Wednesday, January 22, 2025

ఈ లోకంలో ఆ ఏకైక అదృష్టవంతుడిని నేనే: అరుణ్ యోగిరాజు

- Advertisement -
- Advertisement -

అయోధ్య : ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అన్నట్లుగా తాను చెక్కిన అయోధ్య రామాలయ బాలరాముడి సృష్టికర్త అరుణ్ యోగిరాజు ఆద్యంతం ఆనందభరితులు అయ్యారు. ఈ విగ్రహం మల్చడం తన అదృష్టం అని, ఈ భువిలో తనకంటే అదృష్టవంతుడు ఎవరూ లేరని అనుకుంటున్నానని యోగిరాజు స్పందించారు. జీవకళ ఉట్టిపడేలా, కళ్లల్లో జీవం చిరునవ్వులో నిత్యహరితం తొంగిచూసేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దిన ఘనత అరుణ్‌దే. తనకు ఈ గురుతర బాధ్యతను ఆ శ్రీరాముడే తనకు అప్పగించినట్లుగా తాను భావిస్తున్నానని ఈ మైసూరు శిల్పి తెలిపారు. దేశ విదేశాల నుంచి ఈ విగ్రహం పట్ల అంతా అత్యద్భుతం అని స్పందిస్తున్న దశలో సోమవారం విగ్రహ ప్రతిష్టాపన దశలో ఈ శిల్పి భావోద్వేగానికి గురయ్యారు. తనకు తన కుటుంబానికి ఎల్లవేళలా రామరక్షాకవచం అంటిపెట్టుకుని ఉంది. ఇది తన నమ్మిక అని, కష్టకాలంలో కూడా ఆయన తన వెంట ఉన్నారనే భావిస్తూ సాగుతూ వచ్చానని , పర్యవసానంగానే తనకు ఈ బాధ్యత అప్పగించారని అనుకుంటున్నానని తెలిపారు.

ఆయన కుటుంబంలో ఆయన ఐదోతరం శిల్పి. అయోధ్యకు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఆయన ఇక్కడికి వచ్చారు. తాను ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఈ ప్రతిష్టాపన ఘట్టాన్ని చూశానని, తన కుటుంబం మైసూరులో టీవీల్లో చూశారని వివరించారు. తన జీవితకాలంలో ఈ రాముడి విగ్రహ రూపకల్పన ఓ అగ్నిపరీక్ష అయింది. మనసు శరీరం ఆత్మ అంతా ఈ పనిపైనే కేంద్రీకృతం చేసినట్లు తెలిపారు. కొన్నిరోజుల పాటు తాను ఎవరితో మాట్లాడకుండా ఉన్నానని, చివరకు కుటుంబ సభ్యులతో గడిపినట్లు గుర్తులేదని, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయని వివరించారు. తన శిల్పకళ అంతా తన తండ్రి నేర్పిందే అని, ఇప్పుడు తన శిల్పం పట్ల ఆయన ఆనందిస్తున్నారని, తండ్రికి గర్వకారణం అయ్యానని తెలిపారు. తమది శిల్ప కుటుంబం అని చెప్పారు. తాను ఐదోతరానికి చెందిన వాడినని అన్నారు. అరుణ్‌యోగిరాజు విద్యావంతులు. ఆయన మైసూరు వర్శిటీలో ఎంబిఎ చేశారు. ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం కూడా చేశారు.

అయితే తన అంతరాత్మ మాటవిని ఉద్యోగానికి రాజీనామా చేశానని, తిరిగి వచ్చి మైసూరులో తన వంశపారంపర్య వృత్తిలో ఉన్నానని చెప్పిన యోగిరాజు గతంలో 12 అడుగుల ఎతైన ఆదిశంకరాచార్య విగ్రహం రూపొందించారు. దీనిని కేదార్‌నాధ్‌లో స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం రూపొందించగా ఇది ఇప్పుడు ఢిల్లీలోని ఇండియా గేటులో అలరారుతోంది. అంతేకాదు 21 అడుగుల భారీ హనుమాన్ విగ్రహం ఇప్పుడు మైసూరులోని చుంచనకట్టేలో అపురూపంగా వెలిసి ఉంది. అదే విధంగా బిఆర్ అంబేద్కర్, , ఆరు అడుగుల భారీ నంది విగ్రహం, పాలరాతి అమృతశిలతో రూపొందించిన స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం, ఇదే రాతితో రూపొందించిన మైసూరు రాజు జయఛామరాజేంద్ర ఉడెయార్ , ఆరు అడుగుల బనశకంరి దేవి విగ్రహం ఇవన్నీ కూడా ఆయన అపురూప కళాత్మకతకు అద్దం పడుతూ పలుచోట్ల నెలకొని ఉన్నాయి.

విగ్రహతయారీ దశలో ప్రమాదం కంటి ఆపరేషన్ . నొప్పితోనే శిల్పరచన
ఇప్పుడు అంతా తన్మయత్వంతో చూస్తూన్న బాలరాముడి విగ్రహ తయారి దశలో శిల్పి అరుణ్‌యోగిరాజుకు కంటికి గాయం అయింది. ఈ విషయాన్ని ఆయన భార్య విజేత తెలిపారు. రాతిని తొలుస్తూ ఉండగా రాతిపెలుసు వచ్చి కంటిలో దూసుకుపోయింది. ఆయన తీవ్రనొప్పిని ఎదుర్కొన్నారు. చివరికి ఆపరేషన్ చేసి రాతి ముక్కలను తొలిగించారు. ఎంతనొప్పి ఉన్నప్పటికీ ఆయన తన పనివీడలేదు అని ఆమె వివరించారు. అత్యంత కటుతరమైన రాతిని తగు విధంగా చెక్కడం అంత తేలిక కాదని , ఎక్కడా ఎటువంటి పగుళ్లు లేకుండా దీనిని ఆద్యంతం ఆయన ఎంతోమెళకువగా తీర్చిదిద్దడం జరిగిందని, ఇక పనితీరు తీర్పు ప్రజలే ఇసున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News