Wednesday, January 22, 2025

అరుణ్ గోయల్ రాజీనామా వ్యవహారం

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణపై సందేహాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా వ్యవహారం…లోక్ సభ ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణపై సందేహాలకు బలం చేకూరుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వారం రోజుల్లో వస్తుందనే వార్తల నేపథ్యంలో గోయల్ అనూహ్య రాజీనామా విస్మయం కలిగించిందని ఈ మేరకు సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీనామా వెనుక కారణాలను బహిర్గతం చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.

ముగ్గురు సభ్యులు ఉండే కేంద్ర ఎన్నికల కమిషన్ లో ప్రస్తుతం రెండు ఖాళీలు ఉండడం, ఆ ఖాళీలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కనుసన్నల్లోనే జరగనుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గతంలో కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధాని ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండేవారని కానీ ఇప్పుడు కానీ నూతన చట్ట సవరణ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి బదులుగా ఒక కేంద్రమంత్రి ఉంటారని తెలిపారు. కాబట్టి ఎన్నికల కమిషనర్ ల ఎంపిక ప్రక్రియలో నిష్పాక్షికత సందేహమేనని కూనంనేని పేర్కొన్నారు. ఇప్పటికే ఎలక్ట్రోరల్ బాండ్ల వ్యవహారం అధికార పార్టీకి అనుకూలంగా ఉందనేది తేలిపోయిందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు ,సంస్థల పేర్లు బయట పెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరాకరిస్తుండడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని కూనంనేని సాంబశివరావు అన్నారు.

అలాగే ఈవిఎంల వ్యవహారంలో ఎప్పటినుండో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ, ఎలక్ట్రోరల్ బాండ్లు, ఈవీఎంల వ్యవహారం అధికారంలోని బిజెపికి అనుకూలంగా ఉన్నాయని , ఇవి ఖచ్చితంగా 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశ ప్రజాస్వామిక ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణపై ప్రభావం చూపుతుందని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అందుకే బిజెపి వచ్చే ఎన్నికల్లో 400కు పైగా స్థానాలతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోందని సందేహం వ్యక్తం చేస్తున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News