ఉత్తరాఖండ్ ప్రజలకు ఆప్ అధినేత కేజ్రీవాల్ హామీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విధి నిర్వహణలో మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. సమ్మాన్‌రాశి పేరుతో ఈ సహాయం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం డెహ్రాడూన్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో నవ నిర్మాణ్ ర్యాలీ పేరుతో ఆప్ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఆర్మీలో పని చేసి రిటైరైనవారికి నేరుగా ఉద్యోగాలు కల్పిస్తామని కూడా కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రాకముందు ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న సమయంలోనే అమర జవాన్ల కుటుంబాలకు తగిన సహకారం లేదని గుర్తించానని ఆయన తెలిపారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రి కాగానే అమర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తానని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నానని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అంతకుముందు అమరజవాన్ల భార్యలకు కుట్టు మిషన్లు మాత్రమే ఇచ్చేవారని కేజ్రీవాల్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లో తాము అధికారం చేపట్టగానే కల్నల్ కోత్యాల్(ఆప్ సిఎం అభ్యర్థి) అమర జవాన్ల కుటుంబాలను పరామర్శిస్తారని కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరాఖండ్ నుంచి సైన్యంలో చేరినవారు అధిక సంఖ్యలో ఉన్నారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. త్వరలో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ ఇప్పటికే పలు హామీలను ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. నిరంతర విద్యుత్, యువతకు ఉద్యోగాలు, ఉద్యోగాల్లో చేరేదాకా నెలకు రూ.5000 చొప్పున భృతి, మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం హామీలను ఆప్ ఇచ్చింది.