న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరాచకత్వానికి ప్రతీక అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం ఇక్కడ మండిపడ్డారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి , గణేశుడి చిత్రాలను పొందుపరచాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తికి సంబంధించి విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి సమాధానమిచ్చారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే అరవింద్ కేజ్రీవాల్ అరాచకానికి ప్రతీక అని, బూటకపు మాటలు మాట్లాడుతున్నాడని, తన బూటకపుతనం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త ప్రచారాలు చేస్తున్నాడని ఠాకూర్ అన్నారు.
ఢిల్లీలోని మౌల్వీలకు ఇచ్చిన విధంగానే ఆలయ పూజారులు, గురుద్వారా గ్రంథులు, చర్చి ప్రీస్ట్ లకు కూడా ఆయన ప్రభుత్వం రూ.18,000 అందజేస్తుందా? అని ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను కేంద్ర మంత్రి నిలదీశారు. హిమాచల్ ప్రదేశ్‌లో జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ “ఛార్జిషీట్” గురించి ఠాకూర్ మాట్లాడుతూ, బెయిల్‌పై ఉన్నవారికి ఇతరులపై “ఛార్జ్‌షీట్” జారీ చేసే నైతిక హక్కు లేదని అన్నారు.