Sunday, December 22, 2024

ముగిసిన బెయిల్.. కేజ్రీవాల్ తిరిగి జైలుకు

- Advertisement -
- Advertisement -

తాత్కాలిక బెయిల్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం సరెండర్ అయ్యారు. తిరిగి స్థానిక తీహార్ జైలుకు చేరుకున్నారు. మూడువారాల పాటు ఆయనకు బెయిల్ దక్కింది. ఈ క్రమంలో ఎన్నికల సభలలో పాల్గొన్నారు. తన బెయిల్ గడువును పొడిగించుకునేందుకు ఆయన ప్రయత్నించినా వీలు కాలేదు. అనారోగ్య సమస్యలు, ప్రత్యేకించి షుగర్, బిపి వంటివి ఉన్నాయని, తనకు మరో పది రోజుల బెయిల్ అవసరం అని కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. కానీ ఇందుకు సమ్మతి దక్కలేదు. నిన్నటితో (శనివారం) కేజ్రీవాల్ బెయిల్ పరిధి ముగిసింది. కేజ్రీవాల్‌కు జైలులో వైద్య సిబ్బంది పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, బిపిల రికార్డులను అధికారులు నమోదు చేసుకున్నారు. జైలుకు బయలుదేరడానికి ముందు కేజ్రీవాల్ ఆప్ ప్రధాన కార్యాయలంలో నేతలతో కార్యకర్తలతో మాట్లాడారు.

తాను తిరిగి జైలుకు వెళ్లుతున్నానని, మద్యం స్కామ్ పేరిట తప్పుడు కేసులతో తనను జైలుకు పంపించారని పేర్కొన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు తనకు ఈ శిక్ష వేశారని విమర్శించారు. ఈ 21 రోజుల బెయిల్ సమయం తనకు విలువైనదని, ఒక్క క్షణం కూడా వృధాచేయకుండా గడిపానని, దేశాన్ని మునుపటి పాలన నుంచి రక్షించేందుకు ప్రచారానికి దిగానని, ఆప్ కీలకం కాదనిదేశం ముఖ్యమని, తరువాత పార్టీ ప్రధానం అన్నారు. బిజెపి మూడో సారి అధికారం అనేది ఎగ్జిట్‌పోల్స్ బూటకపు కథ అన్నారు. మంగళవారం ఫలితాలు ఏమిటనేవి స్పష్టం అవుతాయని , ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కేవలం మైండ్‌గేమ్స్ అని విమర్శించారు .

విపక్షాలను దెబ్బతీసేందుకు ఆడే ఆట అన్నారు. భారీ భద్రత, ట్రాఫిక్ నిలిపివేత నడుమ కేజ్రీవాల్ జైలుకు చేరారు. సరెండర్‌కు ముందు ఆయన కేజ్రీవాల్ రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద నివాళులు అర్పించారు. కన్హాట్‌ప్లేస్ ప్రాంతంలో వెలిసిన హనుమాన్ దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నేతలు అతిషి, కైలాష్ గహ్లోట్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్‌సింగ్, రాఖీ బిర్లా ఇతర నేతలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News