సంబంధిత విషయాలైన తెలివైన పంటల ప్రణాళిక, తెలివైన వ్యవసాయం, వ్యవసాయ క్షేత్రం నుంచి భోజన పల్లెం వరకు, డాటా ఆధారిత వ్యవసాయం లాంటి అంశాలను కృత్రిమ మేధ ద్వారా సమగ్రంగా అనుసంధానం చేసి రైతులకు సుస్థిరాభివృద్ధి వైపునకు నడపడంలో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించారు.
మన దేశంలో డిజిటల్ విప్లవాన్నీ వ్యవసాయానికి జోడించడానికి కేంద్ర ప్రభుత్వ కేబినెట్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను ఆమోదించింది. డిజిటల్ అగ్రికల్చల్ మిషన్ ద్వారా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించనుంది. అందులో అగ్రిస్టాక్ ద్వారా రైతుల పట్టిక, జియో రెఫరెన్స్‌తో కూడిన గ్రామ చిత్రాన్ని, పంటల విత్తిన పట్టిక రూపొందించి ప్రతి రైతుకు ఒక గుర్తింపు కార్డును ఇవ్వబోతున్నారు. వ్యవసాయ నిర్ణయ మద్దతు వ్యవస్థ ద్వారా రిమోట్ సెన్సింగ్ సహాయంతో పంటలు, నెలలు, వాతావరణం, నీటి వనరుల సమాచారాన్ని అనుసంధానం చేసి జియోస్సెషల్ వ్యవస్థను ఏర్పరచనున్నారు. దేశ వ్యాప్తంగా నేలల ముఖ చిత్రపటాన్ని నిర్మించనున్నారు. అంతేకాకుండా డిజిటల్ సాధారణపంట అంచనా సర్వే ద్వారా దేశంలోని వ్యవసాయ ఉత్పత్తులను కచ్చితంగా అంచనా వెయ్యబోతున్నారు.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ వల్ల దేశ వ్యవసాయ రంగంలో గొప్పమార్పు రాబోతున్నది. దేశ వ్యవసాయాన్ని నాల్గవ పారిశ్రామిక విప్లవంలో భాగస్వామ్యం చేయాలంటే కృత్రిమ మేధ సమర్థవంతంగా ఉపయోగించాలి. కృత్రిమ మేధకు డేటా అనేది ఇంధనం లాంటిది. ఈ బృహత్తర డేటాను సమర్థవంతంగా నిర్వహించడం పెద్ద సమస్య. ఈ సమస్యను అధిగమించాలంటే తగు శ్రామిక శక్తిని కేటాయించి శిక్షణ ఇవ్వాలి. అంతేకాకుండా ఇంటర్‌నెట్ నిరంతరం తక్కువ ఖర్చుతో దేశంలో ప్రతి మారుమూల గ్రామానికి సేవలు చేకూర్చాలి. నూతన ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి చేరే విధంగా కృషి చేసి, రైతులకు సరైన శిక్షణ ఇవ్వాలి. జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు ముందకు వచ్చి ‘సాగుబాగు’ లాంటి అనేక కార్యక్రమాలను చేపట్టినట్లయితే రైతులకు లాభాలు చేకూర్చి వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించవచ్చు.
డా. రేపల్లె నాగన్న
79908 42149