Friday, November 22, 2024

శరద్ పవార్‌తో కేజ్రీవాల్ భేటీ

- Advertisement -
- Advertisement -

ముంబయి: బిజెపియేతర పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తే ఢిల్లీలోఅధికారుల సర్వీసులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో ఓడించవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు.కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు వివిధ పార్టీల నేతలను కేజ్రీవాల్ కలుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కేజ్రీవాల్ సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్‌తో కలిసి రెండు రోజులు ముంబయి పర్యటనకు వచ్చిన కేజ్రీవాల్ బుధవారం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యారు.

గురువారం ఆయన ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అతిషి, రాఘవ్ చద్దా, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ కూడా పాల్గొన్నారు. ముంబయిలోని యశ్వంత్‌రావు చవాన్ సెంటర్‌లో ఈ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభలో ఆప్‌కు ఎన్‌సిపి మద్దతు ఇస్తుందని చెప్పారు. రాజ్యసభలో అధికార పార్టీ సహా ఏ పార్టీకి మెజారిటీ లేదు.‘జనం గనుక బిజెపియేతర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అప్పుడు బిజెపి ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి మూడు రకాల పద్ధతులకు దిగుతుందని, అధికార పక్ష ఎంఎల్‌ఎలను కొనడం, ఇడి, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల భయాన్ని చూపించడం లేదా ఎన్నికైన ప్రభుత్వం పని చేయకుండా చూడడానికి ఆర్డినెన్స్‌లను తీసుకు రావడం చేస్తుంది’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.

ఆర్డినెన్స్‌లను ఉపయోగించి ఎన్నికైన ప్రభుత్వాలు పని చేయకుండా చూడడం దేశానికి మంచిది కాదని కేజ్రీవాల్ అన్నారు. శరద్ పవార్ దేశంలోని గొప్ప నేతల్లో ఒకరని కేజ్రీవాల్ అంటూ కేంద ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ జరుపుతున్న పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ, ఈ ఆర్డినెన్స్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. బిజెపియేతర పార్టీలన్నీ ఈ విషయంలో కేజ్రీవాల్‌కు మద్దతు ఇచ్చేలా చూడడం తమ విధి అని ఆయన అన్నారు. పార్లమెంటరీ ప్రజస్వామ్యం మనుగడకోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News