ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా బిజెపి‘గూండాయిజానికి’ పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఈ నెల 5న జరగనున్న ఎన్నికల్లో ఆప్ ‘నిర్ణయాత్మక విజయం’ దిశగా సాగుతోందని, ఇది బిజెపి నేతలను, ముఖ్యంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను ‘కంగు తినిపించింది, దిక్కుతోచని స్థితికి నెట్టింది’ అని చెప్పారు. ‘ఆప్ అఖండ విజయం సాధించబోతోంది, అమిత్ షా కంగు తిన్నారు. ఓటమి తప్పదని గ్రహించినందున బిజెపి గూండాగిరికి దిగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. బిజెపి కార్యకర్తలు బెదరిస్తున్నారని, ఆప్ వాలంటీర్లు, మద్దతుదారులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘మా నాయకులు, మద్దతుదారులను బిజెపిలో చేరాలని, లేకపోతే అరెస్టు, దాడులను ఎదుర్కోవలసి వస్తుందని బెదరిస్తున్నారు. కానీ, మమ్మల్ని భయపెట్టజాలరు’ అని ఆయన చెప్పారు.
అటువంటి ‘బెదరింపు ఎత్తుగడలను’ ఢిల్లీ సహించబోదని ఆయన స్పష్టం చేశారు. బెదరింపుల ఆరోపణలకు స్పందనగా ‘ఎక్స్’లో ‘అమిత్‌షాకీగూండాగర్దీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ‘దాడి, బెదరింపు, హెచ్చరిక’ గురించిన తమ అనుభవాలను ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించుకుని పంచుకోవలసిందిగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘బిజెపికి ఢిల్లీకి ఏ లక్షమూ లేదు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ లేరు, అభివృద్ధి అజెండా ఏదీ లేదు. వారికి ఉన్నది అంతా గూండాయిజమే. వోట్ల ద్వారా కాకుండా భయపెట్టడం ద్వారా గెలవాలని వారు కోరుకుంటున్నారు’ అని కేజ్రీవాల్ విమర్శించారు. నగర భద్రత, ప్రజాస్వామిక సమగ్రత కోసం బిజెపికి వ్యతిరేకంగా సంఘటితం కావలసిందిగా ఢిల్లీ వాసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 5న జరగనుండా 8న ఫలితాలు వెలువడనున్నాయి.