Monday, January 20, 2025

కేంద్రం ఆర్డినెన్సుని తేవడం సుప్రీంకోర్టుని నమ్మకపోవడమే : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ముంబై : ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సుప్రీం కోర్టును మోడీ ప్రభుత్వం విశ్వసించడం లేదన్న అభిప్రాయం సూచిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ముంబైలో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరేతో బుధవారం సమావేశమైన తరువాత థాకరే నివాసంలోఆయన మాట్లాడారు. ముంబై సబర్బన్ బంద్రాలో థాకరే ప్రయివేట్ నివాసం మాతోశ్రీలో ఈ సమావేశం జరిగింది. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఢిల్లీ మంత్రి అతిషీ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అయిన తరువాత కేజ్రీవాల్, థాకరే పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సిబిఐ, ఈడీ సంస్థలను ఉపయోగించి రాష్ట్రప్రభుత్వాలను పడగొట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆర్డిన్‌న్సు బిల్లు రూపంలో రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పుడు పోరాటం కోసం ఢిల్లీ ప్రజలకు మద్దతు ఇస్తామని థాకరే హామీ ఇచ్చారని కేజ్రీవాల్ తెలిపారు. రాజ్యసభలో ఇది సెమీ ఫైనల్ వంటిదని, రాజ్యసభలో ఈ బిల్లు వీగిపోతే మోడీ ప్రభుత్వం 2024లో తిరిగి అధికారం లోకి రాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో శివసేన సభ్యులు ముగ్గురు ఉన్నారు. థాకరే మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి సుప్రీం కోర్టు ఆదేశం చాలా ముఖ్యమైనదని థాకరే స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారోవారిని ఓడించడమే తమ సమష్టి లక్షమని , ఈసారి ట్రైన్ మిస్సయితే ఇక ప్రజాస్వామ్యం అంటూ ఉండబోదని వ్యాఖ్యానించారు. అందుకని దేశాన్ని , రాజ్యాంగాన్ని రక్షించడానికి తాము ఏకమౌతున్నామని చెప్పారు. సుప్రీం కోర్టు ఇచ్చిన అన్ని అధికారాలను ఆర్డినెన్సు ద్వారా వెనక్కు తీసుకోడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం ఉండాలని, అదే ప్రజలకు జవాబుదారీ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలం కావడంతో కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు.

కమలనాధులు అహంకారులుగా తయారయ్యారని, వారిలో ఒకరు దురహంకారి అయ్యారని, చాలా స్వార్థపరుడయ్యాడని, అటువంటి దురహంకారి, స్వార్థపరుడు దేశాన్ని పాలించలేడని ప్రధాని మోడీ పేరు బయటకు ప్రస్తావించకుండా విమర్శించారు. ఎన్నికైన వారు కాకుండా కొంతమంది ఎంపికైన వారు ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టేయడమేనని పంజాబ్ సిఎం భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్లు బీజేపీ ప్రధాన కార్యాలయాలుగా తయారయ్యాయని, గవర్నర్లు బీజేపీ స్టార్ క్యాంపైనర్లుగా మారారని ఆక్షేపించారు. ఆర్డినెన్స్‌పై వ్యతిరేక పోరాటంలో భాగంగా దేశం మొత్తం మీద మద్దతు కూడగట్టడానికి మంగళవారం కేజ్రీవాల్, భగవంత్ మాన్ కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News