Sunday, November 17, 2024

లిక్కర్ వ్యాపారితో కేజ్రీవాల్ వీడియో కాల్: ఇడి చార్జిషీట్‌లో ఆరోపణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభోకోణంలో సంపాదించిన సొమ్మును గోవాలో ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వాడుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం ఆరోపించింది. ఈ కుంభకోణంలో లభించిన సొమ్ములో కొంత బాగాన్ని ఎన్నికల ప్రచారానికి ఆప్ ఉపయోగించిందని గురువారం ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన రెండవ చార్జిషీట్‌లో ఇడి ఆరోపించింది. ఆప్‌కు చెందిన సర్వే బృందాల కార్యకర్తలకు రూ. 70 లక్షలను నగదు రూపంలో చెల్లింపులు జరిగినట్లు ఇడి పేర్కొంది.

గోవా ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులకు నగదు చెల్లింపులు జరిపినట్లు ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ వెల్లడించినట్లు ఇడి తెలిపింది. వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితతో కూడిన సౌత్ గ్రూపు నుంచి ఆప్ తరఫున విజయ్ నాయర రూ 100 కోట్లు ముడుపులుగా పుచ్చుకున్నారని ఇడి ఆరోపించింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరాతో కుమ్మక్కై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అభిషేక్ బోయినపల్లి ఈ నగదు బదిలీ జరిపినట్లు ఇడి ఆరోపించింది.

ఈ కేసులో అదనపు చార్జిషీట్‌ను ఇడి గురువారం రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. అదనపు చార్జిషీట్‌లో నిందితులుగా విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయిన్‌పల్లి, అమిత్ అరోరా పేర్లను ఇడి చేర్చింది. ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరును ఇడి పేర్కొనలేదు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఇడి కోర్టుకు తెలియచేసింది. ఆప్ తరఫున విజయ్ నాయర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇండోస్పిరిట్స్ చైర్మన్ సమీర్ మహేంద్రు మధ్య వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఇడి ఆరోపించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో లైసెన్సుల కోసం అడ్వాన్సుగా సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్లు ఆప్ నాయకుల తరఫున విజయ్ నాయర్ అందుకున్నారని ఇడి ఆరోపించింది. విజయ్ నా మనిషి..అతడిని మీరు నమ్మి మీరు ముందుకు సాగవచ్చు అని సమీర్ మహేంద్రుకు కేజ్రీవాల్ భరోసా ఇచ్చారని కూడా ఇడి తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఇలా ఉండగా ఇడి దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇది పూర్తిగా కల్పితమని ఆయన అభివర్ణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News