Saturday, November 16, 2024

మ్యాప్‌లను తిరగరాయడం చైనాకు అలవాటే: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇతర దేశాలకు చెందిన భూభాగాలను కలిపేసుకుని మ్యాప్‌లను తిరగరాయడం చైనాకు అలవాటుగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్ భారత్ భూభాగాలేనని ఖర్గే స్పష్టం చేశారు. చైనా తెరపైకి తీసుకువచ్చిన ఎలాంటి మ్యాప్‌లు దాన్ని మార్చలేవన్నారు. చైనా తన స్టాండర్డ్ మ్యాప్ 2023లో అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్‌చిన్ ప్రాంతాలను తమ భూభాగంగాపేర్కొంటూ అధికారికంగా మ్యాప్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ అక్రమంగా చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోందని, చైనా సహా పొరుగుదేశాలతో శాంతియుత సహజీవనాన్ని తాము కోరుకుంటామని ట్విట్టర్ వేదికగా ఖర్గే స్పష్టం చేశారు.

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సౌహార్ద్రాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. భారత భూభాగంలో చైనా దురాక్రమణను ప్రపంచ వేదిక ముందు చాటడానికి ఢిల్లీలో జరిగే జి20 సదస్సు సరైన వేదిక అని ఖర్గే అభిప్రాయపడ్డారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆక్రమణలో ఉన్న 2000 చదరపు కిలోమీటర్ల భూభాగానికి విముక్తి కలిగించేలా మోడీ సర్కార్ చొరవ చూపించాలని మరో ట్వీట్‌లో ఖర్గే అభిప్రాయపడ్డారు. కాగా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా చేస్తున్న వాదన అర్థం లేనిది, చరిత్ర పరంగా సరికాదని మరో కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనాకు ఎలాంటి హక్కూ లేదని ఆయన చెప్పారు. భారత్, చైనాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్య 2020నుంచి చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని ఖాళీ చేయడమేనని కూడా ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News