Wednesday, January 22, 2025

కేజ్రీవాల్ విశాస పరీక్ష

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం మరోసారి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. నిజానికి ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి 62 మంది సభ్యులున్నారు. ప్రతిపక్ష బిజెపికి ఉన్న సభ్యులు ఎనిమిది మందే. వీరిలో ఏడుగురిని సభా కార్యకాలాపాలకు అడ్డుతగులుతున్నారన్న కారణంపై స్పీకర్ శుక్రవారం సస్పెండ్ చేశారు. అంటే ఆ పార్టీకి మిగిలింది ఒక్కరే. తీర్మానానికి సభకు హాజరైన 54 మంది ఆప్ సభ్యులు మూజువాణీ ఓటు ద్వారా మద్దతు తెలియజేయడంతో తీర్మానం నెగ్గింది. తీర్మానంపై చర్చ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ 2024లో కాకపోయినా 2029 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే ఆప్ లక్షమని ప్రకటించారు. పార్టీ స్థాపించిన గత 12 సంవత్సరాల్లోనే ఆమ్‌ఆద్మీ పార్టీ దేశంలో మూడో అతి పెద్ద పార్టీగా నిలిచిందని, రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని, బిజెపికి అతిపెద్ద సవాలుగా నిలిచిందని అందుకే తమ పార్టీ అంటే బిజెపి భయపడుతోందన్నారు.

తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి శత విధాలుగా ప్రయత్నిస్తూనే వస్తోందని, అయినా ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తనను లొంగదీసుకోవడానికి కమలం పార్టీ ఎలా సామదాన భేదదండోపాయాలను ప్రయోగించిందో వివరించారు. ఢిల్లీ ప్రజలకు ఇదంతా బాగా తెలుసునని అన్నారు. నిజానికి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు, సిఎంకు మధ్య నిత్యం తగవులే. రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారిని బదిలీ చేసినా సరే దానికి ఎల్‌జి అడ్డుపడే వారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఏ అధికారాలూ లేకపోవడం ఏమిటని భావించిన ఆప్ సర్కార్ ఎల్‌జి నిర్ణయాలపై కోర్టు మెట్లు ఎన్నో సార్లు ఎక్కింది. ఒక దశలో సుప్రీంకోర్టు ప్రతి దానికి మీరు న్యాయస్థానానికి వచ్చే బదులు కూర్చుని చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోలేరా? అని సలహా కూడా ఇచ్చింది.

పరిపాలన విషయంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, అందులో లెఫ్ట్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవడం సరికాదని కూడా స్పష్టం చేసింది. ఇంత జరిగినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్ సర్కార్‌కు చిక్కులు సృష్టించడం మానలేదు. నిజానికి తమ మాట వినని విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ల ద్వారా సమస్యలు సృష్టించడం బిజెపికి కొత్తేమీ కాదు. తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠం నచ్చలేదన్న సాకుతో కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి సభ నుంచి వెళ్లిపోయారు. నిజానికి ఏ రాష్ట్రంలోనైనా, చివరికి కేంద్రంలోనైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్నే గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా చదవడం సంప్రదాయం. అయితే తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె ప్రభుత్వంపై మొదటి నుంచీ కారాలు మిరియాలు నూరుతున్న గవర్నర్ ఆ సంప్రదాయానికి కూడా తిలోదకాలిచ్చారు.

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ విశ్వాస ప్రకటనను కోరడం రెండేళ్లలో ఇది మూడోసారి. 2022 ఆగస్టులో ఒకసారి, 2023 మార్చిలో మరోసారి కేజ్రీవాల్ ప్రభుత్వం అసెంబ్లీ విశ్వాసం కోరింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇడి దాఖలు చేసిన కేసులో ఢిల్లీ కోర్టులో విచారణకు హాజరైన రోజునే కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస ప్రకటన కోరారు. ఇడి అయిదు సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు కావడంతో విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదంటూ ఇడి కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని కేజ్రీవాల్ కోరడంతో కోర్టు అనుమతించింది. దీంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. అయితే లిక్కర్ స్కామ్ కేసు అంతా బూటకమని కేజ్రీవాల్ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అంతకు ముందు మనీలాండరింగ్ ఆరోపణలపై మరో మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టు కాగా, వారిద్దరూ ఇంకా జైల్లోనే ఉన్నారు.

అదే పార్టీకి చెందిన ఎంపి సంజయ్ సింగ్ కూడా లిక్కర్ స్కామ్ కేసులోనే అరెస్టయ్యారు. ఇలా ఇంకెంత మందిని అరెస్టు చేస్తారోనని కేజ్రీవాల్‌తో పాటుగా, ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దమ్ముంటే ఇదే ఆరోపణపై పార్లమెంటు ఎన్నికలకు ముందే ఢిల్లీ ప్రజల తీర్పును పొందాలని కమలనాథులకు కేజ్రీవాల్ సవాలు విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News