తెలంగాణకు రెండోస్థానం, మూడోస్థానంలో సిక్కిం, చివరి స్థానంలో నిలిచిన లక్షద్వీప్
జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ సర్వేలో వెల్లడి
హైదరాబాద్ : జాతీయ కుటుంబ ఆరోగ్యశాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో మద్యపానానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మద్యం సేవించడంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా పోటీ పడుతున్నట్టుగా ఈ అధ్యయనం తేల్చింది. ఎక్కువగా అరుణాచల్‌ప్రదేశ్‌లో మద్యం తాగే పురుషులు, స్త్రీలు ఉండడంతో ఆ రాష్ట్రానికి మొదటిస్థానం దక్కించుకోగా రెండోస్థానం తెలంగాణ దక్కించుకుంది. మూడోస్థానంలో నిలిచిన సిక్కిం రాష్ట్రానికి చెందిన 16.2శాతం మహిళలు అధికంగా మద్యం సేవిస్తున్నట్టు తేల్చింది. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆరోగ్య సర్వే-5 డేటా ను విడుదల సందర్భంగా అధికంగా మద్యం సేవించే రాష్ట్రాల జాబితాను జాతీయ కుటుంబ ఆరో గ్య శాఖ విడుదల చేసింది.
లక్షలాదిమందిపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మద్యం సేవించే పురుషుల సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని తేలింది. ఈ సర్వేలో మద్యం సేవించడంపై 19 ఏ ళ్లు పైబడిన వారి నుంచి పలు ప్రశ్నలు అడిగి వివరాలను జాతీయ ఆరోగ్య సంస్థ రాబట్టింది. ఇందు లో దేశంలో 18.8%మంది పురుషులు, 1.3% మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు స్పష్టమైంది. అత్యధిక మద్యం సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ ముందుండగా అతి తక్కువ మద్యం వినియోగించే స్థానాన్ని లక్షద్వీప్ దక్కించుకుంది.
నిషేధం ఉన్న రాష్ట్రాల్లోనూ మద్యం సేవిస్తున్న…
నిషేధం ఉన్న రాష్ట్రాల్లో కూడా మద్యాన్ని అక్కడి ప్రజలు వినియోగిస్తారు. బీహార్, గుజరాత్ రాష్ట్రా ల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నా అక్కడి ప్రజ లు మాత్రం మద్యం సేవించడం కొసమెరుపు. బీ హార్‌లో 15.5శాతం మంది పురుషులు మద్యం సే విస్తుండగా, గుజరాత్‌లో 5.8%మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. అరుణాచల్‌లో అత్యధికంగా మద్యాన్ని తాగడంలో 52.7% పురుషులు, 24.2% మహిళలు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో 43.3శాతం పురుషు లు, 6.7 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నట్టు గా ఈ అధ్యయనంలో తేలింది. ఇక మరోవైపు సి క్కిం రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 39.8 గా, స్త్రీల నిష్పత్తి వరుసగా 16.2శాతం ఉంది.
ఇక అండమాన్ నికోబార్‌లో 39.1శాతం మంది పురుషులు, 5శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. మణిపూర్‌లో 37.5శాతం మంది పురుషులు, 0.9 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్రలో మ ద్యం సేవించే పురుషులు 13.9, స్త్రీల నిష్పత్తి 0.4 శాతంగా నమోదయ్యింది. అలాగే రాజస్థాన్‌లో 11శాతం మంది పురుషులు, 0.3% మంది మహిళలు మద్యం సేవిస్తుండగా, జమ్మూ కాశ్మీర్‌లో 8.8శాతం మంది పురుషులు, 0.2%మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఈ సంఖ్య లక్షద్వీప్‌లో అత్యల్పంగా ఉంది. ఇక్కడ మద్యం సేవించే పురుషులు 0.4 శాతంగా, స్త్రీలు 0.3 శాతం ఉన్నట్లుగా జాతీయ సర్వే తేల్చింది.