Monday, December 23, 2024

పాటకు మరణం లేదు..

- Advertisement -
- Advertisement -

ఎర్ర పూల వనం లోన నగదారిలో అని ఆయన పాడుతుంటే గోదావరి లోయ పులకరిస్తుంది…జం జమ్మల మర్రి పాటెత్తుకుంటే నగ్జల్బరీ గజ్జెకట్టి ఆడుతుంది.. ‘మరణం చివరి చరణం కాదు’ అన్న అలిసెట్టి వాక్యతత్వం తనది..పాటకు పుట్టుక తప్ప మరణం లేదని, బందూకు పాటను భుజానమోస్తూతిరుగాడే గాయకుడికి మత్యుభయం ఉండబోదన్న విప్లవ నమ్మిక తనది అమరుల త్యాగాలను తలచుకుంటే ఆయన కళ్ళు కన్నీళ్ళవుతాయి. విప్లవపాదానికి పగుళ్ళు మానాలన్న స్వప్నం తనది..ఆయనపేరే అరుణోదయ నాగన్న..
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమితిలోని రాజారం నాగన్న స్వగ్రామం.. తల్లి పాటలు పాడుతుండేది, తండ్రి భాగవతం కళాకారుడు.. మద్దెల, గజ్జెలు, తాళాలు నాగన్నకు కళలతో సహవాసాన్ని కలిగించాయి..ఊరు మొదట్నుంచి చిందు భాగవతం, గంట దాసరి, యక్షగాన, పగటివేష తదితర జానపద వత్తి కళారూపాలకు నిలయం.. ఆప్రదర్శనలు తిలకించేందుకు అలవాటుపడ్ద నాగన్న క్రమంగా ఉప్పలమ్మ, ఎల్లమ్మ కథలు చెప్పే బైండ్ల కళాకారులకు వంతపాడే అభిమానిగా మారాడు.. పీర్లను నిలిపే ఆచారం ఉండటంతో తనకు పరమత అభిమానం అలవడింది.. రెడబ్ హుస్సేన్ పీరిని పీర్లపండుగ నాడు కుటుంబం నిలిపేది.. అలా సహ సంస్కతిలో మమేకమయ్యాడు.. చిన్నప్పటి నాగన్న ఎక్కడుంటాడు అంటే ఏదోఒక కళారూపం దగ్గర అన్న చిరునామా ఏర్పడింది.. సాధారణ కుటుంబంలో పుట్టాడు అమ్మ పరకాల లక్ష్మమ్మ, నాన్న పాపయ్య తోపాటు అక్క, తమ్ముడు ఉన్నారు. తనది గీతవత్తికుటుంబం.. పొలం కూలి పనులతోపాటు కొంతకాలం తాటి కల్లు గీసే వృత్తికూడా చేశాడు.. తన అసలుపేరు నాగయ్య.. పాటలు పాడటం మొదలయ్యాక జనం పాటలనాగన్న అనిపిలిచేవారు..అదే విద్యావంతులు, మేధావులు అరుణోదయ నాగన్న అనేవారు కాలక్రమాన అదే స్థిరపడింది..
ఊరి తూరుపున నరసిమ్హ పురం గుట్టనుంచి సేకరించుకునే పుట్టబలపం అతని అక్షరాలకు ఆలంబన.. అంతకుముందు ఇసుకలో తన అక్షరభ్యాసం జరిగింది. అప్పట్లో పలకలు లేవుకనుక పెద్ద చెక్కకు నల్లరంగు పులిమి దానిని పుటపుటాలమని పిలిచేవారు మొదటగా దానిపై అక్షరాన్ని పరిచయం చేసుకున్నాడు.. కుటుంబ స్థితికారణంగా తనచదువు రొండో తరగతిదాకే సాగింది..బాల్యం కూలిపనులకుమళ్ళింది.
ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్యూ విద్యార్థులు ఆరోజుల్లో గ్రామాలకు తరలండి అని ఇచ్చిన పిలుపులోభాగంగా నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు రాత్రి బడులు ఏర్పాటయ్యాయి.. స్కూల్ మానిన నాగన్నను సంఘం సభ్యులు రాత్రి బడిలో చేర్చారు..అక్కడ శ్రీపాద శ్రీహరి, రామనరసయ్య పాఠాలతోపాటు పాటల్ని బోధించేవారు..అలా సంఘం పాటతో అతనికి మరింత స్నేహమయ్యింది.. తను మొదటవిన్న పాట ‘ఓ పల్లెటూరి కూలిరైతా’. యూనివర్సిటీనుంచి వచ్చిన కామ్రేడ్ అంబిక పాడుతుంటే విన్నాడు.. కొద్ది సంవత్సరాలతరువాత శ్రీపాద శ్రీహరి వర్ధంతి సభ రాజారం ఊళ్ళో నిర్వహించిన సమయంలో నెల్లిమర్లప్రసాద్ ఒకనాటికను స్థానికులకు తర్ఫీదు ఇచ్చారు అందులో నాగన్న మల్లిగాడి పాత్ర ధరించాడు.. మేనత్త కూతురు లక్ష్మి (గౌరమ్మ) తో అప్పటికే ప్ళ్ళైన నాగన్న అప్పుడే పెళ్ళయ్యింది.. అత్తగారుపెట్టిన పెళ్ళిపంచెతో ఆ వేషం కట్టాడు.. సంఘ కార్యక్రమాల కళారూపాల్లో మరింత విస్తతంగా పాల్గొనాలనే ఉద్దేశ్యంతో టైలరింగ్ నేర్చుకుంటా అని చెప్పి ఖమ్మం చేరాడు..రిక్కాబజార్ లో సదానందం అనే దర్జీ వద్ద కుదిరాక తన పాటల ప్రస్థానం విస్తతమయ్యింది.. బుర్రకథ, కాళ్లకు గజ్జెలుకట్టి గొంగడిభుజానవేసి పాటలుపాడేవాడు..ఆ రూపంలోనే ప్రజలకు చేరువయ్యాడు.
నాగన్న పాడుతుండే ‘జయజయహే తెలంగాణ’, ‘జైబోలో తెలంగాణ’ పాటలు జనం బాగా ఇష్టపడేవారు.. జంపాల చంద్రశేఖర్, నీలం రామచంద్రయ్యల ఎన్ కౌంటర్ నేపథ్యం లో కాశీపతి రాసిన ‘ఉయ్యాలో జంపాలా ఈదోపిడి కూలదొయ్యాలా’ అనే కంటతడి ప్రజల్లో చైతన్యం రగిలించేది.. ‘విప్లవసింహం’ బుర్రకథ తోపాటు ‘అన్న అమరుడురా మన రామనరసయ్య’ అనేపాట ‘ప్రాపంచిక భౌతిక’ అనే మార్క్స్ మహనీయుని స్తుతి గీతం, ఎల్ వీ రాసిన ‘సద్దాం హుస్సేన్ పాట, యోచన రాసిన ‘కొమరం భీమూ, ‘చికాగో నగరాన ‘ అనే పాటలు తనకు ఎంతో పేరుతెచ్చాయి..
1980 మే నెలలో కార్యవర్గ సభ్యుడిగా ప్రవేశించాక ఒంగోలులో అరుణోదయ రాష్ర్ట మొదటి మహాసభ జరిగింది.. అప్పుడు ఖమ్మం జిల్లానుంచి నాగన్నను రాష్ర్ట కార్యవర్గం లోకి తీసుకున్నారు.. ఉమ్మడి రాష్ర్టంలో కడప, మెదక్ మినహా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాక అన్ని జిల్లాల్లోనూ ప్రదర్శనలిచ్చాడు.. నాగన్న కానూరికి మూడవ శిష్యుడైతే సుంకులు, రామారావు మొదటి రెండో శిష్యులు..అలా 35 ఏళ్ళకు పైగా ఆయనతో కలిసి సాగాడు..ఇల్లెందు దగ్గర ముకుందాపురం లో జరిగిన రాష్ర్టసదస్సు సందర్భంగా కానూరి తాత తో తనకు పరిచయం అయ్యింది..
నాగన్న గురించి తెలిసిన ఆయన నాగన్నను, నాగన్నభార్య లక్ష్మిని, దాసు అనే మరో కళాకారుడ్ని హన్మకొండ దగ్గర్లోని ఆయనఊరు కుమార్ పల్లి రప్పించి బుర్రకథల్లో తర్ఫీదునిచ్చారు.. పోట్ల రామనరసయ్య జీవితం పై రాసిన ‘విప్లవసింహం’ బుర్రకథ మొదటనేర్పారు.. కర్నూల్ జిల్లాలో హంద్రీనది గాలితరంగాల సమక్షంలో నీలం రామచంద్రయ్య అనే బుర్రకథ ప్రదర్శణ జరిగింది.. జంపాల ప్రసాద్ తనను మొదటిసారి తాత అనిపిలిచాడని కానూరి తన ‘కథకాని కథ’ అనే ఆత్మకథలో రాసుకున్నాడు.. యూజీ నాయకుడైన రామచంద్రయ్య.. ఒక సాంస్కృతిక దళం ఉండాలని భావించి యూనివర్సిటీ విద్యార్థి నేత అయిన జంపాల ప్రసాద్ కు బాధ్యత అప్పగించాడు..అలా జంపాల అరుణోదయ ఏర్పాటులో ప్రధాన భూమికపోషించాడు.. అరుణోదయ కళారూపాల రచనలో కానూరిదే అధిక భాగస్వామ్యం.. ‘భూమి భాగోతం’ నాటిక వంగపండు రాశారు మిగతావన్ని కానూరి రచించినవే.. 1984లో ఎంఎల్ పార్టీ చీలిపోయాక పార్టీపత్రిక ప్రజాపథాపేరుతో మరోవర్గంఏర్పడింది.. అప్పుడు నాగన్నను సాంస్కృతికదళం రాష్ర్టకార్యదర్శిగా ఎన్నుకున్నారు.. 2005 దాకా ఆ పదవిలో సేవలందించాడు మొదటి, రెండో మహాసభలు ఒంగోలు, గుంటూరులలో జరుగగా. 2005లో నిజామాబాద్ లో జరిగిన మూడవ మహాసభలో రాష్ర ్టఅధ్యక్షుడ్ని చేశారు..
ఎమర్జెన్సీ సమయంలో నాగన్న కేసులకు గురయ్యాడు..ప్రభుత్వవ్యతిరేక ప్రజాచైతన్య పాటలు పాడుతున్నందుకుగానూ.. అతన్ని అరెస్ట్ చేసారు ప్రభాత్ టాకీస్ వద్ద ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు.. సంఘం కార్యకలాపాలు నమోదు చేసిన అతని డైరీ పోలీసులకు దొరికింది.. అండర్ గ్రవుండ్ నాయకుల వివరాలు అందులో ఉన్నాయి..దివాకర్ కి కొరియర్ గా పనిచేసిన వివరాలు పోలీసులకు చిక్కాయి.. మిర్చి ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మయూరిసెంటర్‌లో ఆందోళణ చేసిననదుకు పోలీసులు కామ్రేడ్ గడ్డం వెంకట్రామయ్య, నాగన్న, అతని భార్య లక్ష్మి సహా మరో 160 మందిని అరెస్ట్ చేశారు ఈ సంఘటన సమయంలో నాగన్న భార్య లక్ష్మి పోలీసుల దెబ్బలకు గురయ్యింది.. తరువాత నాగన్నను ముషీరాబాద్ జైలుకు, లక్ష్మి ఇతర మహ్ళలను చంచల్ గూడ జైలుకుపంపారు..అలా ఆమె అతని జీవన సహచరి మాత్రమేకాదు, పాటల,ఉద్యమ, కేసుల,జైలు, సహచరి కూడా అయ్యింది .. ఆకేసుకు సంబంధించిన కోర్టు వాయిదాకు హాజరవ్వాలని కిక్కిరిసిన రైల్లో ఫుట్ బోర్డ్ పై నిలుచోని శ్రీకాకుళం జిల్లా పలాసనుంచి ఖమ్మం వచ్చాడు.. జైలు జీవితంలో నిరాహార దీక్ష చేశారు.. ప్రజాసమస్యపై పోరాడుతున్న ఉద్యమకారులను విడిచిపెట్టాలని అసెంబ్లీలో చర్చకూడా జరిగింది..
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఉభ్య గోదావరి జిల్లాల గోదావరి పరివాహక ప్రాంతంలో గిరిజనులు దోపిడికి పీడనలు గురయ్యేవారు. వామపక్ష పార్టీలువిప్లవ ఫందా ఏర్పడ్డాక వారితరపున పార్టీపనిచేసి అండగా నిలిచాయి.అందుకే గోదావరిలోయ ఉద్యమం అయ్యింది..
నాగన్న తనశిష్యులను తనంతగా ఎదగనిచ్చాడు అంటారు తనకు ప్రత్యక్షంగా పరోక్షంగా వందలమంది శిష్యులున్నారు ఉన్నారు వాళ్ళలో పది పన్నెండు మంది బాగా ప్రకాశిస్తున్నారు, కానీ అతను వాళ్లను తన సహచరులుగానే భావిస్తాడు .. ‘వాళ్లను నేను ఎదగనివ్వటం కాదు అది వాళ్ల ప్రతిభకు నిదర్శనం’ అని అంటాడు.
ఆర్ నారాయణ మూర్తి తోడ్పాటుతో ఆయన సినిమాలకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతంలో రెండు పాటలు పాడాడు నాగన్న ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ’ అన్న పాటతోపాటు ..‘ఆగదు ఆగదు’ అనే గీతాన్ని కూడా మరో సినిమాకు పాడించారు..ప్రజా కళాకారుడిగా ఉద్యమ గీతాలు పాడేందుకే ఆసక్తిచూపే నాగన్న.. ఆతరువాత నేను సినిమాలకు ప్రయత్నించలేదు..
గాయకుడేకాదు నాగన్న గేయరచయిత గా కూడా కొంత ప్రయత్నించాడు. సారా ఉద్యమం కోసం మూడుపాటలు రాశాడు. పాటల రచనలో తన గురువు అప్పుడు మయూరి సెంటర్ బ్రిడ్జి , విజయకుమార్ హాస్పటల్ దగ్గర ప్రగతి ట్యుటోరియల్ నడిపిన జీవన్ అభ్యుదయ కవి కూడా అయిన జీవన్ నాగన్న రాసిన వాటిని చదివిసలహాలిచ్చేవారు.. నాగన్నకు పాటల్లో కానూరి ఎంతో సాహిత్యంలో జీవన్‌అంత.. ఆయన విరసం నేత, జైలు జీవితమూ అనుభవించిన చరిత్ర గల వాడు.. ‘నీబాట ప్రజబాట, నీ ఆచరణ విప్లవమూ, బతుకంతా పోరాటం’ అనే పాట నాగన్నపాడిన మొదటిపాట, జీవన్ ‘ఎర్రపూల వనంలోన నగదారిలో’. వై వెంకన్న రాసిన ‘వందేళ్ళ ఉయ్యాలకు వందనాలు’..తనకు ఇష్టమైన పాట..
‘నాగన్నకు రావలసినంత గుర్తింపు రాలేదన్న అసంతప్తి ‘ ఉందా..అని ఎవరన్నా సందేహపడితే ‘గుర్తింపుకోసం నేను ఉద్యమంలోకి రాలేదు.. పాటలు పాడుతూ పోరుదారిలో సాగాను నాకు తగిన గుర్తింపే దక్కింది..నేను పాటను ఆశ్రయించకపోతే నేను మా ఊరిలోనే తెలిసేవాడ్ని..కానీ ఇపుడు నా గొంతు గోదారిలోయకంతా తెలుసు. సభలకు హాజరైన విప్లవ, వామపక్ష అభిమానులు, మేధావులు, అభ్యుదయవాదులు చీటీలు రాసి మరీ నాపాట పాడాలని కోరేవారు.. దేశ ప్రధాన నగరాలైన ఢిల్లీ, కలకత్తా, సూరత్, చెన్నై లలో కూడా ప్రదర్శణలిచ్చా.. నేను కోల్పోయిందేం లేదు సంపాదించుకున్న కళాభిమానమే ఎక్కువ ‘అని సంతృప్తిని వ్యక్తం చేస్తాడు..’ఎన్నెన్ని సమరాలు, ఎన్ని బలిదానాలు.. ఎన్నెన్ని త్యాగపూరిత పోరు పల్లవుల్ని, చరణాల్ని తాకుతూ ముందుకుసాగానో అనిపిస్తుంది.. పాటలందించిన ప్రజాకవి అన్నలందరికి నమస్సులు’ అని వినమ్రంగా చెబుతాడు..’పార్టీలో చీలికలు ఉద్యమానికి అవరోధమయ్యాయి.. చీలికలు నామనసునెంతో బాధించాయి.. ఎదగాల్సినంత ఎదగలేకపోవటానికి చీలికలు కారణమయ్యాయి, విప్లవ వామపక్షమే అన్యాయాలకు గొడ్డలిపెట్టు బాధితులకు అండ…విప్లవం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది ‘అని విప్లవ కాంక్షను వ్యక్తం చేస్తాడు…
విప్లవ సాంస్కృతిక సంఘం అరుణోదయ సాధారణ కార్యకర్త నుంచి రాష్ర్ట కమిటీ సారథిగా ప్రయాణించిన ఆయన 48 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానపు సమీక్ష సభ గత డిసెంబర్ 26 న ఖమ్మం లోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆయన మిత్రులు, శిష్యులు, అభిమానులు, సహచరుల మధ్య కోలాహలంగా జరిగింది… సాధారణంగా చారిత్రక ఈవెంట్ కోసం ల్యాండ్ మార్క్ ఇయర్ ను ప్రాతిపదికగా తీసుకుంటారు కాపాటల ప్రస్థానపు 48 వ ఏడాదిని ఎందుకు తీసుకున్నారు..కానీ ఇటీవల హఠాత్తుగా సభలు ఏర్పాటవుతున్నాయి..
దళిత బహుజన సంఘం తరపున జిలుకర శ్రీనివాస్ మచ్చా దేవేందర్ గతేడాది ఫిబ్రవరి 21 న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మొదట జరిపారు.. ఆ తరువాత ఖమ్మం లోని నాగన్న మిత్రులు స్పర్శ భాస్కర్, వేణు, ఉడుగు వెంకటేశ్వర్లు, బిచ్చాల తిరుమలరావులు ఖమ్మం లో గతేడాది డిసెంబర్ 26 న నాగన్న 48 ఏళ్ళ పాటల ప్రస్థాన సమీక్ష పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన శిష్యులు, ఉద్యమ సహచరులు, విప్లవోద్యమ గీతాల అభిమానులు, అభ్యుదయ కాముకులైన మేధావులు తరలిరావటంతో భక్తరామదాసు కళాక్షేత్రం కిక్కిరిసింది.. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి గోరటివెంకన్న, సుద్దాల అశోక్ తేజ, ఆర్ నారాయణ మూర్తి రావాల్సి ఉన్నప్పటికీ వారు అంతకుముందే ఆతేదీలో ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మాటఇచ్చి ఉండటాన హాజరుకాలేకపోయారు…
‘నీ అనారోగ్య సమస్యను దష్టిలో పెట్టుకొని ఈకార్యక్రమాలను భుజాలకెత్తుకుంటున్నారా’ అని కొందరు నాగన్ననే నేరుగా అడిగినప్పుడు ‘ అణచివేతను, నిర్భందాన్ని బద్దలుకొట్టి భయాన్ని ఎదురించే పాటకుపుట్టుకతప్ప మరణంరాదు పాటను తుపాకిలా భుజానమోసే గాయకుడికి మత్యుభయంలేదు ‘ అని తనదైనశైలిలో సమాధానమిచ్చాడు నాగన్న..

కంచర్ల శ్రీనివాస్
9640311380

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News