గాంధీనగర్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు ముందు సిఎం అభ్యర్థిగా ఎవరుండాలనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.ఈ సర్వేలో భగవంత్ సింగ్ మాన్‌కే అందరూ పట్టం కట్టారు. దీంతో ఆయననే తమ సిఎం అభ్యర్థిగా ప్రకటించారు కేజ్రీవాల్. అనంతరం ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం,మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్ జెండా ఎగరేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోనూ పంజాబ్ ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు కేజ్రీవాల్. సిఎం అభ్యర్థిని ఎన్నుకునే చాయిస్‌ను అక్కడి ప్రజలకే ఇచ్చారు. శనివారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
గుజరాత్‌లో ఆప్ ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందో నవంబర్ 3లోగా చెప్పాలని ఓ ఫోన్ నంబర్, ఇ మెయిల్ ఐడి ఇచ్చారు. నవంబర్ 4న ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. అలాగే గుజరాత్‌లో అధికార బిజెపిపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఐదేళ్లకు ఆ పార్టీ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో ధరల పెరుగుదల పెద్ద సమస్యగా మారిందన్నారు. ఏడాది క్రితం సిఎం విజయ్ రూపానీని తప్పించి భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా బిజెపి నియమించిందని గుర్తు చేశారు. కానీ ఒక్కరి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ముఖమంత్రిని మార్చారని చెప్పారు. తాము బిజెపిలా కాదని, సిఎం అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయాన్ని పూర్తిగా ప్రజలకే వదిలేస్తామని వివరించారు. గుజరాత్‌లో ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని ఆప్ పట్టుదలతో ఉంది. అందుకే కేజ్రీవాల్ తరచూ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. బిజెపికి బలంగా ఉన్న హిందూ ఓటు బ్యాంక్‌ను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కరెన్సీ నోట్లపై గాంధీతో పాటుగా లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలను ముద్రించాలని డిమాండ్ చేస్తూ తాజాగా ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు.
Arvind Kejriwal asks Gujarat people on AAP CM Candidate